||అద్దురూపాయి||చిలక్కర్రకి తగిలించిన సొక్కాజేబులో
అద్దురూపాయైనా ఉంటాదని తెలుసు
మొక్కల పీటమీదేక్కి అందుకుందామంటే
అటిటుతిరుగుతూ అమ్మ సూతాదని బయము

గోడమూలనున్న అమ్మ పెట్టినో , బల్లకిందున్న కుంచమో ఏసుకుని
ఎన్నిసార్లెక్కినా అందలేదు
తలగాడేసుకుని తంటాలు పడినా ఏపూటా లాభం లేదు
నానంతెత్తు నేనెపుడెదుగుతానో అని ఎన్నిసార్లు కలగన్నానో
ఆ సొక్కాజేబుకు తెలుసు

బడికెళ్లే ముందు జోబు తడిమి
ఏమీదొరక్క ఎలిపోడాం అమ్మెప్పుడూ సూల్లేదంట
నాకప్పుడు పదేల్లంతే

భూమి గుండ్రంగా తిరిగాక
నాకు మీసాలోచ్చాయ్ , మానాన తలకి ఎవరో తెల్లరంగేసారు
మనుసులిచ్చిన వారసత్వం కూల్చలేక
మా ఇల్లు అలాగే వొదిలేతే
మా ఇంట్లో చిలక్కర్రకి
ఇంకా ఓ సొక్కా వేలాడుతుంది.

ఎప్పుడైనా మాఇంట్లో తిరుగుతూ
చేతికందుతున్న సొక్కా తీస్తే
అందులో యాబై రూపాయలు, అచ్చం అద్దురూపాయిలాగే
అదేంటో మానాన సొక్కా సూత్తే
ఇప్పటికీ కనీసం పదేళ్ళైనా నిండవు నాకు
అద్దురూపాయ్ తీసినట్టు ఆ డబ్బులు తీస్తూ మా నానకు నేను ఎదురుపడ్తే
మీసాలు మెలేస్తుంటాడు
అచ్చం నా సిన్నప్పుడులాగే

వ్యాఖ్యలు

ప్రముఖ పోస్ట్‌లు