||రుమాలు మూట ||నానా సందాల బేగోచ్చేయ్ అన్నమాట పదిసార్లు విన్నాడుగనకే
నాన్నోస్తాడు ! బాణాసంచ తెస్తాడు
రాత్రవుతుంది మా ఊళ్ళో !
చూసీ చూసీ అమావాస్య సాయంత్రం చిక్కబడి చీకటైపోయిందా?

పూజైపోయింది, అమ్మ ఇంకా ఎదురుచూస్తుంది
అందుకే నాన్నోస్తాడు బాణాసంచ తెస్తాడు
ఎదురింటరుగు మీద ఎలిగించిన సిచ్చూబుడ్ది మా వాకిట్లో చిందులేసే చిన్నోడూ, రెంటిదీ ఒకే కాంతి
అమ్మ మాత్రం అరుగు మీద నూనె దీపం
ఇంకా నాన్నోస్తాడు బాణాసంచ తెస్తాడు


మతాబు ఎలిగించలేని మా అక్క భయం, నటనని నానకు తెలుసు
మతాబు నాకిచ్చేస్తేనే " ఇది నా ముద్దుల కూతురు " అని ముద్దెట్టుకునేది
అదేమో అమ్మ చెంతకి చేరి చిరుదీపమయ్యేది

ఏది పంచినా ఒకటెక్కువిచ్చే అన్నయ్య నా కళ్ళలో ఆనందం మొత్తమూ దొంగిలిస్తాడు
మంచిదొంగ మావాడే మరి
నేనేది చేస్తే అదేవాడి ఆనందమై వాడికి కాకరపువ్వొత్తి కాల్చడం రాదని చెప్పిస్తుంది
అప్పుడే నాన్నోస్తాడు బాణాసంచ తెస్తాడు

"అమ్మా పోమొచ్చి కిచకిచ " అంటూనే వచ్చేరాని బాష తో ఒక సిసింద్రీ చెల్లి అందరి కాళ్ళమధ్య తిరిగేది.

ఇంత తంతు జరుగుతుంటేనే మా కోసం కరిగిపోయే కొవ్వొత్తొకటి మాకోసం బాణాసంచ తీసుకొస్తుంది

బుజాన్నుంచి ఒక రుమాలు మూట కిందకుదింపి అమ్మేపు చూస్తే ఆనందాన్ని విప్పడానికి ఆమె సిద్దంగా ఉంది
పండగొచ్చిన పతిసారీ పేదరికమొస్తాదనే నా అంచనా తప్పై
నాన్నొచ్చాడు బాణాసంచ తెచ్చాడు
అదిగో అప్పుడే నాలోని ఒక ఆలోచన నింగిదాకా తారాజువ్వలా ......


వ్యాఖ్యలు

  1. పండగొచ్చిన పతిసారీ పేదరికమొస్తాదనే కాశిరాజు అంచనా తప్పై
    నాన్నొచ్చాడు బాణాసంచ తెచ్చాడు.
    చిన్ని చిన్ని ఆనందాల్ని సంబరపడే మంచి మనసున్న కాశిరాజూ చాలా బావుంది "రుమాలు మూట" అభినందనలు.

    ప్రత్యుత్తరంతొలగించు

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

ప్రముఖ పోస్ట్‌లు