|| ఒడ్డునానుకుని||రోజూ పొద్దొడవగానే సూర్యుడితో చురుకుదనం ఉదయిస్తున్న చోట ఒక ఉప్పోడో, ముగ్గోడో వీదుల్లో వారి వారి పలకరింపుల్ని అమ్మేస్తారు అక్కడ ఆకలికి బేరం కుదిరిపోతుంది.

అక్కడే ఒడ్డునానుకొని ఓ ఊరుంది-

కొన్ని కళ్ళు కడుపును చూస్తున్న కాడ కంచం నిన్ను కేకేసి, మర్యాదని కిందరిచి కూచోబెట్టాక అరచెయ్యి ఆనందభాష్పాల్ని వడ్డిస్తుంటే అక్కడ గిన్నెలోని గుప్పెడు మెతుకులు ఎంతకీ ఐపోవు

మరి అదే ఒడ్డునానుకుని అనుభవం నిండిన ఆకలుంది-

అక్కడ మమకారం ఎక్కువై మెడబడితే? తాగాల్సింది నీళ్ళు కాదు ఎదురు కూచున్న కళ్ళలో కంగారు.. చేయికడగడానికి చెంబు నీళ్ళిస్తే అవి ఊట బావులైన హ్రుదయాంతరాలు..
అదే ఒడ్డునానుకుని గుండెల్లో తడి ఉంది-

దండెంమీద చెమటని పిండి ఆరేసాక కష్టం కాస్త నడుం వాల్చుతుంది శ్రమ విశ్రాంతి తీసుకుంటుంది దగ్గెక్కు వైన గొంతులోగాలికి బొగ్గులు నిప్పులై పోయాక నలిగిపోయిన పరువు పదిలంగా పేర్చబడుతుంది

ఎందుకంటే అదే ఒడ్డునానుకుని ఓపికుంది-

తిరుగుతున్న సారె మీద మట్టి కుదురుగా కూర్చుంటుంది అందమైన ఆ ఆకృతికి ఆకలి రూపం తెలిసిపోతుంది బహుశా అదే ఒడ్డునానుకుని పనితనముంది-

మంచోన్ని ప్రేమించి , చెడ్డోడిని క్షమించడం తెలిసిన కాడ క్షమించడం కూడా ప్రేమించడం కిందకే వచ్చినకాడ ఒడ్డునానుకుని మనుషుల్లో కాస్త మానవత్వం ఉంది.

పుట్టుకకే ఒక జన్మ ధన్య మైతే
ఆ జన్మ ధన్యమై పాతికేళ్ళు కావస్తోంది.
ఆ ఒడ్డునే ఒకడు పుట్టింది
ఆ ఒడ్డుకే వాడు చేరింది.

22-10-2013

Comments 1. అక్కడ,
  దండెంమీద చెమటని పిండి ఆరేసాక కష్టం కాస్త నడుం వాల్చుతుంది శ్రమ విశ్రాంతి తీసుకుంటుంది దగ్గెక్కు వైన గొంతులోగాలికి బొగ్గులు నిప్పులై పోయాక నలిగిపోయిన పరువు పదిలంగా పేర్చబడుతుంది

  అక్కడ,
  మంచోన్ని ప్రేమించి , చెడ్డోడిని క్షమించడం తెలిసిన కాడ క్షమించడం కూడా ప్రేమించడం కిందకే వచ్చినకాడ ఒడ్డునానుకుని మనుషుల్లో కాస్త మానవత్వం ఉంది.
  గోదావరి ఒడ్డునానుకుని అనుభవం నిండిన ఆకలుంది.
  అనుభూతులతో నిండిన మంచి సాహిత్యం ఉంది. అభినందనలు కాసిరాజు!

  ReplyDelete

Post a Comment

Popular posts from this blog

కనీసం

F1.

షేరాటో