పోస్ట్‌లు

February, 2014లోని పోస్ట్‌లను చూపుతోంది
బస్సెక్కుతూ
వానపడుతుందెల్లునాన్న అంటే
రాలిపడ్డ చినుకులన్నీ వానవేం కాదన్నావ్
కొన్ని జననాలు , మరణాలూ , ఇంకొన్ని కారణాలు
కనుగుడ్డుమీద పురుడేసుకుని జర్రున జారిపడతాయన్నావ్

నేన్నవ్వి తత్వమా అని ప్రశ్నిస్తే
తలెత్తి చూసిన నీ కళ్ళలో కన్నీరవుతున్న సందర్బాలు
అపుడు నిన్ను చూస్తే నాకు మాటరాదు
నీలాగ కన్నీళ్ళూ కారవు
ఉబికి వస్తున్న దుఃఖమంతా దాచేసి
గొంతులో ఉంచుకుని గుటకలేస్తాను

కనీసం ఒళ్లన్నా తుడవని నన్ను మాయతడితో ఎత్తుకున్నాక
ఏమనిపించిందీ అనడిగాను
ఇంకా దానికి సమాదానంగా ఏళ్లకొద్దీ ఏడుస్తున్నావ్
మొన్నీమధ్య
కన్నాలమ్మ చెట్టు దగ్గర బొట్టెట్టి సాగనంపుతూ
సంతోసాలూ దుఃఖాలు సమానమని చెప్పింది ఇన్నాక
బాదేంలేదు నాన్న అంటుంటే , మళ్ళీ పుట్టానని ముద్దెట్టుకున్నావు


మరణాలు మనం మరువలేం
ఈ పూట దుఃఖానికే కాదు
బాగుండి నవ్విన పతిసారీ నీ ఉనికి చేత నాకళ్ళలో నీల్లొస్తాయి

(పొద్దున్న పోన్జేసి ఒక ఆత్మ శాంతించి సరిగ్గా రెండేళ్ళు కదా, ఇవ్వలంతా నవ్వుతుండ్రా అన్నాడు. కృష్ణవేనికి నివాళులిచ్చేసాడని అర్ధమై నవ్వేసాను )

20/02/2014

||ప్రవహించు జననం ||

నీట్లో తేలి ప్రవహించే గుర్రపుడెక్క గుంపులాగా
మనదే మంచి స్నేహం

నువ్వటూ, నేనిటు అన్నట్టు మాటాడుకుని
పనుందిరా పోవాలి అని
చేతిలొదిలేస్తూ దగ్గరవుతాం మనం
అచ్చం గుర్రపుడెక్క గుంపుల్లాగే

బరిస్తాం కొన్ని మాటల్ని
బరువుగా గుండెని గుద్ది , బరువుగా కొన్ని నిందల్ని మనమీద చల్లిపోయాక
ఒరేయ్ సూరిడా
నువ్వు స్నేహంలో ఉదయించాకే
నా రాత్రులకి పాటలు

నేనాడితే వంకతెచ్చి
పాడితే గొంతెత్తి పాటలయ్యాక
ఇంకేందిరా అని పోనుపెడుతూ తరగని మాటేదో వదిలేస్తావు
ఆ గొంతులోని లోతులకి నా గుండెని ఒంపేస్తాన్నేను.

మాటలే మనమధ్య జననమయ్యాక
మాటాడుకుందాం చివరి శ్వాసకి చేరేదాకా
(మిత్రుడు నంద కిశోర్ కి )

|| వెరీలాంగ్||

1
నానబెట్టిన మట్టినుంచీ , ఎల్లేసిన గోడవరకూ
అంతా రాయబడాలి
పుల్ల ఎగదోసి కళ్ళు తుడుచుకునే అమ్మలున్నాక
అన్నం తినకున్నా కడుపునిండుద్ది
అలాంటపుడే దు:ఖమే జీవితమని జీర్ణించుకోవాలి

2
చచ్చిబతికామని చెప్పుకున్నాక
మనమేం గొప్పకాదు

జిల్లేడు పువ్వుకీ రెండు జననమరణాలు
పువ్వులాగ పగిలాక్కూడా, కాయలా పేలాలి
దూదిపువ్వంత తేలికై విత్తనాల్ని మోసుకెల్లాలి
మొలవాల్సిన చోట జారిపడి మొక్కలాగే బతకాలని
మొక్క మొదల మట్టికప్పి మాటాడుతున్న నాన్నలున్నాక
మొక్కలకి ప్రాణముందని కొత్తగా మళ్ళీ చదువుకోవాలి

3
సదివాక రాస్తాం గనకనే
పరిచయంలేని ఊళ్ళో
చిల్లరకొట్టోడి చేతిలోనుంచి, బెల్లం కట్టిచ్చిన కాగితంమ్మీద
ఏడిపించే వాక్యం లాగ కొత్త పుట్టక పుడతాం

4
ఎవడో ఒకడు ఏడ్చి ముక్కునుంచి మానవత్వం కారాక
మనలాగే కళ్ళు తుడుచుకుంటాడు
వాడి గుండెని గుల్ల చేసినదాన్ని మనమెందుకు తవ్వితీసాం
కూలిన పాతిల్లుగోడకి మొలిచిన పచ్చనినాచు పూసుకున్నాక
మట్టే మన గోడు, మట్టే మన గోడ

5
ఏడుద్దాం
దు:ఖాన్ని రాస్తే వెరీలాంగ్
అన్నిటికీ కారణమైన ఆడదాన్ని గుర్తిస్తే
చచ్చేదాకా వాసనపోనీ పురిటిమంచంమ్మీద మళ్ళీ మళ్ళీ పుడతాం మనం

(ఆడదంటే చెబుతుండే అంబటి సురేందర్రాజు …

చెలిమిలా చెలరేగి

పుట్టుకొచ్చాం మనం పుట్టుకొచ్చాం
నులకమంచమ్మీద అలక నేర్చేసి
నాన్న గుండెల మీద గుద్దులేసి
అమ్మ ఒళ్లోకి మనం ఆకలికి చేరేసి
చనుబాలు తాగేసి పెరిగిపోయాం

పెరిగిపోయాం మనం పెరిగిపోయాం

నిక్కర్లు మార్చేసి, నిదరలే మానేసి
నువ్వెక్కడా అంటే నువ్వెక్కడా అని
నేలనంతా మనం వెతుక్కున్నాం
కలుసుకున్నాక మనం కుదురుగా ఉండక
నింగితో మాటాడి నిదరపోయాం

నిదరపోయాం మనం నిదరపోయాం

వెన్నెల్ని తాగేసి చీకటిని ఊసేసి
రాత్రులన్నీ మనం రాసేసి,గీసేసి
రంగులెన్నో మనకు పులుముకున్నాం
అడుగుతో అడుగేసి నడుస్తున్నప్పుడు
జేబులో చెయ్యేసి తడిమి చూసాం

తడిమిచూసాం మనమ తడిమిచూసాం

కళ్ళతడిలో కొన్ని జీవితాలుంటే

మెల్లగా సల్లగా మెదిపి చూసాం
చేతికే చెయ్యిచ్చి, చేతులూపేసి వదులుతూ ఒక్కరిగా ఒక్కటయ్యాం
ఒక్కటయ్యినవేల వేయి గుండెలతోటి

చచ్చిపోయేదాకా చెలిమి చేద్దాం

చచ్చిపోయేదాకా చెలిమి చేద్దాం
(మిత్రుడు యజ్ఞపాల్ రాజు కు జన్మదిన శుభాకాంక్షలు )

||గుది గుచ్చి ||

ఇటుకుల గుట్ట పక్కన పెంటేసి పెంచిన మొక్కలన్నీ

నీ నవ్వులాగె పూస్తున్నాయమ్మా

నువ్వింకా ఆ మట్టిచేతులు కడుక్కోలేదని వాటికి తెలిసీ

పచ్చగా మన వాకిటనిండా పరుచుకున్నాయ్


వచ్చిపోయే తూరీగలూ, తొండపిల్లలూ నాతో మాటాడినట్టు

నేనెన్ని సార్లు కలగాన్నానో నా నిద్దర్లో

మరి

పొద్దున్నే లెగిసి అచ్చం ప్రాణం పోసినట్టు మొక్కలకు నీల్లేసి

కొన్ని పువ్వులు కోసి, నీకు తెచ్చిచ్చాక

నువ్వు గుదిగుచ్చిన దండలో, నువ్వూ, నేనూ, నానా నిండిపోయాం.


సివర్లు ముడేసి నోటితో తెంపాక.

నీ కొప్పున పెట్టుకునే కనకాంభరాలు

నాన్నవైపే చూసే నవ్వుతుండేవి.పసుపు రాసిన నీ చేతులేమో పచ్చగా తాకుతుంటే

నేనెందుకు ఎదుగుతాను?

అలాగే ఉండిపోనియ్

నాన్న నీ ముందు మొక్కై మొలుస్తాడు, నేను పువ్వై పూసి

నీ కొప్పులో కూచుంటాను.


(కొలీగ్ తల్లో కనకాంభరాలు పెట్టుకొచ్చింది, అమ్మలాగ ముద్దాడలేక, అమ్మని రాసి సూపించా )

||చలిజరం||

గచ్చకాయలు రుద్దీ రుద్దీ గాజులు చేసే గోలని అలాగే ఇన్నప్పుడు

ఏమీ తెలీలేదు

పనుల్లేని రోజుల్లో మనమంతా ఏమ్చేసాం

అరుగుమీద సుద్దతో గీసేసి అష్టాచెమ్మ ఆడేసి

నడుములాగి ఒల్లో తలవాల్చామ్

అమ్మ ఒల్లో నువ్వూ, నేను అలాగే పడుకుందామని తీర్మానించుకున్నాక

నాన్నా ఏళ్ళు గడుస్తున్నాయ్ రా


జరమొచ్చిందని పొద్దెక్కినా లెగకపోతే

మంచం చుట్టూ తిరిగావు

ఎందుకూ అనడిగితే ఎప్పుడూ సెప్పిందిలేదు

ఊళ్లోకెళ్ళి బిల్లలట్రా అన్నప్పుడు

గబగబా ఎల్లి, వొచ్చేసరికి అమ్మ ఒల్లో నువ్వు


బార్లీ నీలు కాసి, వడకట్టి తెచ్చిచ్చాక

కూలబడి కుచ్చున్న నిన్ను సూత్తే

జరమొచ్చింది అమ్మకేనా అనిపించింది

ఒల్లెవరదైనా బాధ నీదే ఎందుకైందో తెలడానికి సేన్నాల్లు పట్టింది .


నాకిప్పుడు జరమొచ్చి చలేస్తుంటే

వేడి కోసం మెడచుట్టూ మీ చేతులున్నాయనిపించేట్టు

నానా నా వేలికి నీ ఉంగరముంది.


||ఇంకాస్త ఎక్కువ||

నువ్వంతేనా

ఎప్పుడూ ఏదీ ఇనిపించదన్నట్టు

కొసరు వడ్డిస్తూనే ఉంటావ్


కంచంకడుకొచ్చి ముందుపెట్టి

చెంబులో నీల్లెసీ నాకేసి సూసి

మెతుకు కిందపడేలోపు నా కంచంలో నువ్వడిపోతావ్

మెతుక్కి మెతుక్కుట్టి ముద్ద సేసేసి

మూతి దగ్గర పెట్టుకునేలోగా

మమకారం కలపడం మరిసిపోయినట్టు ఇంకేదో కూరేస్తావ్


ఇది కొంచెం, అది కొంచెం

అన్నీ నింపేసి 'అన్నం ఇంకాస్త' అంటావ్

సాలమ్మా సరిపోయిందని చెయ్కడగడానికి నీలడిగితే

ఇంకో ముద్ద కంచంలో పెట్టాక

ఇదేంటిదన్నట్టు నేను సూశాకఅయ్యో ఇంకాస్త పెట్టమన్నట్టినిపించిదని

ఆకలి తెలిసిననవ్వే నవ్వుతావ్

అమ్మలంతా ఇంతేనేమోనని

ఏమూల ఆకలున్న ఇట్టే కనిపెడతారని నోరుమూసుకు తింటాన్నేను


కడుపు మాట బ్రేవ్ మని పేగులు సెప్పేశాక

గుండెమాట కళ్ళలోనుండి కారీ

తినేశావ్ కదా చేయికడుక్కో అన్నట్టు

అమ్మా నువ్విచ్చిన నీట్లోకే నా కనుచుక్క జారింది .


(బువ్వపెట్టే మా జీవమ్మ , నన్ను రాసేవాడిగా కన్నతల్లి లక్ష్మి , కట్టా లక్ష్మి, సిరీ , అపర్ణ, రాఖీ , పావనీ , షానాజ్,పావనీ... ఇంకా అమ్మను గుర్తుచేసిన హైదారాబాద్ అమ్మలకు కృతజ్ఞ్యతగా )