ముందుమాట- 7


పెదాలనుంచి పెదాలగుండా మెదళ్ళలోకి ముద్దిచ్చినపుడు మనం కళ్ళు మూసుకున్నందుకే మెదడుది ప్రేమనీ, పెదాల్ది మోహమనీ తెలీలేదు . ఎంతసేపలా గుటకలేస్తావ్ ఏదో ఒకటి మాట్లాడు అన్నప్పుడు సూరీడి ఎరుపునీ చంద్రుడి తెలుపునీ పొగుడుతాను. తొక్కలోసోది చెప్పొద్దంటావు. అపుడు నేను నీ వైపు నువ్వు నావైపు చూస్తే చిర్నవ్వడం తప్పదు మనకు. లేటవుతుందా అనడిగితే నీ సమక్షంలో చీకటిపడదన్నావు. అవును అద్దరాత్రి నిద్దర్రానపుడు మాట్లాడుకునీ మాట్లాడుకునీ మనం తెల్లారిపోయాం.
 నీళ్లంటే ఇష్టమన్నావనీ నాతోపాటు తీసుకెళ్తాను. అందీ అందని తామర పువ్వుల్ని కోసిస్తాను. పూలను విదిల్చాక నీటిబొట్టు నీ బుగ్గలమీద పడ్డందుకూ నేను దాన్ని తుడుస్తున్నందుకూ తిడతావు. దానికీ మగబుద్దని పేరెడతావు. దూరంగా జరిగి కూర్చుని దగ్గరకు రాలేదెందుకని కోపగిస్తావు. నీళ్ళ లోతుని గురించీ నీటి అడుగున దాగున్నదాని గురించీ ఆలోచిస్తుంటే ఉలికిపడేట్టు రాయేస్తావ్ . నాకు నీలాగ గులకరాళ్ళకి అలక నేర్పడం తెలీదు. అందుకనే నువ్వేమన్నా అను. మళ్ళీ వచ్చి ముట్టుకుంటాను. ముద్దెట్టుకుంటాను.

వ్యాఖ్యలు

ప్రముఖ పోస్ట్‌లు