నెక్లెస్ రోడ్ నుంచి నేచర్ క్యూర్ దాకా టికెట్ తీసుకుని అతి దగ్గరదార్లో హాస్టల్ దాకా నడిచొచ్చి చాయోన్ని పలకరించినందుకు పెద్దగా చెప్పుకోలేని బొక్కపడింది. ఎయిర్టెల్ ఎస్సెమ్మెస్ పేక్ తొమ్మిది రూపాయల రీచార్జ్ మాదగ్గర లేదంటే మాదగ్గర లేదన్న సమాధానం ఇనీ ఇనీ ఇసుగొచ్చి బల్కం పేట బాలాజీ కిరాణందాకా నడిసొచ్చిసచ్చాక, ఆడొక దేముడు. సిరాకు నిండిన నా మొకంమీద అత్తరు జల్లిన నవ్వొకటి ఇసిరి, అక్కడుంటుందన్న ఆన్సర్ని కళ్ళతోనే సెప్పాడు. ఆతని మోము సూసి నవ్వేను నా సామిరంగ!.
అచ్చం గుమ్మడి పువ్వులాగ, తెలంగాణా గడ్డమీద ఈడొచ్చిన గడుసు గుమ్మడి పువ్వలాంటి పిల్ల "ఎక్స్క్యూజ్ మీ" అంటంటే వొయ్యారంగా జేబులో చేతులు పెట్టాక చిరిగిపోయున్న పేంటు కదా! అది కూడా ఇంటర్వ్యూల కోసం కొన్నది . చిల్లున్న జేబులోంచి చేతికేదో తగిల్తే మనది కుడిచేతి వాటం కదా చెయ్యి మార్చి ఇటేపు ఎడం పక్క జేబులోంచి తొమ్మిది రూపాయల చిల్లర ఏరేదాకా ఆపిల్ల ఇంకెంత అందంగుందో చూళ్ళేదు. 'ఎయిర్టెల్ తొమ్మిది రూపాయల ఎస్సెమ్మెస్ రీచార్జ్" చేయండన్నాను. మొద్దు కీపేడున్న నోకియా ఫోననుకుంటా ముందుకు తోసి తన పనేదో తాను చూస్కుంటా ఉంది . రోజూ వొచ్చి రీచార్జ్ చేస్కుందాం! మాటలు కలుపుదాం ఎక్సట్రా ఎక్సట్రా ఎదవేసాలన్నీ ఊహించుకుంటానే నిలుచుంటే " అయిపోయింది మెసేజ్ చూస్కోండి అంది". ఇంకొంచెం ఎక్కువ మాటాడితే ఏ ఊరిదో తెల్చేసుకోవొచ్చు అనుకుంటా షాప్ మెట్లమీంచి దిగుతుంటే వన్ వే రోడ్ లో అడ్డగాడిద గాడు హారన్ వేసి ఊహల్లోంచి ఈ ఊరోన్ని జుట్టట్టుకు లాక్కొచ్చేసాడు. ఉడ్లేండ్ పర్స్ చూసుకున్నాక ఉన్న మొత్తమెంతో తెల్సా! ఆర్రూపాయలు. ఆఖరు ఆర్రూపాయలు. అంతందంగా పలకరించిన చాయోన్ని నవ్వు పులుముకుని పలకరించాను . నట సార్వభౌముడి బామ్మర్దినన్నట్టు నాకదో గొప్ప ఎడ్వాంటేజులెండి మన నవ్వుకీ, లవ్వుకీ భలే పడిపోతారు జెనం. తల ఎటుతిప్పి ఎవల్తో మాటాడుతున్నా స్టీల్ గ్లాస్ పైకెత్తి గాజుగ్లాసులో చాయెయ్యడం ఓ ఆర్టు. చూస్తంటే భలే ముచ్చటేస్తాది. టీగ్లాస్ అంచుని ఓ గుడ్డమీదాంచి పక్కన పెడ్తాడు. ఎంత జేగర్తనుకున్నారు? మన బట్టలు పాడవకూడదంటాడు. హుందాతనం గౌరాన్నిస్తుందనీ , గౌరం దైరమిస్తాదనీ, అదనీ ఇదనీ హాస్టల్లోని అన్నం అయిపోయేదాకా చెప్తాడు. అలా చేలాసార్లు ఆ దైరమే తినిపడుకున్నాక అమీర్పేటలో ఉన్నన్నాళ్ళూ ఆఖలి తెలీలేదు. తాగిన చాయ్ గ్లాసు కిందెట్టి , అటూ ఇటూ చూసి మళ్ళీ పైకి తీస్కుని మిగిలిన చుక్క కూడా మొత్తం తాగేసాక ఆఖరి ఆర్రూపాయలూ చెల్లుబాటయ్యాయనిపించి అప్పుడు, సరిగ్గా అప్పుడు అసలినవ్వు నవ్వాను. ఇక నానకి ఫోన్ చేయాలంటే రాత్రిదాకా ఆగాలి అపుడే " ఎయిర్టెల్ టూ ఎయిర్టెల్ ఆఫర్ పంజేసేది. నాన నాతో మాటాడాక అదీ, ఇదీ అంటూ అష్టోత్తర పురాణం అబద్దాలు ఇనిపించీ ఓ పాతికొందలు ప్రెండ్గాడి ఎక్కౌంట్ లో వేయించుకోవాలి. తెల్లారాక హాస్టల్ ఫీజు కట్టి రోజూ ఫీజు ఎందుకు లేటయ్యిందో చెప్పినట్టు ఇపుడు ఆ బాలబారతం చెప్పక్కర లేకుండా ఓ ముద్దతిని పడుకోవాలి. గూద నిండింది కదా గుర్తొస్తాది నా సామిరంగా ! అమ్మా , ఆ తర్వాత అమ్మాయీ గుర్తొస్తాది. ఆఖరి ఆర్రూపాయలు ఖర్చుబెట్టిన చోట అన్నం, ఆఖలీ కొత్తగా పురుడేసుకున్నాయి.
-కాశిరాజు

Comments

Post a Comment

Popular posts from this blog

కనీసం

F1.

షేరాటో