||నాలోంచి నీలోకి ||

ఎప్పుడొస్తున్నావన్నది ప్రెస్నలా కాక , ఎదురుసూడ్డం అని తెలిసాక
ఎంటనే బయల్దేరతానని తెలుసు నీకు

నన్ను సూడాలనిపించినపుడల్లా
నువ్వు నీలాక్కాక , నానా గొంతుతో మాటడతావెందుకు?

అమ్మకి పోనిస్తే
ఏం మాటాడినా బేగ్గుసర్దమన్నట్టే ఇనిపిత్తాదెందుకు

బట్టలేసుకున్నపుడు నువ్విచ్చిన వాచీ
బెల్టెట్టుకున్నపుడు నువ్ కట్టిన మొల్తాడు
నాతో మాటడతాఎందుకు?
ఇక్కడ ఏ బస్సెక్కినా మనూరి కండక్టరే కనిపిస్తాడెందుకు

నేనొస్తున్నానంటే నా నుంచి నీదాకానా ?
నాలోంచి నీలోకా నాన్న!

ఇచ్చిన సెలవు నిన్నే ఎలిపోయింది
నిన్ను వచ్చి సూన్నాం ఐపోయింది
ఒరేయ్ నాన్నైనోడా
ఎలిపోతానని తెలిస్తే నాకు
ఏడుపొస్తాదని తెలుసు నీకు
అందుకే కదా
బుజంమీది రుమాలు సేతిలోకి తీస్తావ్
ఇటివ్వు కళ్ళు తుడిసేసుకుని
బస్సొత్తే నాలోంచి నీలోకి ఎక్కి కుచ్చుంటాను

వ్యాఖ్యలు

ప్రముఖ పోస్ట్‌లు