||చలిజరం||

గచ్చకాయలు రుద్దీ రుద్దీ గాజులు చేసే గోలని అలాగే ఇన్నప్పుడు

ఏమీ తెలీలేదు

పనుల్లేని రోజుల్లో మనమంతా ఏమ్చేసాం

అరుగుమీద సుద్దతో గీసేసి అష్టాచెమ్మ ఆడేసి

నడుములాగి ఒల్లో తలవాల్చామ్

అమ్మ ఒల్లో నువ్వూ, నేను అలాగే పడుకుందామని తీర్మానించుకున్నాక

నాన్నా ఏళ్ళు గడుస్తున్నాయ్ రా


జరమొచ్చిందని పొద్దెక్కినా లెగకపోతే

మంచం చుట్టూ తిరిగావు

ఎందుకూ అనడిగితే ఎప్పుడూ సెప్పిందిలేదు

ఊళ్లోకెళ్ళి బిల్లలట్రా అన్నప్పుడు

గబగబా ఎల్లి, వొచ్చేసరికి అమ్మ ఒల్లో నువ్వు


బార్లీ నీలు కాసి, వడకట్టి తెచ్చిచ్చాక

కూలబడి కుచ్చున్న నిన్ను సూత్తే

జరమొచ్చింది అమ్మకేనా అనిపించింది

ఒల్లెవరదైనా బాధ నీదే ఎందుకైందో తెలడానికి సేన్నాల్లు పట్టింది .


నాకిప్పుడు జరమొచ్చి చలేస్తుంటే

వేడి కోసం మెడచుట్టూ మీ చేతులున్నాయనిపించేట్టు

నానా నా వేలికి నీ ఉంగరముంది.


వ్యాఖ్యలు

ప్రముఖ పోస్ట్‌లు