1.
బతుకుతూ బతుకుతూ కనీసం ఒక్కసారైనా నిజం చెప్తామని నమ్మే దైర్యం ముందు ఆత్మకీ అసౌకర్యముంటుందని తెలిసీ, సగం గాయం చేసుకునీ కుట్లేసుకునీ, కుదుటపడీ భవిష్యత్ మీదకి పోదాం పద.

ఇంతకుముందు కూచున్న చోటులో మళ్ళీ కూచోవల్సివస్తే, ఒక బాధో సంతోషమో తప్పకుండా సొంతమవ్వాలి. పాపం తాలూకా ప్రేమనుకున్నదాన్నీ, కొద్దిగా పుణ్యం లెక్కలోకొచ్చే అమాయకత్వాన్నీ తడిమీ తడిమీ పట్టుకుందాం . జరిగిందే జరిగింది. జరిగిందే జరుగుతుంది. జరిగిందే జరగాల్సిఉంది. జీవితం ఇంతకుముందు కూడా అందరికీ ఇంతే అనేదాకా పోదాం
2.
చదివిన బల్లోనుంచి మాసినబట్టలు ఉతుక్కోకుండానే, తిరిగిన ఊళ్ళోనుంచి వొచ్చిపడ్డ యవ్వనాన్ని దాటకుండానే, భవిష్యత్ మీదకి ఎదిగిపోదాం పద. ఆరుద్రపురుగు అమ్మకి పుట్టినట్టు అందమైన రంగేదో నీలో ఉందని తెలీదు. అగరొత్తి కొనరంగు బొట్టుబిళ్ళతో మెరుస్తూ, రుతువుకి తగ్గ రంగుతో కనబడీ. . ముదురుమోదుగు తనువుతో ఈ అడివినిండిన హృదయం ముందు అంతలా పూసినందుకు అది పాపమని నీకు తెలీనందుకూ నాలో రంగుల్ని రేపెవరకూ పోదాం


3.పొగడ్డం పరిపాటేనని ప్రపంచానికి తెలిసినా, పుప్పొడిరాసుకు తిరిగే పువ్వులాగున్నావనీ మైనంలానే మెరుస్తున్నావనీ, అదనీ ఇదనీ అసౌకర్యం అంచున నిన్ను నిలబెట్టానని అనిపించికూడా, అధ్యాయం పూర్తిచేసేదాకా అభ్యాసం ఆపను. నవ్వూ నువ్వూ కవలపిల్లలు ఏం చెబుతున్నా చూసేసినట్టూ, ఏం విన్నా చేసినట్టూ, స్వాగతం పలికే మామిడాకుల మనసు తో పచ్చటి చేతులకి పసుపూ మెత్తని కాళ్ళకి పారాణి రాసుకునే దాకా, పందిట్లో నిన్ను చూసీ ఆ తర్వాత ఓ ఏడాదికి మీ వూరేపుకి వొస్తే పిల్లల ఒళ్ళు తుడుస్తూ మా అమ్మను మించిన పెద్దరికం నువ్వు మీదేసుకున్నదాకా పోదాం

4. నీడ తప్ప ఏదీ వెంటరాలేని కాలంతో కల్సి తిరిగి. గోడుతప్ప కొత్తగా గొంతులోంచి ఇంకేమీ పుట్టుకురాని పాటనెత్తుకున్నాక అలిసిపోయిన అనగనగా కధలలో మనం ఊకొడుతుంటేనే బోల్డంత నీతి. నీ పిల్లాడికి నీళ్ళేసుకుంటూ, నాతో మాట్లాడుతూ నా పేరాడికి పెట్టానని చెబితే సరిపోతుంది. నువ్వూ నేనూ రాసుకున్న పేర్లలో మొదలై, పెట్టుకున్న పేర్లతో అంతమవుతూ సినిమా లెవల్లో శుభం చెప్పుకుందాం.

వ్యాఖ్యలు

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

ప్రముఖ పోస్ట్‌లు