||ప్రేయసీ-11||
కలగన్నాను
కళ్ళను కాళ్ళు చేసి ఓ దేహంపై నడిచాను
తెల్లారిపోయింది
అద్దంముందు ఆమె చూసుకుంటుంటే పాదముద్రలన్నీ పెదాలేనట
అద్దానికి సిగ్గేసిందని కూడా చెప్పింది
పిల్లి చేసిన అల్లరికి పాలు ఒలకడం కాదు
మెలుకువొచ్చింది

నా పనులతో నేను మొదలైతే
అటుపక్కో కలొచ్చింది
కలలో ఒకడు విత్తనాలు చల్లాడనీ
దేహమంతా నీరు మళ్ళించాడనీ,
తడిలేని చోట అడ్డుకట్టవేసి మొలకెత్తే భూమిని ముద్దుగా తడిమి చూసాడనీ
ఇంకా ఇంకా ఎన్నో కదలు చెప్తున్న కొద్దీ విన్నాను

ప్రేయసీ
ప్రేమంటే వినగలిగిన కధేనని
పేరాకొక నీతి చొప్పున పది మందికీ చెప్పు
కలలో దేహం తడిచినా మనిషి మొలకెత్తుతాడు

వ్యాఖ్యలు

ప్రముఖ పోస్ట్‌లు