పోస్ట్‌లు

September, 2014లోని పోస్ట్‌లను చూపుతోంది

||ముందు మాట-2 ||

నా లోచనాలూ నా ఆలోచనాలూ తప్పేనని అంటుంటావనీ నేను కాస్త విసుగ్గానూ వికారంగానూ తోస్తాను కామోసు. నేను మొరటోన్ననీ నా మాటలెపుడూ కటువేననీ అంటుంటే అలవాటు ప్రకారం అటెటో చూస్తాను. ఏదో చెప్తానన్నావ్ ఏంటదీ అని నువ్వేసిన ప్రశ్నకి గుటకలు వేస్తూ అభ్యర్ధనలాంటి ప్రశ్నలడుగుతాను మరి రెండోది అన్నపుడు మొదటి జవాబుకి నువ్విచ్చిన చొరవతో తెచ్చుకున్న ధైర్యంతో అడగాలనే అనుకుంటూ నీముకం చూల్లేక ఎటో తిప్పుకునీ అదీ అడిగేస్తాను . చూళ్ళేదు గనక నువ్వు నవ్వినట్టు అనిపిస్తున్నా నిర్దాక్షినంగా అది నిర్దారించుకోలేను. అప్పటి మన మౌనం భరించలేనంత భాదగా ఏదో పాపం చేసి వైతరణీ నదిని దాటుతున్నట్టే ఉంటుంది .

ఇక మూడోదేంటీ అంటుంటే నువ్వసలు వింటున్నావా లేదా అన్న దేహంతో సందేహంతో చేతుల్లోకి చేయి తీసుకుని మతించేసావు ఇక అనుమతించేసావు అన్నట్టుగానే మళ్ళీ అడిగేస్తాను. అప్పుడు సమాధానంగా చేతిలో చేయి తప్పిస్తున్నవో తీసేసుకుంటున్నావో అర్ధం కాదు. మనకు దొరికిన అర్ధగంటకూ మౌనం అర్ధాంగీకారం కాదనే కథ నాకు తెలుసు గనక ఇంకా ఏదన్నా చెబుతావనే ఎదురుచూస్తాను. ఏంకావాలో ఎందుకు కావాలో చెబుతున్న కొద్దీ వినేసి నా చేతిలో నలుగుతున్న నీ జడబంతి పువ్వును లాక్కుంటూ పు…

||ముందుమాట ||

దేహమును ప్రేమించుమనీ, మోహమన్నది పెంచుమనీ ఒంటి మాటలకు అంటి పెట్టుకుని ఆ వీలు కుదుర్చుకున్న సాయంత్రాల్లో నేనడిగిన దేహానికీ, నువ్విచ్చిన సందేహానికీ అహాన్ని అక్కడ స్కలింపజేసి నీ అన్ని దానములలో సమాధానము ఘనమైనదనీ నేను పడ్డపుడూ, సమాదానపడ్డపుడూ ఆ ఓర్పు నాకు గర్వకారణము. అందుకు మళ్ళీ నేను సర్వదా కృషిచేసి నీ దేహ సంపదను కాపాడుతానని ప్రతిజ్ఞ్య చేస్తాను. ఎప్పటిలాగానే నవ్వి నా చేతులని తొలగించేసాక జాలితో వద్దనకుండా ముద్దిచ్చి నువ్వందించిన సానుభూతి అనుభూతి బహు బాగు బాగు.

                నిజం చెప్పు అప్పుడే కదా యావత్ మగజాతినీ పెద్ద మనసుతో చిన్న చూపు చూసీ ఓ ముద్దుతో చక్కబెట్టేయగలనని అనుకున్నది. ఆ సముద్రం ఒడ్డున కాలి బొటనవేలితో గుచ్చితే మెరిసిన ఆ ఇసకలో పొడితనంలో తడితనాన్ని నాలో నువ్వెపుడూ చూడలేదా? అయితే సముద్రం దగ్గర ఆకాశం భూమీ కలిసే వీలుందనీ అక్కడ మనమూ కలవచ్చుననీ ఇకపై అబద్ధం చెప్పకు. ఎగసి పడుతున్న కెరటాల్ని చూపించి తీరాల దగ్గరదాకా నన్ను తీసుకెళ్ళి వదిలేయకు. సరదాగానో నిజంగానో నువ్వు అప్పుడప్పుడూ నన్ను సముద్రమ్మని నిజమైతే తీరాల్నితాకని సముద్రం ఎచ్చోటనూ లేదని తెలుసు నీకు.
- కాశి రాజు

||అడుగులు||

అందించిన చూపుడు వేలుని గుప్పిట్లో బందించి
ఎన్నోసార్లు నడిపించావ్
నువ్వు గుప్పిల్లు తెరిస్తే తడబడే నా అడుగుల్లో తొడయ్యే నీ కంగారు
నాన్నా ఇన్నేళ్లనుంచీ
కొడుగ్గా నా అడుగులూ, తండ్రిగా నీ ఆరాటాలూ ఎంతెంత దూరం నడిచాయో గానీ
నాకిప్పుడు నడవడం వొచ్చేసింది.
మరి నీ ఆరాటం పోలేదెందుకు.

నా అడుగుల్దీ నీ ఆరాటాలదీ పాతికేళ్ళ స్నేహమని
అమ్మ అంటున్నపుడు
మళ్ళీ నీకు చేయందించి నడవాలనుంది.

జవాబు

ఇక్కడినుండి చూస్తే
అంతే రంగులో ఆ నీలంరంగు ఆకాశం
అక్కడినుండి చూస్తే
ఇదే పచ్చదనంతో భూమీ కనిపించడం సహజమే కావచ్చు

ఇంకాస్త ఎక్కువగా ఊహించుకోగలిగితే
ఆకాశంలో అందినంత నిశ్శబ్ధమూ, బోలెడంత గందరగోళమూ
భూమిలో కాస్తంత తడి, ఎవ్వరూ చొరబడలేని రాతిపొర ఉన్నాయనుకోవచ్చు.

కుదిరి కొంత మాటాడుకోగలిగితే
అంతా నింపుకున్నశూన్యం ఆకాశమనీ
వొట్టి ఓర్పుతో నిండిన ఖాళీ గుండె భూమిదనీ అనుకోవచ్చును

నాన్నా!
ఎవరు గొప్పఅన్న ప్రశ్నతో మన సంభాషణ మొదలైంది కావచ్చు

ఆకాశం నుంచి భూమ్మీదికి దిగిరావడం గురుంచీ
భూమి నుండి పైకి నిచ్చెనేయడం గురుంచీ
ఒడిలో ఉండగా చెప్పిన కధలన్నీ గుర్తున్నాయ్
అందుకే కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పకుండానే
మీ ఇద్దరినీ సమాధానపరచడం తెలుసు నాకు