తొక్కుడుగడ్డి పోగేసి నిప్పంటించి పొగపెట్టి
గేదెలకు గడ్డేసాక రుమాలుతో అరుగు అటూ ఇటూ తుడిసి నడుమాల్చుతావ్
ఆ సల్లదనానికి మెల్లగా కల్లుమూస్తావ్

నువ్వు పొగెడతావనీ గడ్దేస్తావనీ అరుగుమీద అటూ ఇటూ తుడిసి పడుకుంటావనీ
చల్లగా కల్లుమూస్తూ నన్ను పిలుస్తావని తెలుసు నాన్నా
అయినా నీదరికి రాను.

ఒగటిరెండు సార్లు పిలిచీ నిద్రోతున్నావని తెలీకుండా నిద్దరోయి
కలవరింతల్లో ఒరేయ్ రాజూ అన్నాక
నాకు ప్రాణం లేచొస్తాది. నా నిద్రపుడు నిజంగా చస్తాది
తాగున్న నీకు ఓ చెంబుడు నీళ్ళు పక్కనెట్టి నా దాహం తీర్చుకుంటాను

అవునా ?

నిద్రని నటించిన నువ్వేమో నవ్వుతావు
పక్కన రుమాలు పరిచి మాటాడకపోతే నేనూ ఆ పక్కనే పడుకుంటాను.

మిణుగురుల సంగీతంతో చీకటిలో మన రాత్రి నిద్దరోయాక
ఆరుబైట చిరుగాలికి కొబ్బరాకుల్లా కదుల్తూ
ఆగీ ఆగీ నేనే అడుగుతాను
నాన్న ఎందుకు కలవరిస్తావని

నువ్వేమో నవ్వుతావు
పిలుపు కలవరింతగా మారిందని
ప్రేమను నిర్ధారించుకుని పడుకుండిపోతాను

నాన్నా
ప్రేమే పిలుపును కలవరింత చేస్తాదని
నువ్వైనా చెప్పు నిద్దర్రాని డాడీలకి

వ్యాఖ్యలు

ప్రముఖ పోస్ట్‌లు