వెలితినిండుగా తిన్నాసరే నిండని రాత్రులుంటాయ్

కంచంనిండా పెట్టుకున్నా కొన్ని కబుర్లుండాలి

పప్పో పెరుగో ఎప్పుడూ సరిపోదు

సరిగ్గా నాకేసి సూసాక కదా కడుపు నిండేది

ఏమీ మాట్లాడకుండా తినమన్నపుడో,

మొకం సూపించకుండా వడ్డిస్తున్నపుడో

ఆ నిండిన కంచం , ఆ నీళ్ళ గ్లాసూ నాతో మాటాడవు


అప్పుడే

ఒంటరితనపు నిర్వచనాలు, ఎంగిలి కంచంలో ఏళ్లతో రాస్తాను.


నేనెందుకూ నీకందరూ ఉన్నారు అంటుంటావు

ఒక్కోసారి సమూహంలో ఒంటరవుతాం , లేదా ఒక్కరమే సమూహమవుతాం

తెలీదా! కొన్ని మాటలు కేవలం కరచాలనాలకి కల్పితాలు

కొన్ని గుండె సెరువులో పడ్డ గులక రాళ్ళు


మాట్లాడు

నీ స్నేహం చేరువయ్యాక

నువ్విసిరే మాటల రాళ్ళకు, నా గుండె సెరువవుద్ది.


నేను మాట్లాడకుండా తిండం పూర్తిసేసాక

మనసు నిండక మాఅమ్మ గుర్తొస్తది

అపుడేమో ఆగకుండా కన్నీలొస్తయి


Comments

  1. అవును నిజం, తిండి కేవలం కడుపు మాత్రమే నింపొచ్చు. చుట్టూ నవ్వులు, మాటలు ఉంటేనే అది మనసు నింపే భోజనమవుతుంది.

    మధ్యలో కొన్ని పంక్తులు out of place లాగ అనిపించాయి. "ఒక్కోసారి సమూహంలో ఒంటరవుతాం , లేదా ఒక్కరమే సమూహమవుతాం
    తెలీదా! కొన్ని మాటలు కేవలం కరచాలనాలకి కల్పితాలు" ఈ లైన్స్ కవిత మూల భావానికి సరిపోయినా, ఒరిజనల్ ఫీల్ ని ఏదో తగ్గించినట్టనిపించింది. నాకు కవిత్వంతో పెద్ద పరిచయం లేదు, కాబట్టి నాకనిపించింది కరెక్టో కాదో తెలీదు.

    మళ్ళీ నచ్చింది :)

    ReplyDelete

Post a Comment