పోస్ట్‌లు

April, 2014లోని పోస్ట్‌లను చూపుతోంది

మీసాల రొయ్య

దిగబడిన అడుగుజాడల్లో చేరిన మురికి నీళ్లన్నీ
వాడిమీదకి నేనూ నామీదకాడు తన్నుకుని సేసిన తానాలు
అమ్మ అరుపుల్ని అందుకోలేవు

ఇంకెంత సేపన్న కవురు ఎవరో ఒకరు తెత్తేనేగాని
అమ్మ పిలిస్తుందని గాని , గుడికెల్లాలనిగాని గురుతురాదు.
ఈతరాకున్న ములగననే దైరం ఇత్తన్నకొద్దీ
ఎన్నోసార్లు దూకాను , లోతు నానది ఆటనాది.

ఎక్కువసేపు రొంపసేత్తాది ఎక్కేయ్ గట్టు అనేవాడు
తూము అరుగుల రాళ్ళ బొక్కల్లో
రొయ్యపిల్లలు పట్టుకుని ఆడించిన నాన
ఎందుకో ఎదగడం ఆపేసాక .

మరి నేనూ
రాములోరి కల్లేనం కదా తానం చేసి గుడికెలతుంటే
మీసాల రొయ్యల దువ్వుకున్నాను .

నానా మీసాల మీద సెయ్యేతే
నిన్ను ముట్టినట్టే . నీతో మళ్ళీ మళ్ళీ ఆడినట్టే
రాములోరిమీదొట్టు ఎదగడం రాలేదని ఎవరు నీతో సెప్తారు.

రోయల్ చాలెంజ్

సీసాలూ, గ్లాసులూ కాదు గానీ
గడ్డకట్టిన గాజు హృదయాలు ఖాళీ అవ్వాలి .

నవ్వుకోవడం అయిపోయాక అద్దరాత్రి మెట్లుదిగుతూ
పోయేవాడు ఉంటానంటాడు.
ఫలితమాసించని పరామర్శ ప్రేమల్లో ఉందని తేలుద్దపుడు
వాడోమెట్టు పైకొచ్చి,, నువ్వు కాస్త దిగెల్లి చేయిచ్చుకుంటారు
అదేదో గుండెని లాగిచ్చినట్టే ఉంటది.

స్నేహాల గుర్తెరిగి
గుర్తెట్టుకోవాలి కొన్ని చేతుల్ని
సివరిశ్వాస విడిచాక మనల్ని సాగనంపేటపుడు అవే కొన్నికళ్ళని తుడుస్తాయి.
అప్పుడా స్నేహాలచేతులు పైకెత్తకున్నా సెండాపిస్తూ ఊగుతుంటాయ్.

ఆత్మనేదొకటి ఘోషిస్తుంటే స్నేహాలే శ్వాసలని
చేయాలొక రోయల్ చాలెంజ్ .

(మొన్న మా మెట్లెక్కి అలసిపోయిన కొందరికి )

బద్దెమంచం

దు:ఖానికున్న దారుల్ని మూయలేమని చెప్పింది నువ్వేగా
మొకందాచేసి ముక్కుతుడుసుకుంటుంటే తెలిసిపోతావ్
నువ్వునన్ను సాగనంపినపుడల్లా
గుండెతడి గొంతులో ఆపేసి దుఖాన్ని గుటకలేస్తున్నపుడు
నానా నీ గొంతే గుండెలా కనిపిస్తది

నీ కొడుకుని
నేనూ అంతే. దుఖాన్ని దాస్తాను
ఒకదానికొకటంటుకున్న రెప్పవెంట్రుకలు
తడిగా నన్ను నీకు సూపించాక

వొచ్చేసేముందురాత్రి
కుక్కడిపోయిన బద్దెమంచం బిగిస్తున్నపుడు
కాళ్ళుతన్నిబెట్టి బద్దిలాగి , తెగిపోయి, పడిపోయి
ఆకాశం నేలా ఏకమయ్యేలా నువ్వుకుందంతా వొదులైపోయిన బందాన్ని బిగించినందుకే

గుర్తు తెచ్చుకుంటే
దు:ఖానిది బరువొకసారి
నాన్నా నవ్వేసి దుఃఖాన్ని తేలిక చేద్దాం.

తడిమేఘం

1
పతి మేఘంలో నీల్లుంటాయంటే నమ్మను గానీ
అమ్మైన ఆడది కురుస్తుందను
నేనూ కాస్త తడుస్తాను.

2
సంద్రుడి సుట్టూ వరదగూడూ
ఆకాత ఎన్నెల్లోనూ కనపడే వొరిపొలాలు
ఓ మడత మంచమ్మీద నాన దగ్గర
కాళ్ళు నొక్కుతూ మాఅమ్మ
రాత్రీ పగలని కాదు ఎప్పుడూ ఎలాగోలా కురుస్తూనే ఉంటది .

3
ఎండా? ఎన్నెలా? ఏమని సెప్పను

4
ఏసవి రాత్రి బయట పడుకున్నాక
అకస్మాత్తుగా పట్టిన మేఘం అందర్నీ ఇళ్ళలోకి తరిమేస్తే
అమ్మక్కొతే నాన్నతో ఎందుకేడుస్తాది?

5
వర్షం వచ్చిన జాడ ఆవాన కళ్ళకి తెలీదు
అమ్మది ఆకాశమంత దుఃఖం.
అమ్మకల్లకి నాన్న ఉపనది.