జవాబుఇక్కడినుండి చూస్తే
అంతే రంగులో ఆ నీలంరంగు ఆకాశం
అక్కడినుండి చూస్తే
ఇదే పచ్చదనంతో భూమీ కనిపించడం సహజమే కావచ్చు

ఇంకాస్త ఎక్కువగా ఊహించుకోగలిగితే
ఆకాశంలో అందినంత నిశ్శబ్ధమూ, బోలెడంత గందరగోళమూ
భూమిలో కాస్తంత తడి, ఎవ్వరూ చొరబడలేని రాతిపొర ఉన్నాయనుకోవచ్చు.

కుదిరి కొంత మాటాడుకోగలిగితే
అంతా నింపుకున్నశూన్యం ఆకాశమనీ
వొట్టి ఓర్పుతో నిండిన ఖాళీ గుండె భూమిదనీ అనుకోవచ్చును

నాన్నా!
ఎవరు గొప్పఅన్న ప్రశ్నతో మన సంభాషణ మొదలైంది కావచ్చు

ఆకాశం నుంచి భూమ్మీదికి దిగిరావడం గురుంచీ
భూమి నుండి పైకి నిచ్చెనేయడం గురుంచీ
ఒడిలో ఉండగా చెప్పిన కధలన్నీ గుర్తున్నాయ్
అందుకే కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పకుండానే
మీ ఇద్దరినీ సమాధానపరచడం తెలుసు నాకు

Comments