చెలిమిలా చెలరేగిపుట్టుకొచ్చాం మనం పుట్టుకొచ్చాం
నులకమంచమ్మీద అలక నేర్చేసి
నాన్న గుండెల మీద గుద్దులేసి
అమ్మ ఒళ్లోకి మనం ఆకలికి చేరేసి
చనుబాలు తాగేసి పెరిగిపోయాం

పెరిగిపోయాం మనం పెరిగిపోయాం

నిక్కర్లు మార్చేసి, నిదరలే మానేసి
నువ్వెక్కడా అంటే నువ్వెక్కడా అని
నేలనంతా మనం వెతుక్కున్నాం
కలుసుకున్నాక మనం కుదురుగా ఉండక
నింగితో మాటాడి నిదరపోయాం

నిదరపోయాం మనం నిదరపోయాం

వెన్నెల్ని తాగేసి చీకటిని ఊసేసి
రాత్రులన్నీ మనం రాసేసి,గీసేసి
రంగులెన్నో మనకు పులుముకున్నాం
అడుగుతో అడుగేసి నడుస్తున్నప్పుడు
జేబులో చెయ్యేసి తడిమి చూసాం

తడిమిచూసాం మనమ తడిమిచూసాం

కళ్ళతడిలో కొన్ని జీవితాలుంటే

మెల్లగా సల్లగా మెదిపి చూసాం
చేతికే చెయ్యిచ్చి, చేతులూపేసి వదులుతూ ఒక్కరిగా ఒక్కటయ్యాం
ఒక్కటయ్యినవేల వేయి గుండెలతోటి

చచ్చిపోయేదాకా చెలిమి చేద్దాం

చచ్చిపోయేదాకా చెలిమి చేద్దాం
(మిత్రుడు యజ్ఞపాల్ రాజు కు జన్మదిన శుభాకాంక్షలు )

వ్యాఖ్యలు

ప్రముఖ పోస్ట్‌లు