||ముందుమాట- 3||

ఎప్పుడూ ఏమ్మాటలవి నీకు సిగ్గేలేదా అంటుంటావు. నాకు నవ్వు రాదు అయినా నవ్వడం తప్పదు. లోలోపల లోబరచుకోవడం గురించి కుట్రపన్నుతాను. తెలిసీ లేదా తెలియక ఒకేలా ఉంటావు నువ్వు . నేను లోతుగుండెల మనిషినని ఏదీ అర్ధం కానివ్వకుండా వ్యర్ధమూ కానివ్వకుండా మసులుతానని మళ్ళీ నువ్వే అంటావు . ఇంకేదైనా చెప్పు అనేస్తాను. పెళ్ళిచేసుకుందాం అంటుంటావు. సరే తర్వాత ఏంచేద్దాం అనడిగితే పొద్దుటే చుక్కలు చూపిస్తాననీ గుమ్మం ముందు ముగ్గేస్తాననీ ఆ ముగ్గులో నన్ను దించేసి మెలికలు తిప్పిస్తానని ఏదేదో చెబుతావు. అన్నీ అలాగే ఊకొడుతూ నువ్వు లయ తప్పకుండా ఇంకేం చేస్తావు అనడుగుతాను. నేనేనా నువ్వూ చెప్పు అన్నట్లు చూస్తుంటే నీ ముగ్గుచిప్పకి ముద్దెడతాననీ , నీ మెలికలన్నిటికీ రంగద్దుతాననీ అంటాను. అంతేనా అన్నట్టు మళ్ళీ ఓ చిన్నచూపు.

        నడుస్తూ నడుస్తూ చేతికి తగిలిన గోరింటాకు రొబ్బ విరిచి ఇదంటే ఇష్టం నాకు అంటుంటావు. అవును అదీ తెచ్చిస్తానంటాను. ఇంకా వంక వెతికి నలిపేస్తాననీ ఆ గోరింటాకును నలిపేస్తాననీ ముద్దుగా ముద్దలు చుట్టి వేళ్ళచుట్టూ అంటిస్తాననీ అంటాను. కదలకుండా చేసి నీ చేతులు కదలకుండా చేసి పండిస్తాననీ గోరింటాకు పంట పండిస్తాననీ అంటాను. చీపో అంటూ ఉండబట్టలేని ఉదాత్తతతో దూరం జరిగిపోతావు.

అవును నీలోని ఉదాత్తత నా దగ్గరా ఉంది . ఎలాగంటావా? మనం ఒకర్నొకరం మించుకునీ ప్రేమించుకునీ ఆత్మల్లోంచి పారిపోయి దేహాలలోకి దాగిపోయి శ్రమించీ విశ్రమించీ చెమటతో పక్కకు వొరిగాక ఆత్మలూ దేహాలూ ఒక్కటైపోయి నిజంలోకి వస్తూ వస్తూ విన్న నీ మూలుగు నేను జీవరాగమనే అంటాను. ఏం అది ఉదాత్తత కాదా? అయితే నేనిక చెడ్డవాన్నేనని చెప్పేసెయ్

వ్యాఖ్యలు

ప్రముఖ పోస్ట్‌లు