|| వెరీలాంగ్||

1
నానబెట్టిన మట్టినుంచీ , ఎల్లేసిన గోడవరకూ
అంతా రాయబడాలి
పుల్ల ఎగదోసి కళ్ళు తుడుచుకునే అమ్మలున్నాక
అన్నం తినకున్నా కడుపునిండుద్ది
అలాంటపుడే దు:ఖమే జీవితమని జీర్ణించుకోవాలి

2
చచ్చిబతికామని చెప్పుకున్నాక
మనమేం గొప్పకాదు

జిల్లేడు పువ్వుకీ రెండు జననమరణాలు
పువ్వులాగ పగిలాక్కూడా, కాయలా పేలాలి
దూదిపువ్వంత తేలికై విత్తనాల్ని మోసుకెల్లాలి
మొలవాల్సిన చోట జారిపడి మొక్కలాగే బతకాలని
మొక్క మొదల మట్టికప్పి మాటాడుతున్న నాన్నలున్నాక
మొక్కలకి ప్రాణముందని కొత్తగా మళ్ళీ చదువుకోవాలి

3
సదివాక రాస్తాం గనకనే
పరిచయంలేని ఊళ్ళో
చిల్లరకొట్టోడి చేతిలోనుంచి, బెల్లం కట్టిచ్చిన కాగితంమ్మీద
ఏడిపించే వాక్యం లాగ కొత్త పుట్టక పుడతాం

4
ఎవడో ఒకడు ఏడ్చి ముక్కునుంచి మానవత్వం కారాక
మనలాగే కళ్ళు తుడుచుకుంటాడు
వాడి గుండెని గుల్ల చేసినదాన్ని మనమెందుకు తవ్వితీసాం
కూలిన పాతిల్లుగోడకి మొలిచిన పచ్చనినాచు పూసుకున్నాక
మట్టే మన గోడు, మట్టే మన గోడ

5
ఏడుద్దాం
దు:ఖాన్ని రాస్తే వెరీలాంగ్
అన్నిటికీ కారణమైన ఆడదాన్ని గుర్తిస్తే
చచ్చేదాకా వాసనపోనీ పురిటిమంచంమ్మీద మళ్ళీ మళ్ళీ పుడతాం మనం

(ఆడదంటే చెబుతుండే అంబటి సురేందర్రాజు మాటలకి , రాయడం ఆపొద్దని చెప్పే కృష్ణ అశోక్ బొమ్మలకి , అపుడపుడూ కాస్త చెమ్మయ్యే బత్తుల శ్రీనివాస్ రెడ్డి కళ్ళకీ )

Comments