||ఇంకాస్త ఎక్కువ||


నువ్వంతేనా

ఎప్పుడూ ఏదీ ఇనిపించదన్నట్టు

కొసరు వడ్డిస్తూనే ఉంటావ్


కంచంకడుకొచ్చి ముందుపెట్టి

చెంబులో నీల్లెసీ నాకేసి సూసి

మెతుకు కిందపడేలోపు నా కంచంలో నువ్వడిపోతావ్

మెతుక్కి మెతుక్కుట్టి ముద్ద సేసేసి

మూతి దగ్గర పెట్టుకునేలోగా

మమకారం కలపడం మరిసిపోయినట్టు ఇంకేదో కూరేస్తావ్


ఇది కొంచెం, అది కొంచెం

అన్నీ నింపేసి 'అన్నం ఇంకాస్త' అంటావ్

సాలమ్మా సరిపోయిందని చెయ్కడగడానికి నీలడిగితే

ఇంకో ముద్ద కంచంలో పెట్టాక

ఇదేంటిదన్నట్టు నేను సూశాకఅయ్యో ఇంకాస్త పెట్టమన్నట్టినిపించిదని

ఆకలి తెలిసిననవ్వే నవ్వుతావ్

అమ్మలంతా ఇంతేనేమోనని

ఏమూల ఆకలున్న ఇట్టే కనిపెడతారని నోరుమూసుకు తింటాన్నేను


కడుపు మాట బ్రేవ్ మని పేగులు సెప్పేశాక

గుండెమాట కళ్ళలోనుండి కారీ

తినేశావ్ కదా చేయికడుక్కో అన్నట్టు

అమ్మా నువ్విచ్చిన నీట్లోకే నా కనుచుక్క జారింది .


(బువ్వపెట్టే మా జీవమ్మ , నన్ను రాసేవాడిగా కన్నతల్లి లక్ష్మి , కట్టా లక్ష్మి, సిరీ , అపర్ణ, రాఖీ , పావనీ , షానాజ్,పావనీ... ఇంకా అమ్మను గుర్తుచేసిన హైదారాబాద్ అమ్మలకు కృతజ్ఞ్యతగా )

Comments