||ఎంగిలాకలి ||మీసాల దగ్గర ఎంగిలి అంటుకుందని
కళ్ళతో సైగ చేసావ్
కడుక్కోలేక నీ చెంగుకు తుడిచేసా
నవ్వుకుని చేయి ముందుకు చూపిస్తే నడిచాను

ముందెప్పుడో దాహం అలాగే దాటవేసావ్
ఆకలిఊసు లేనేలేదు
కళ్ళతోనే అన్నీ నింపేసి కాదనకుండానే తప్పుకున్నావ్
మాట్లాడింది లేదు , మాట్లాడడానికీ లేవు
మౌనం మన సంభాషణై మన మాటలన్నీ దాచేసింది.

నిన్ను చూడ్డానికనే నేనోచ్చాను
మా ఊళ్ళో చలేసినప్పుడు మంటేసి
నువ్వొస్తావని కూర్చునున్నాను
అమ్మొచ్చి
చలేస్తే ఏడవకూడదని చెప్పేదాకా
పుల్లలు ఎగదోస్తూ నువ్వు మాట్లాడుతున్నావనే అనుకున్నాను

పండక్కి ఇంటికొస్తే ఏడవ్వు కదరా అని తమ్ముడెందుకడిగాడో తెలీలేదు
నేను బాగానే ఉన్నానే అని బయల్దేరాక
మనుసులు లేరనో , ప్రేమలు చనిపోవనో నాకు తెలీదు
మా ఊరెలితే ఎందుకో ఎప్పుడూ ఏడవడం తప్పదు


అక్కడ కొబ్బరిచెట్ల గట్టుమీద గుట్టుగా నిద్రోవడం తెలిసినపుడు
నేను ఒక్కడినే కాదు, నా నిండా నువ్వుండి
వేచి చూడ్డమే జీవితమౌతుంది.
మా అమ్మకూడా ఇంటిదగ్గర అన్నంపెట్టి చూస్తున్నట్టు
పేగుల్ని నలిపే ఆకలి గుర్తుచేసాక
మీసాలకి ఎంగిలి అంటించుకోడానికి మళ్ళీ నేను లేచెల్తాను

(మధ్యాహ్నం తినేటపుడు మా కృష్ణవేణి గుర్తొచ్చింది, నా మీసాలకి అంటిన ఎంగిలి నేనే నా కర్చీఫ్ తో తుడుచుకోవాల్సోచ్చింది )

వ్యాఖ్యలు

ప్రముఖ పోస్ట్‌లు