వానొస్తుంటే

నేలమీదికి వాన చినుకులు రాలిపడుతుంటాయి. ఆకాశంమ్మీద మెరుపు మెరుస్తూ ఉంటుంది. అపుడు భూమీ , దిక్కులూ ప్రశాంతంగానూ ప్రకాశంగానూ ఉంటాయి. అచ్చం నీలాగ, నాలాగ , మన నవ్వులాటి ఇంద్రధనస్సులాగ.
ఆ జారుతున్న వంతెనమీదే నీట్లోకి కాల్లుచాపి, మెల్లిగా పక్కకి జరిగి చెయ్యిమీద చెయ్యేసి నేనంటే ఎంతిష్టమని అడుగుతావు.
దారితప్పిన మేఘం ఉన్నట్టుండి కురిసినట్టు ఆలోచన ఆపేసి ఎంతోకొంతని చేత్తో నీకు చూపిస్తాను
అపుడు వాన వెలిసినంత పూర్తిగా నువ్వూ నేనూ నవ్వేస్తాం.

మొన్న మనకి బస్సులో కలిసిన వైజాగ్ శర్మగారు విరాటపర్వం మూసేసి
తడుస్తున్న కుక్కనీ , మనవడి చెప్పుల్నీ ఇంట్లోకి తెస్తాడు
గడపదగ్గర గోనేసంచేసి , గొడుగట్టికెళ్ళని కొడుకు తడిచొస్తున్నాడోలేదోనని ఎదురు చూస్తాడు.
కూరగాయలు కొనడం మానేసి కొడుకుకి కొంగుకప్పి తీసుకొస్తున్న తన పెళ్ళాన్ని
పెంకులమీదనుంచిరాలే నీటిబొట్టైచూసి వాన ఆగినా తనుమాత్రం మురుస్తూనే ఉంటాడు.

ముంగటేడాది ఇల్లునెయ్యక ఇపుడు వాన కురుస్తుంటే మొగుణ్ణి తిడుతూ కమలమ్మ కాగిత్తప్పడవ చేస్తూనేవుంది. తిట్లువింటూనే గుమ్మముందు పారే నీల్లలాగే గలగలా నవ్వేసి
తలతుడ్చుకోడానికి కమలమ్మ మొగుడు దగ్గరికొస్తాడు. చిల్లున్న చోట చెంబులూ గిన్నెలూ పెట్టిన
టిక్ టిక్ మన్న ఆ సంగీతానికి పేదరికపు దర్శకత్వం భలే బాగుంటుందపుడు. ఆక్కడ చల్లగా నిద్రుస్తున్న వాళ్ళను చూసి వాన నిజంగానే నవ్వుతూ ఆ సంగీతాన్ని అలాగే వినిపిద్దామని ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంటుంది.

ఇలాగే వానొస్తుంటే ఇంకా కొన్ని గుర్తొచ్చి , కళ్ళూ మేఘాలూ పోటీపడతాయ్
వాన కురుస్తుందో మనుషుల్ని స్మరిస్తుందో అంతుపట్టదు నాకు .

వ్యాఖ్యలు

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

ప్రముఖ పోస్ట్‌లు