||గుది గుచ్చి ||

ఇటుకుల గుట్ట పక్కన పెంటేసి పెంచిన మొక్కలన్నీ

నీ నవ్వులాగె పూస్తున్నాయమ్మా

నువ్వింకా ఆ మట్టిచేతులు కడుక్కోలేదని వాటికి తెలిసీ

పచ్చగా మన వాకిటనిండా పరుచుకున్నాయ్


వచ్చిపోయే తూరీగలూ, తొండపిల్లలూ నాతో మాటాడినట్టు

నేనెన్ని సార్లు కలగాన్నానో నా నిద్దర్లో

మరి

పొద్దున్నే లెగిసి అచ్చం ప్రాణం పోసినట్టు మొక్కలకు నీల్లేసి

కొన్ని పువ్వులు కోసి, నీకు తెచ్చిచ్చాక

నువ్వు గుదిగుచ్చిన దండలో, నువ్వూ, నేనూ, నానా నిండిపోయాం.


సివర్లు ముడేసి నోటితో తెంపాక.

నీ కొప్పున పెట్టుకునే కనకాంభరాలు

నాన్నవైపే చూసే నవ్వుతుండేవి.పసుపు రాసిన నీ చేతులేమో పచ్చగా తాకుతుంటే

నేనెందుకు ఎదుగుతాను?

అలాగే ఉండిపోనియ్

నాన్న నీ ముందు మొక్కై మొలుస్తాడు, నేను పువ్వై పూసి

నీ కొప్పులో కూచుంటాను.


(కొలీగ్ తల్లో కనకాంభరాలు పెట్టుకొచ్చింది, అమ్మలాగ ముద్దాడలేక, అమ్మని రాసి సూపించా )

వ్యాఖ్యలు

ప్రముఖ పోస్ట్‌లు