|| భూమధ్య రేఖ ||
"ఇళ్ళు కట్టేపనికే ఎందుకెల్తావ్" అని అడిగావ్ గుర్తుందా
కూలివ్వకపోతే కూడన్నా పెడతాడని
పనికెళ్ళి అక్కడే తినేసొత్తే, ఓ పూట బియ్యం ఎనకేద్దామని
మిమ్మల్ని కాత నవ్వుతూ సూదామని
ఒంట్లో జివలేకున్నా సులువైన పని కాదు, తెలివైన పనే ఎతుకున్నా!

****
పని దొరకన్రోజు
పొద్దుగూకినా ఇంటికి అడుగడనప్పుడు
మీయమ్మ పడే పాట్లు గుర్తోచ్చీ గబా గబా ఇంటికి పరిగెట్టాను
బాలింతకు తిండి లేక , బుక్కెడు పాలురాక
నువ్వు పటికబెల్లం నీళ్ళే తాగావ్
అందుకేరా ఇప్పటికింకా ఎక్కెక్కి ఏడుస్తావ్
****
ఒరేయ్ బంగార్రాజు ! ఆ బగమంతుడు
ఆకలి అక్సాంసాల్నీ, అత్మాభిమాన రేఖాంసాల్నీ ఓ చోట కలిపి
అది మన చుట్టూ తిరిగేట్టు చేసిన భూమధ్యరేకేరా ఈ ఏడుపు
భాదపడకు
అది మన బ్రమనాన్ని బతుకుచట్రం లో నుండి తప్పిపోనియ్యదు
****

ఇంటికొచ్చిన పతీసారీ "నానా ఏటిగట్టుకెల్లొస్తానంటావ్"
ఎందుకూ?
మన గోదారి సూత్తే తెలీదా భాదంటే మేఘమని
ఏడుపంటే వానని, ఏడవడం అంటే ప్రవాహమని
****
దుక్కమొస్తే దాసకోరేయ్
ఎలాగైనా నువ్వూ, నేను నీరైపోవాలి
గుర్తెట్టుకో ఏడుపు ఇంకితే ఎక్కడా ఉండలేం.
****
ఇంకోమాట
మనిద్దరికీ ఏడుపంటే కదేనోరేయ్
ఇయ్యాల నేను , రేపు నువ్వు
ఒకడు సెప్పినంత, ఇంకోడు ఇన్నంత
దుఃఖానికి కొత్త అభివ్యక్తి దొరకదొరేయ్
ఏడిపించే దాకా ఎడ్చేసేయ్!
ఆపైన
నీకైనా ,నాకైనా దుఃఖానికి మూలం దొరికిపోయాక
అడుగులు తిన్నగా పడ్తాయ్
పద ఇంటికెల్దాం. అమ్మ ఏడవడం ఎప్పుడో ఆపేసింది
ఎదురుసూత్తా ఉంటాది మనకోసం!


(సరిగ్గా ఇదే రోజు 2012, నాతో నాన్న సంభాషణ )

వ్యాఖ్యలు

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

ప్రముఖ పోస్ట్‌లు