||మనం మాత్రమే ||ఊరికే ఏం రాయాలిరా సూరిడా
మనకంటే ముందు పుట్టేసి పువ్వూ నవ్వూ ప్రేమా రాసేశారు
ఉదయాలు విసిరేయబడి
సాయంత్రాలకి చిక్కుకుపోయి
రాత్రులు పాత్రలు పోషించే నాన్నలను రాయాల్సి వొత్తే
ఎలాగున్నావ్ రా అని ఏ నాన్నైనా అడిగి చూడాలి
తడిచిన కళ్ళు మాట్లాడతాయని తెలిసిపోయేటట్టు
నవ్వుతూ మాటాడే నాన మోకాన్ని నువ్వు కచ్చితంగా రాసేయాలి

ఆ తరవాత
కలలన్నీ నగ్నత్వంమ్మీద నడిచిపోతున్నాయ్ కదా!
నువ్వూ దానికి పూనుకోవాలి
దివ్యత్వాన్ని దరించి
సందడి లేని జీవితాల్లో సందర్భాల్ని పట్టుకోవాలి
ఎవరు ఎవరికీ ఎలా లొంగిపోయారో ఏమాత్రమూ తెలీనపుడు
తలలో వేళ్ళు దూర్చి , మొకానికి మొకం దగ్గరగా జరుపుకున్నాక
కొత్తజంట కార్చే కన్నీరొకటుందని
తత్వమేదో తెలిసినట్టు
గుండ్రటి కనుగుడ్డుపై గిర్రున తిరిగే ఆ నీటి పొరని
గుర్తుండిపోయేట్టు రాసేయాలి.

నవ్వితే నవ్వడం తెలిసినకాడ నువ్వేమీ ప్రత్తేకం కాదు
ఏడుపుకు ఎలా ఎదురుపడాలో ఎక్కడైనా సూసొత్తే
గుండెను గుండె తాకేట్టు గట్టిగా హత్తుకోవాలి
గుండె నుండి గుండెకి గుట్టుగా ప్రవహించాలి
చేతులతో పలకరించే చొరవ తీసుకుని
ఆత్మీయతని అడక్కుండానే అరువిచ్చేయాలి

శీతాకాలం పొద్దులో
అలికిన ఇల్లు అలాగే వొదిలేసి ఆపదొచ్చిందని ఎలిపోతే
ఆ అర్ధాంతరన్యాస అలంకారాన్ని ఆర్ట్ గ్యాలరీలో దాచిపెట్టాలి
వొండిన మట్టికి మొగుడూ పిల్లలకెట్టి
నాకాకలిగా లేదనే అమ్మల సొంతవాక్యాన్ని ఎవరు రాస్తారో అని ఎదురుసూసేట్టు
మనం మాత్రమే రాసి సూపియ్యాలి

ఒకోసారి
హాయ్ హలో అన్నా , అయ్యా నమస్కారం అన్నా
కళ్లతోనూ , చేతులతోనూ నవ్వేవాడు కావాలి
వేళ్ళ సివర ఊసులెట్టుకుని కలిసికుచ్చేబెట్టి మాటాడించేయాలి
ఎవడ్రా ఈడు అని ఏమొకం సూసినా , ఏమీ తెలీనట్టు ఎక్కడైనా నవ్వేయాలి

మనదికాని అస్తిత్వ ఉద్యమం, ,మన దరిదాపుల్లో లేనపుడు
మనకి
అమ్మలొక కథ
నాన్నొక కవితైతే
యవ్వనం ఒక యువ పురస్కారం

ఎక్కడ బతుకు బాసగా మారి
ఎక్కడ మనుషులు సాహిత్య మయ్యారో
అక్కడ మనం నవ్వుతూ ఉండాలి , నవ్వ్వుల్ని లిఖిస్తుండాలి.

(మానాన లాంటోడు సిరమోజు హరగోపాల్ గారికి ) With Sriramoju Haragopal

Comments

Popular posts from this blog

కనీసం

F1.

షేరాటో