|| ఉప్పులో మిరగాయ్ ||
పొద్దున్నే నాలుగ్గంటలకి లెగాలి
పొద్దొడిసేలోపు పనలన్నీ ఐపోవాలి
ఆరుగంటలకల్లా పేడతీసేసి, కల్లాపేయడానికి నీలు మొయ్యాలి
ఒలేయ్ పొలానికెల్లొస్తాననేది ఇనేలోపే
నువ్ కనుమరుగైపోవాలి

***
నాకు నీల్లేసి, అక్కకు తలదువ్వి
చెల్లికి పాలిచ్చి అమ్మ వొండేసుకోవాలి
ఆరని పొగమంచు వుదయాల్లో నీకోసం నడిచి రావాలి
దమ్ము సేలో నువ్వు దిగి తొరాలేస్తుండాలి
మట్టంటుకున్న ఒంటిమీద గోసీ జారతుంటే
మాయమ్మ దాన్ని మొలమీద నిలబెట్టి మొడేసి కట్టాలి.
నువ్వూ నీ ఒల్లూ సల్లగవ్వాలి అది సూసి అమ్మ నవ్వుతుండాలి

***
బువ్వ తెచ్చిందని గట్టెక్కేటపుడు
అడగకుండానే అమ్మ సెయ్యనందియ్యాలి
బోదులో వొంగోని కాళ్ళు కడుగుతుంటే జారిపడబోయే నీ చెయ్యట్టుకోవాలి
ఏం తెచ్చావేనని అడిగేలోపే
సద్దన్నం గిన్ని పక్కనెట్టి ఉప్ప్లులో మిరగాయ్ ఇప్పి సూపియ్యాలి
నువ్వందుకే నవ్వాలి, అమ్మ కడుపు అప్పుడే నిండాలి

***
మద్దాలకూటికి ఇంటికొస్తానని
మమ్మల్ని సూడానికి బడికి రావాలి
మేస్టారికొక మాటసెప్పి ముద్దెట్టడానికి తీసుకెళ్ళాలి
అమ్మకి సెప్పరా అని
మళ్ళీ పొలానికెల్తూ మొద్దొగిటిపెట్టాలి

***
రాత్రింటికొచ్చినా రానట్టే ఉండాలి
కాలవకి అడ్డేయడానికని కారణం సెప్పాలి
నీరెద్దడని నువ్వు మళ్ళీ పొలానికెల్లాలి
నువ్వోచ్చేదాకా అమ్మ అలాగే ఉండాలి

***
రోజుగడవాలంటే తెల్లరాలి, సూస్తూ సూస్తూ పొద్దుపోవాలి
రాత్రైపోతే నానరావాలి
సూర్యుడి చుట్టూ భూమి తిరిగినట్టు
నాన సుట్టూ అమ్మ తిరగాలి
రోజు గడవాలంటే అమ్మ తిరగాలి

Comments

 1. "రోజుగడవాలంటే తెల్లరాలి, సూస్తూ సూస్తూ పొద్దుపోవాలి
  రాత్రైపోతే నానరావాలి
  సూర్యుడి చుట్టూ భూమి తిరిగినట్టు
  నాన సుట్టూ అమ్మ తిరగాలి
  రోజు గడవాలంటే అమ్మ తిరగాలి"

  చాలా చాలా నచ్చింది :)

  ReplyDelete

Post a Comment

Popular posts from this blog

కనీసం

F1.

షేరాటో