పోస్ట్‌లు

November, 2014లోని పోస్ట్‌లను చూపుతోంది

||ముందుమాట- 8 ||

ఎందుకంతలా కురుస్తావు! నేనేమడిగినా సమాధానం చెప్పకున్నందుకు నీ కళ్ళకేసి చూసాక నా మనసంతా మబ్బుపట్టుద్ది. నీ కనుగుడ్లు ఎందుకు మబ్బుల్లా మరింత నల్లగున్నాయో ఎందుకు నావైపలా చూసి మెరుస్తున్నాయో తెలిసేసుకుంటాను. నాకప్పుడు నోరుజారడం మామూలే. ఛీ ఛీ అంటూ నీకది తోచిపుచ్చడం అలవాటే. ఇంకెంతకాలం ఇలా సాధాసీదాగా ప్రేమించుకుందాం అనడుగుతాను. నువ్వేమో మిగిలిపోయిన మాటల్ని అలాగే మిగలనిస్తూ కొబ్బరి ముక్కని మాత్రం తినమని చేతికిస్తావు. అచ్చం నీకు నచ్చినట్టే కొరుక్కుతింటాను. నువ్వేమో ఆ ఆకల్ని గుర్తించేస్తావు.

వానాగిపోయింది వెల్పోదామా అనడుగుతుంటే నేలమీద పారే ఆ నీట్లో, ఆ నురగలో తేలెళ్లిపోతున్న ఏదో ఒక పుల్లను తొక్కిపెట్టి, పద నీకు నచ్చితే ప్రవాహంలో కొట్టుకుపోదాం అంటాను. చాలు నీ సోదాపు అంటుంటావు. నువ్వు చిన్నపుడు కాగిత్తప్పడవ చేసొదిలావా అనడుగుతుంటే నన్నలా నీళ్ళలోకి నిర్ధాక్షిణంగా తోసేస్తావు. అపుడు తడుస్తాం మనం అచ్చం చిన్నపిల్లల్లాగ. మనలో ఆరాటం ఆరిపోయింతర్వాత ఆ కురిసిన నీళ్ళన్నీ ఇంకిపోయింతర్వాత తడిచిన నీ దేహం చూస్తూ నా మెదడుకి మబ్బు పట్టనంతవరకూ మనం పెద్దాళ్లమన్న సంగతి నాకసలే గుర్తురాదు. మళ్ళీ నీయంతట నువ్వు కురిసేంతవరకూ…

ముందుమాట- 7

పెదాలనుంచి పెదాలగుండా మెదళ్ళలోకి ముద్దిచ్చినపుడు మనం కళ్ళు మూసుకున్నందుకే మెదడుది ప్రేమనీ, పెదాల్ది మోహమనీ తెలీలేదు . ఎంతసేపలా గుటకలేస్తావ్ ఏదో ఒకటి మాట్లాడు అన్నప్పుడు సూరీడి ఎరుపునీ చంద్రుడి తెలుపునీ పొగుడుతాను. తొక్కలోసోది చెప్పొద్దంటావు. అపుడు నేను నీ వైపు నువ్వు నావైపు చూస్తే చిర్నవ్వడం తప్పదు మనకు. లేటవుతుందా అనడిగితే నీ సమక్షంలో చీకటిపడదన్నావు. అవును అద్దరాత్రి నిద్దర్రానపుడు మాట్లాడుకునీ మాట్లాడుకునీ మనం తెల్లారిపోయాం.  నీళ్లంటే ఇష్టమన్నావనీ నాతోపాటు తీసుకెళ్తాను. అందీ అందని తామర పువ్వుల్ని కోసిస్తాను. పూలను విదిల్చాక నీటిబొట్టు నీ బుగ్గలమీద పడ్డందుకూ నేను దాన్ని తుడుస్తున్నందుకూ తిడతావు. దానికీ మగబుద్దని పేరెడతావు. దూరంగా జరిగి కూర్చుని దగ్గరకు రాలేదెందుకని కోపగిస్తావు. నీళ్ళ లోతుని గురించీ నీటి అడుగున దాగున్నదాని గురించీ ఆలోచిస్తుంటే ఉలికిపడేట్టు రాయేస్తావ్ . నాకు నీలాగ గులకరాళ్ళకి అలక నేర్పడం తెలీదు. అందుకనే నువ్వేమన్నా అను. మళ్ళీ వచ్చి ముట్టుకుంటాను. ముద్దెట్టుకుంటాను.