|| న్యూడ్ వర్డ్||నన్నుపైనుంచడం నీకు చెల్లినపుడు

కళ్ళ కాటుకని చెంపలకు తుడిచేసి

నీ చెవిదాకా కారుతున్న నన్ను, వేలితో తాకి

సుఖ శిఖరం చేరామని నిర్ధారించుకుని

నేనూ ఏడ్చేసాను తెలుసా !

ఏ మేన్ వాట్ ఆర్ యూ డూయింగ్ అన్నాక

ఐ సైడ్ " నథింగ్ "మెడ నుంచి జెడ ఏ దారిన పోయిందోనని

వెనక్కి తిరిగి వీపునడిగాక

రెండురాళ్ళ మధ్య బందీ అయ్యిందని చెప్పేసి

నాకంటే నువ్వు బాగా ఇదనిపించుకున్నావ్ .

నీముందు మాట్లాడడం నాకెప్పుడూ రాదు గనక

కళ్ళతో నవ్వడం చూసి, ఏంటన్నట్టుగా నేనూ కల్లెగరేస్తే

యూ సెడ్ "నథింగ్"
మీ అమ్మానాన్న నీకు మాటలే నేర్పారా అంటుంటే

ఏమో

వాళ్ళూ ఇలానే మాట్లాడుకున్నారేమో అన్న సమాదానాన్ని

నేను చెప్పకుండానే నువ్వు తీసేసుకున్నాక

నువ్వూ మాట్లాడు అని నేనంటుంటే

ఐ నీడ్ యూ "నాతోనే ఉండు" అని నువ్వన్నపుడు

ఐ సెడ్ "నథింగ్".
బాగా దూరంగా వచ్చినట్టున్నామని

ఏమన్నా తెచ్చుకు తిందామా అంటే

ఇక్కడేముంది "నేను తప్ప" అన్నపుడు

మొదటిసారి నాకు ఆకలయ్యింది

అదిగో అప్పుడు "తినొచ్చునా"? అని నేనడగ్గానే

యూ సెడ్ "నథింగ్" .బస్టాండ్ కి నడిచెళ్తూ

ఈ ఇయరంతా ఏం చేశావ్ అనడిగితే

ముప్పైయొకటో తారీకు మాత్రమే గుర్తుంది నాకు

కాకినాడనుండి కోటిపల్లి కి జీవితాంతమూ చేసిన జర్నీలో

ఏమీ లేదనడాన్ని నేర్చుకుని

ఐ సెడ్ "నథింగ్ "ఆ తర్వాత ముప్పై యొకటో తారీకు

ఆ మర్నాడు ఒకటో తారీకు నాకు వస్తూనే ఉంది.

మరి నీకేదీ అని నేనడిగితే

హి సెడ్ "నథింగ్"
నావల్లకాక నేను బ్రతికున్నాక

ఇదిగో చివరికి ఇవేళొకడు

"హే వాట్ ఆర్ ద ప్లాన్స్ టుడే" అన్నప్పుడు

ఐ సెడ్ "నథింగ్"నిజమే ఏమీలేకపోవడం నగ్నత్వమని నువ్వు చెప్పింది గుర్తొచ్చాక

"నథింగ్" ఈజ్ ఎ న్యూడ్ వర్డ్ అని ఏడవకుండా రాయలేను.


(కృష్ణవేణి కి మళ్ళీ నూతన సంవత్సర శుభాకాంక్షలు )

వ్యాఖ్యలు

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

ప్రముఖ పోస్ట్‌లు