Skip to main content

షేరాటో
పళ్లుగిట్టగరిసి కళ్ళు మూసీ తెరుస్తూ వొస్తున్నమంటనాపుకుంటూ బతిమాలుతుంటే మెల్లగా ఏల్లెంబడి ఉచ్చ ఉండుండీ కొన్ని చుక్కలు కారాక , విదుల్చుకునీ వెనక్కొంగీ రోడ్డేపు చూస్తే దూరంగా ఎక్కాల్సిన బసొస్తుంది. పనేమో పూర్తవలేదు. కాళ్ళు రెండూ ఎడంగాపెట్టి ఇంకా తినికీ,తినికీ బతిమాలుతూనే ఉన్నాను. బసు దగ్గిరపడేకొద్దీ కంగారుతో కాత గట్టిగా జిప్ లాగితే ఉన్నది కాస్తా విరిగిపోయింది. నవ్వకండి నేన్నన్నది జిప్ గురుంచేలెండి. అప్పటిదాకా ఏక్షన్ షూమీద మెరుస్తున్న ఇస్త్రీపేంటుకున్న అందమంతా దొబ్బింది. మన దర్శన భాగ్యం, భాగోతం భాగ్యనగరమెందుకు చూడాలని, ఇన్సట్ తీసేసి చూసుకుంటే పొడుగు చొక్కాలో పెద్దాపురం తిరునాల్లో గెడలుమీద నడిచే జోకర్గాడిలా ఉన్నాను. గబ్బిలాయుల్లా ఊచలుపట్టుకు వేలాడుతున్న సమరవీరుల చంకల్లో వోసన పీలుస్తూనే ఎవడిదో కాలు కాతపక్కకు జరిపి నాకాలికోసం ఖాళీ చోటు చూసుకున్నాక పట్టుకోసం ఏదీ దొరకని కారణాన ఎవడిదో ఏదో పట్టుకు చిరాకుబడిపోయాక, వాడన్నాడు. “అయ్యో భయ్యా నాకున్నదొక్కటే బెల్టు. అదీ తెగిపోయింది ఇన్సట్ చేయకపోతే మా బాస్ తిడతాడు” అంటుంటే , విభూదితో అడ్డబొట్టు మీద తెలుగూ,తమిళం కలిసిన మొకంతో దాదాపుగా ఎంకన్నబాబు రంగున్న మా ఎడిటర్ గారు గుర్తొచ్చారు, ఆయన కూడా ఇన్సట్ చేయకపోతే ఏమేమి తిడతాడో గుర్తొచ్చి ఆ పిలగాడి మొకం చూసి నవ్వుకున్నాను. చేతిలోకూడొచ్చిన జిప్ జేబులో ఏసుకున్నా కదా! ఉందో లేదో అని బసుకి ఏలాడుతూనే గాలికి సల్లబడుతున్న ఫీలింగును మొకంమ్మీద భలే కెరీ చేశాను.
అటూ ఇటూ కానీ ఓ ఫర్లాంగు దూరానికి ఆటోలెక్కలేక, అలాగని నడిచెల్లాలేక షేరాటో ఒచ్చేంతవొరకూ సచ్చినట్టాగాలి. ఆ ఒచ్చిన ఆటోలో ఏ ఒక్క చోట పిర్రమోపేందుకు ప్లేసున్నా సర్దుకుని కూచోవాలి . అంతోటి పుష్పక విమానపు వొదినగారైన ఆటోలో ఏ ఒక్కరికి మన కాలో,చెయ్యో తగిలినా శీలం పోయినంతలా పేసుపెట్టి ఇసుక్కుంటారు. బట్టలు బాగా నీటుగున్న ఒకొక్కల్లు ఎలేసినట్టు చూస్తావుంటే వేళ్ళు మండుతున్నందుకు, వేలాడుతున్నందుకూ ఎప్పుడు దిగాల్సిన చోటొస్తాదా అని చూస్తా ఉండాలి. ఇన్ని తిప్పలెందుకని ఓ సారి లిప్టడుగుదామని రోడ్డుకడ్డంగా ఏలుపెట్టి ఓ అరడజనుమందికి చూపించాక ఎవడో ఓ మహానుభావుడాపాడు. తీరా ఎక్కింతర్వాత దిగేదాకా బతికుంటే చాలు దేముడోయ్ అనుకున్నాను. ఆ దింపేసిసిన వాడు “ఇంకెప్పుడూ వేళు అలా చూపించకూడదు భయ్యా! అది వేరేమీనింగ్” అని ఎందుకన్నాడో చేన్నాళ్ల దాకా తెలీలేదు.
దిగాల్సిన స్టాపుకంటే ముందుస్టాపుకి టికెట్టు తీసుకుని దిగాల్సిన చోట్నే దిగేసి ఆదా చేశాననుకున్న ఆ రూపాయి కాస్తా కండాటరు దగ్గిరే మర్చిపోయొస్తే ఎంత చిరాకేస్తాదో తెల్సా! ఎంత వొద్దనుకున్నా ఆ చిరాకు తాలూకా చెల్లెల్ని ఇంకా మొకంమ్మీదే ఉంచుకున్నందుకేమో “ ఏందన్నా అట్లున్నవ్” దా ఎక్కు తీస్కపోతా’ అన్నాడు. ఆ అల్లా వాడి మొకమ్మీద ఆడుకుంటున్నాడా అని ఆశ్చర్యపడేంత అందంగా పలకరించాడా షేరాటోవోడు ‘ ఎయ్ జరుగురా బయ్ అన్న కూసుంటడు” అని పక్కోడితో అంటుండగానే, “ఛేంజ్ ఐదే ఉందన్నాను”. అరే కూసో అన్న నడుస్తయ్ అయ్యిగూడ పైసలే అన్నాడు. పైసలే నడుస్తాయని ప్రెపంచానికి తెలుసు. నాలాంటి నటరాజుల పర్సులో ఉన్నదెంతో సూటిగా నవ్వే ఆ షేరాటోగాళ్ళకి తెలుసు. “అన్నెపుడూ మన బండ్లనే ఎక్కుతడు అంకనే ఇంచేపాగిండ్రా” అంటూ నన్ను రోడ్డు దాటనిచ్చాడు. వాడికల్లేమంటున్నాయో వినే సాహసం చేయలేదు నేను. షేరాటో నన్నీ జీవితంతోనూ జీవితంలోనూ నడిపిస్తాది.
_కాశిరాజు

Comments

Popular posts from this blog

F1.

కొంత సేపటికి ముందు.
"స్నానానికెళ్లినట్టున్నావ్" ఫోన్ తీసుకోలేదు.

కొంత సేపటి తర్వాత
స్నానం చేస్తూ, నన్ను అర్ధం చేసుకున్నావో, అలవాటు చేసుకున్నావో
ఆలోచిస్తూ
తలపై నుంచి పోసుకున్ననీళ్లలో కలిసి ఇంకా ఇంకా కిందకి జారిపోతాను.
నీ ఒళ్లోకి, అక్కన్నుంచి సగం కలిపి నువ్వొదిలేసిన చద్దన్నం గిన్నెలోకి
అక్కన్నుంచి కొంచెం లేటుగానైనా నువ్వు కొనిచ్చిన ప్రతీ వస్తువులోకి
దూరిపోతాను.

మరికొంత సేపటి తర్వాత
మళ్లీ నీకు ఫోన్ చేసి, "ఇందాక ఏం చెప్పాలో తెలీక ఫోన్ కావాలని తీసుకోలే"దంటాను.
నువ్వేమో తెలుసులే అని కూడా అనవు. నిజంగా నవ్వుతావు
మా చిన్నిప్పుడు నువు చాలా మందికి చెప్పిన "కొంచెం ఇబ్బందుంది ఇంకొక్కరోజాగు" అన్న మాటలా ఇప్పుడు నేను
ఓ ఐదారు నిమిషాలు నిజంగా బతగ్గలిగితే చాలు నాన్నా .

కనీసం

నడుస్తూనో నటిస్తూనో
కొంత మాట్లాడుకుని, వెళ్లిపోతూ నవ్వుకునే ముఖాలమే మనం

ఇంకా కుదిరితే
అనుకుంటున్న ఇష్ట సమాధిలోకి చెరోసగం చేరిపోదాం
ముడివేయబడొద్దని నువ్వో,
ముచ్చటైనా తీరుద్దని నేనో, మళ్ళీ మళ్ళీ కనీసం కలుద్దాం.
ఇంకా కుదిరితే ...
నువ్వు సమస్తమవ్వు, నేను చివరంచుకి నడుస్తా