పోస్ట్‌లు

March, 2014లోని పోస్ట్‌లను చూపుతోంది

||పండగలాంటోడు||

ఏపపువ్వు ఎవడన్నాతెత్తాడు
ఉత్తునొచ్చేదే కదా!
సిన్నోన్ని పంపి పాలు తెమ్మను
ఊళ్లోకెల్లి బెల్లమూ సామాన్లూ పట్రా అని తిడతున్నట్టు దుఖిస్తుంటే

అందీ అందని ఏప రొబ్బని అందుకుని కోసిన పువ్వంతా
జల్లిపోతాడు మా నాన
అదంతా ఏరుకుని, గుమ్మాలో అరిసిన సాపమీద గుట్టగా పోసేసి
పురుకోసనిండా మామిడాకుల్ని మాటాడకుండా గుచ్చేత్తాను.


నాగులు దండలూ అయిపోయాక
అక్క గడపలకి పసుపు రాస్తుంటే, దాన్ని తన్నుకుంటూ
మెక్కలపీట తెచ్చుకున్నాక,
మా గుమ్మలకి పచ్చగా ఏలాడేది మాయమ్మ

ఉగాది పచ్చట్లో
బెల్లం, మామిడి ముక్కా
చెరుకూ, చింతపండు సరింగా ఉన్నాయో లేదో

అలిసిపోయే అమ్మకి తోడయ్యే అక్క
ఆరాటపడే నాన్నకి ఆటపట్టించే నేను కలిసిపోయాక
అరచేతిలో పచ్చడి అందరి వొంకా సూసి తింటే అదో తుత్తి

అమ్మా, నాన్న అలాగే ఉన్నాక
ఏళ్ళు గడిచాఛి మేం గడసరులయ్యాకా ఆ పచ్చడిది అదే రుసి


మా ఊళ్ళో
ఉగాదంటే వేచి సూసే అమ్మకి
తెచ్చి పెట్టే నానతోడు

18

నోటిక్కరుచుకు తాగే కొబ్బరి బొండాన్ని
జాగ్రత్తగా నీ చేతుల్లోకి తీసుకుని ఒక్కో గుటకా వేస్తుంటే
కిందకీ, పైకీ కదిలే నీ స్వరపేటిక సంగీతాన్ని వినినందుకే
నేను ఆ కొబ్బరినీరైపోయాను.

పెదాల మీదనుంచి జారిన ఆ కంగారు నిండిన నీళ్ళు
గొంతుక మీద గొలుసు దాటి పోతుంటే
నేనూ ఒక్క గుటక వేసాను

అది చూసినా
ఏడాది దాకా ఏమీ మాటాడలేదు

ఎందుకలా చూసావని ఎపుడైనా అడుగుతావని
ఎన్నోసార్లు కొబ్బరి నీరయ్యాను
నువ్వు లేవు నా దుఖం కొబ్బరి నీరు
ఇదిగో గుర్తులతో
తియ్యగా దుఖిస్తున్నాను

|| కమ్యూనికేషన్ ||

ఇంతలేటైంది కదరా ఇంకా తినలేదా అని
అమ్మకి ఆకలైనట్టే అడుగుతావుంటే
ఓ దుఃఖపు జీర నా చెవికెలా చేరిందీ తెలుస్తూ ఉంది
దాన్ని నాదాకా మోసుకొచ్చిన ప్రేమది ఎన్ని సెకన్ల వేగమని
ఎవరినడిగితే తెలుస్తుంది

కాల్ కట్ చేస్తే

ఫోన్ టూ హార్ట్ , హార్ట్ టూ అమ్మా నాన్న
అన్న సంభాషణ సమాదైపోయి
రేపు చేయాల్సిన పనినంతా రివైండ్ చేసుకున్నా

దాహమైనట్టు అనిపించాక లెగాలని చూస్తే సహకరించని ఒళ్ళు
నీరసాన్ని బద్దకంగా చేసుకుని
బయట తినేద్దాం అని సర్ది చెప్పుకుంది

మెట్లుదిగి కాస్త ముందుకెళితే
ఆ మలుపు తిరిగాక ఉండే చపాతీలోడు సర్దేసుకున్నాడు
నవ్వుకుని నేను పడుకుంటాననుకో పర్లేదు
అక్కడ మా అమ్మకి ఆకలేస్తేనో !

||ఒరిమూన||

ఆ గరుకుగెడ్డాన్ని గీసిన తుప్పట్టేసిన బ్లేడుతో
బొడ్డుకోసాక
నెప్పిలేకున్నా ఏడ్చానట, నాకప్పుడు తెలుసేమో
గడవక
ఆరో నెలలో దమ్ముచేలో అమ్మ నాటిన ఒరిమూన ములిగిపోయింది
మాయమ్మ దుఖంలోనని.

కడుపులో ఉన్న నేను కరువురోజోల్లో పెరుగుతానో లేదోనని
గర్భగుడిలో గుప్పిల్లు మూసుకుని కళ్ళు తెరవని నాకు
కన్నీల్లే పట్టినట్టుంది
నా పేగుకు ముడేసుకున్న మాయనిండా,
ఆ దమ్ముచేలో ఉన్న మాయమ్మ కన్నీళ్లు

అవునిప్పుడు ఏడుస్తాను
అన్నాన్ని, అమ్మనీ గుర్తు తెచ్చుకుని
ఎవరైనా ఆప్యాయంగా వొండెట్టిన ముద్దను చుడుతున్నపుడు
భూమి బ్రమిస్తున్నట్టు ఉంటాది నాకు.

ఒరేయ్ వింటున్నవాడా !
నేను రాసేదానికి నీ లెక్కలు నీవి కావొచ్చు
అన్నం నాకు ముఖ్యం కాదు, అమ్మల ముందు చేయికడిగి, ఒంటరి కాలాల్లో వొచ్చేటి
దుఖం నాకు ప్రశాంతత.
అపుడు రాసే కవిత్వమైతే
కన్నీళ్లలో తేలెళ్లిపోయే కాగిత్తప్పడవ.

విమర్శించకు వదిలేయ్
దుఖం లాంటి నీటిలో పెరిగే ఒరిమూన బతుకు నాది.

||పురిటి దుఃఖం ||

మాయమ్మ భాదలాటి వరదగూడు

మా నానలా మాటాడలేనట్టి సందురూడు

అయేల

సీకటిలో దుఃఖమంతా నక్షత్రాలవుతున్నట్టు

వొట్టి ఊహనాది.వరిసేల మీద గాలి ఊగుతావుంది

గడపమ్మీద్దీపం వొణుకుతూ వుంది.


చిరు సీకటిలో అన్నమెట్టి

పెద్దదానికి నెలలు నిండాయి, రేపో మాపో కరుసుంది

అత్తమాటూ తాగొద్దు సత్తియ్యా అంటుంటే

అన్నం తినడం ఆపలేదాడు.
చిరాకొచ్చి, "పెంచలేనోడివి ఎందుక్కన్నావ్" అని అడిగితే

గుండె బరువెక్కి,కల్లలోనీలు గొంతులోకొచ్చి మెడబడిందాడికి


తప్పుడుమాటని తెలీకుండానే తరవాత నేను నిద్దరోయా !

మా నానకి ముందుగా తెల్లారినట్టుంది

మొకం దుఃఖంతో కడుక్కుంటున్నాడు.


చూడలేక

పొద్దున్నే పొలాలమీదకి పొతే

గడ్డిపరక్కి ఏలాడే మా ఊళ్ళోని మంచుబిందువులన్నీ

ఆ రాత్రి దుఖ్ఖాలే


ఆ గడ్డిపరకేమో

రాత్రంతా మెలితిరిగి పోయిన మానాన గుండె.

||వొంగపువ్వు||

వేలితో సబ్బుబిళ్ళరగదీసి

అద్దాన్నొక సారీ, నాననొకసారి సూసాక

నువ్వెట్టుకున్న కాస్త కుంకుంబొట్టూ నీ నొసటమీద ఉదయించిన సూరీడు.

నాన లెగిసినా, నేను లెగిసినా

కనపడే నీమొకమే మా తూరుపుదిక్కు .నువ్వు మెడ తడుముకున్నాక కల్లద్దుకున్న పసుబ్బొందు

నానతో ఏమ్మాటాడుద్ది?

నవ్వే నిన్ను చూసి మానాన ఒయ్యారంగా తెంపిన వొంగపువ్వు

నీ సిగనున్నాక

అమ్మా అందమంటే నీదే కదూ !
||జమ్మి చెట్టు ||

ఒరేయ్ మర్సిపోకే అని బయటడ్డ కాళ్ళకి దుప్పడికప్పి
గడ్డకట్టే సలిలో సుట్టెలిగించి నడుస్తూ పోతావ్.
నీలుబిందెతో ఎత్తైన అరుగు ఎక్కలేక, అమ్మ పడిపోతుంది.

వొలిగిన నీలు తుడిసేసి, మిగిలిన నీలు మొక్కలకేసి
బిందిసొట్టతీస్తుంటే ఆ గోలకి తమ్ముడూ నేనూ లెగాల్సిందే
ఇసురుగుంజ దాపెట్టి, పొత్తరంతో కొట్టి సొట్టతీస్తూ నీ సెయ్యి నలిగితే
అమ్మా ఆ పూట నా నిద్దర బద్దలయ్యిందే

అపుడు వండేసాక
వేలొంచలేని నెప్పితో కూడార్చినపుడు
నీ కాళ్ళమీద పడ్డ ఉడుగ్గెంజి వేడిగా లేదులేరా అంటే నమ్మేసానమ్మ
పొగలుకక్కే అన్నాన్ని టిపిని కర్రలో పెట్టిస్తే

అదిగో ఇప్పుడు ముసలిదయ్యిందే ఆ చేనుగట్టునున్న జమ్మిచెట్టు
సరిగ్గా దానిమొదలే మొన్నమొన్ననే ఊదుకుతిన్నాం.
ఆ అన్నగాటం మా ఆకలిదో, నీ ఆరాటానిదో
ఒక్క ఆకైనా రాలి సెబితే బాగుండునని నాన్నా, నేనూ మాటాడుకున్నాం

(వేడివేడన్నం తినేటప్పుడు మానాన కౌలుకి సేసే చేనుగట్టు , అక్కడుండే జమ్మిచెట్టు గుర్తుకొస్తాయి )

వెలితి

నిండుగా తిన్నాసరే నిండని రాత్రులుంటాయ్

కంచంనిండా పెట్టుకున్నా కొన్ని కబుర్లుండాలి

పప్పో పెరుగో ఎప్పుడూ సరిపోదు

సరిగ్గా నాకేసి సూసాక కదా కడుపు నిండేది

ఏమీ మాట్లాడకుండా తినమన్నపుడో,

మొకం సూపించకుండా వడ్డిస్తున్నపుడో

ఆ నిండిన కంచం , ఆ నీళ్ళ గ్లాసూ నాతో మాటాడవు


అప్పుడే

ఒంటరితనపు నిర్వచనాలు, ఎంగిలి కంచంలో ఏళ్లతో రాస్తాను.


నేనెందుకూ నీకందరూ ఉన్నారు అంటుంటావు

ఒక్కోసారి సమూహంలో ఒంటరవుతాం , లేదా ఒక్కరమే సమూహమవుతాం

తెలీదా! కొన్ని మాటలు కేవలం కరచాలనాలకి కల్పితాలు

కొన్ని గుండె సెరువులో పడ్డ గులక రాళ్ళు


మాట్లాడు

నీ స్నేహం చేరువయ్యాక

నువ్విసిరే మాటల రాళ్ళకు, నా గుండె సెరువవుద్ది.


నేను మాట్లాడకుండా తిండం పూర్తిసేసాక

మనసు నిండక మాఅమ్మ గుర్తొస్తది

అపుడేమో ఆగకుండా కన్నీలొస్తయి


చిక్కుడు గింజల సెగలో

ఇల్లుమొత్తం నిండుకున్నా
లేనితనం ఎప్ప్పుడూ లేదు
మాటో, పిలుపో ,సర్దుబాటో చేసిపోతావ్
అమ్మేమో అప్పైనా తెచ్చివండేస్తది

బదులివ్వడం తెలిసిన బతుకుల్లో లేదన్నబాధ తెలీదని
అమ్మ కొసరి వడ్డిస్తున్నపుడే తెలుస్తాది.
ఆకలిగా ఆవురావురంటూ తిని, కాస్త నిండాక కాళ్ళుసాపుకు తిని
అమ్మా నువ్వూ కూడా తిను. అన్నపుడు
నాకు నిండిందని నిర్దారించుకున్న మీరిద్దరూ
మాకు ఆకలైనపుడు మెతుకుల్లాగా మారిపోయారు

బడికెళ్లలేదేరా అని అడుగుతుంటే
బియ్యం లేవన్న సమాదానం అమ్మ సెప్పిందో, నా ఆకలే సెప్పిందో తెలీలేదు
ఆ పూట మనం కాలుచుకుతిన్న పచ్చి చిక్కుడుకాయల ముదురు గింజలన్నీ
కమ్మదనాన్ని కాదు గాని , అమ్మదనాన్నే తెలిపాయి.
ఆ పొయ్యి సెగకి నువ్వు కాస్త నా పక్కకు జరిగాక,
నాన్నా !
ఆకలితో కాదుమనం, అమ్మతో నిద్దరోయాం
04/03/2014