|| పురుడుకు ముందు పేరాగ్రాఫ్ ||
బడికి పక్కనే గుడిసుంది
"ఆడతా పాడతా అమ్మని సూసేల్లడం తప్ప
ఆడికేం తెలుసు సిన్నపిల్లాడు"
అంతా అనుకునే మాటే ఇది

***
ఇంటర్బెల్లకి సింత సెట్టుకాడ ఉచ్చేసి
బొత్తాలెట్టుకోకుండా పరిగెట్నాం తెలుసు
గబాగబా అమ్మని సూసోచ్చేసి
గుట్టుగా బడికెళ్ళి కుచ్చోడమే తెలుసు
***
అంతా పనికెల్లిపోయాక, అమ్మోక్కతే ఇంటికాడుంటే
ఆట మజ్జలో అమ్మనిసూడ్డానికి
అనుకోకుండా ఎల్లినపుడు
ఏమైందిరా సూరీడా ?
***
ఒక్కత్తే ఒండ్లింగా తిరిగి పడుకుందనీ, కడుపునొక్కుకు కుచ్చుంటుందనీ
నెప్పులు మొదలై ఏడుపెత్తుకుంటే దిక్కు తోచక సూసావా ?
పురుడెయ్యడానికి ముసల్ది రాదనీ!
కానుపుసారెట్నాకి గుమ్మడకాయ్ లేదనీ
గిద్దుడు గింజలు చేటలో ఏసాకే గడపమీద తమ్మున్ని ఊపుతారనీ
పనికెల్తూ నాన సెప్పింది ఇని మర్చిపోయావ ?
అయన్నీతెత్తాడు నాన వత్తాడు అందాక అమ్మ ఆగాలి దేముడా !
***
ఏమయ్యిందే అని ఏడుస్తూ అడిగితే
తమ్ముడొస్తాడని అమ్మనవ్వడం అర్ధం కాలేదు కదా
తీపిబాద తెలియనపుడు నువ్వింకా చిన్న పిల్లోడివే !
***

నానోచ్చి నట్టింట్లో నుంచున్నాక
పెదబాప్ప పదిమందినీ తీసుకొచ్చాక
అమ్మసుట్టూ అంతా మూగితే నానెందుకేడ్చాడో తెలీనపుడు
నవ్వూ ఏడుపూ కలిసిన మొకంలో
మట్టిని తోసుకుంటూ మొలిసే మొక్కుందనీ తెలిసీ
ఇల్లంతా భూమి బద్దలై మొక్క మొలిసిన సప్పుడు. ఇన్నావా నువ్వపుడు
***
ఒరేయ్ సూరీడా
ఎందుకేడుస్తావని నాన్ని అడిగితే
ఏం సెప్పాడో గుర్తున్నపుడు
నవ్వొచ్చినా, ఏడుపొచ్చినా నీరైపోవడం తెలియాలని
పురుడొచ్చేముందు పేరాగ్రాఫ్ లో కొంచుమైనా రాయవేరా?

వ్యాఖ్యలు

ప్రముఖ పోస్ట్‌లు