||ముందుమాట ||

దేహమును ప్రేమించుమనీ, మోహమన్నది పెంచుమనీ ఒంటి మాటలకు అంటి పెట్టుకుని ఆ వీలు కుదుర్చుకున్న సాయంత్రాల్లో నేనడిగిన దేహానికీ, నువ్విచ్చిన సందేహానికీ అహాన్ని అక్కడ స్కలింపజేసి నీ అన్ని దానములలో సమాధానము ఘనమైనదనీ నేను పడ్డపుడూ, సమాదానపడ్డపుడూ ఆ ఓర్పు నాకు గర్వకారణము. అందుకు మళ్ళీ నేను సర్వదా కృషిచేసి నీ దేహ సంపదను కాపాడుతానని ప్రతిజ్ఞ్య చేస్తాను. ఎప్పటిలాగానే నవ్వి నా చేతులని తొలగించేసాక జాలితో వద్దనకుండా ముద్దిచ్చి నువ్వందించిన సానుభూతి అనుభూతి బహు బాగు బాగు.

                నిజం చెప్పు అప్పుడే కదా యావత్ మగజాతినీ పెద్ద మనసుతో చిన్న చూపు చూసీ ఓ ముద్దుతో చక్కబెట్టేయగలనని అనుకున్నది. ఆ సముద్రం ఒడ్డున కాలి బొటనవేలితో గుచ్చితే మెరిసిన ఆ ఇసకలో పొడితనంలో తడితనాన్ని నాలో నువ్వెపుడూ చూడలేదా? అయితే సముద్రం దగ్గర ఆకాశం భూమీ కలిసే వీలుందనీ అక్కడ మనమూ కలవచ్చుననీ ఇకపై అబద్ధం చెప్పకు. ఎగసి పడుతున్న కెరటాల్ని చూపించి తీరాల దగ్గరదాకా నన్ను తీసుకెళ్ళి వదిలేయకు. సరదాగానో నిజంగానో నువ్వు అప్పుడప్పుడూ నన్ను సముద్రమ్మని నిజమైతే తీరాల్నితాకని సముద్రం ఎచ్చోటనూ లేదని తెలుసు నీకు.
- కాశి రాజు

వ్యాఖ్యలు

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

ప్రముఖ పోస్ట్‌లు