పోస్ట్‌లు

May, 2014లోని పోస్ట్‌లను చూపుతోంది

|| దేవగన్నేరు ||

వద్దులే అని నాన్నలు బద్దకించాకే
ఏ ఊళ్ళోనైనా పొద్దుపోతుంది
అప్పుడే ఆ ఊరి సూరీడు అలిసిపోయి
పొద్దు సూసుకుంటూ పనిసేసే అమ్మల్ని ఇంటికి పొమ్మంటాడు

బోదులో కాళ్ళు కడుక్కుని
కచ్చాఇప్పి రోడ్డెక్కాక, ఇంటికి చేరేలోపు ఎన్ని కబుర్లో !
నెలలునిండని పిల్లాన్ని నేలమీద వొదిలేసి వచ్చిన అమ్మలకి
ఒక్కో అడుగుకీ ఒక్కో వేగం
వదిలిరాలేని ప్రేమతో వొచ్చిన ఒక తల్లి వొరిసేలో ఏం సేత్తాదో తెలుసా!

ఆకుకట్ట ఇప్పినట్టే అమ్మ గుండెని ఇప్పేస్తది
గుబులు మూన నీట్లో గుచ్చి వరి నాటుతున్నట్టు
ఓరోజంతా ప్రేమను దుఃఖంతో నాటేస్తది.

రోజుకూలీ బతుకులో
రోజంతా అలా అమ్మ ధ్యాసలో జీవించి
ఇంటికిపోయాక కాస్త ముందొచ్చిన మొగుడు
పిల్లానెత్తుకుని గుమ్మమ్ముందు దేవుళ్ళా కనిపిస్తే.
కల్లనీలు కారుస్తూ ఆ తల్లి దేవగన్నేరైపోతాది.
అవును దేవగన్నేరైపోతాది
మేముప్పుడు నీ ముందుట్టినట్టు
ఊకట్టడం నేర్పావు.
ఓరగా సూడడమో వద్దని అలగడమో
నీకు తెలిసింది బాగుందిప్పుడు
కన్నా! పాల బుగ్గల్తో పచ్చోసనొస్తూ
ముద్దెట్టుకుంటే మురిపిస్తున్నపుడు కళ్ళెందుకు మూస్తానో తెలుసా.
సొంగకార్చి ఆరిన నీ వొంటివాసన నాకెందుకు నచ్చుద్దో తెలుసా
మీ అమ్మపక్కలో రొమ్ము తడుముతూ నువ్వుచేసే హైరానాతో
ఇంతెదిగాక నేనూ శాసించడం నేర్చాను
మా అమ్మను
ఆకలవుతుందే అన్నం పెట్టని గద్దించి అడుగుతున్నాను.

||మందార పువ్వు ||

కురిసిన వానంతా దూళి ప్రాణాలు తీసేసినట్టు
ఇంతిలా తడిపి చంపడం బాగుంది

ఇష్టం తెలపక పోయినా ఏడుస్తుంటే, నచ్చావని చెప్పబుద్దై
మౌనంగా ఉన్న మూలాన,
అప్పుడప్పుడూ తడవడం అలవాటయ్యింది నాకు

నవ్వుతూంది, ఏడుస్తుంది సరే!
ఏదన్నా చెప్పాల్సొస్తే అమ్మలాగే
అచ్చం అమ్మలాగే చెంగుచివర్లు మెలితిప్పి తలదించుకుంది
నాన్నా కాస్త లేటైనా
నాకూ ఓ మందారపువ్వు తెచ్చివ్వు.
ఓ ఏడాది ఇల్లు నెయ్యనపుడు
ఎండాకాలం గాలిబొమ్ముని ఎంత తిట్టుకున్నామో తెలుసా !

లేగదూడల్ని లోనకడుతూనో, గోనె సంచులు పైనేస్తూనో
తడిచిముద్దై అరుగెక్కితే
తుడుచుకునే రుమాల్తో ఎదురొచ్చి
నీ తలతుడుస్తూ
కడిగిన విగ్రహాన్ని అమ్మ ఒత్తుతున్నట్టుంది

ఆ సందామాట్ల సీకట్లో
ఎంతకీరానీ కరెంటుని అందరంకల్సి తిట్టుకుని తిందామని తీర్మానించుకున్నాక
ఆ చిన్నదీపం వెలుగులో
నవ్వుతున్న ముకాలు మాత్రమే కనబడే వెలుతుర్ని మనకెందుకిచ్చాడో అర్ధమై
మరింత నవ్వొచ్చేది నాకు.

పేదరికమని ఇసుక్కున్నా , ప్రశాంతత బాగున్నపుడు
నవ్వుమాత్రమే నేర్చాను నేను.