మట్టి పువ్వు

ఒరేయ్ ఎప్పుడూ పొలానికి నీళ్ళోదిలే నువ్వు
పేనానికి నీళ్ళోదిలావా ? ఈసారి ఇంటికొస్తే పొలం గట్టున పలకరించవా!
మరైతే నేనిప్పుడు పొలం గట్టుమీదే తిరిగినోడు ఏమయ్యాడోనని
పదడుగులు ముందుకెలితే
పల్లపు చెక్కలో పాతిక మూనలు చచ్చి కలగపువ్వులు పూసిన మనేదనడగాలా?

పొలం గట్టుమీదేముందో
వొంకరి తాడిచెట్టు ఒంగున్నకాడ
బోదులో దిగిన బోడిమొల స్నానం చేసేముందు
తడి రుమాలు అందాక ఆరుతూ ఉంటే అక్కడెల్లి కూర్చోని.
దాన్ని కాస్త అడిగి చూడాలా?

ఇప్పుడు కూడా పొగాకు చుట్ట నోట్లో పెట్టుకుని బొచ్చెనకాళ్ళ మీద కుచ్చూని
ఏ బగవంతుడు పొలం గట్టున పనిచేస్తున్నా
వాడి వీపు మీద వెన్ను పూసమ్మటా కారుతున్న ఓ వెండి ధారనడగాలా?

ఆ పొలం గట్టు మీద తిరుగుతున్నోడు
పురుగులమందు తాగి చచ్చాడని ఎవర్రా అంటున్నారు
మీ కళ్లుంటే మళ్ళీ చూడండి .
ఇప్పుడాగట్టు మీద పుట్ట గొడుగై పుట్టి
ఓ మట్టి పువ్వులా కనిపిస్తాడు వాడు.
చచ్చినా సరే రైతంటే మనకో ముద్దుందని చెప్పే ధైర్యాని పండిస్తున్నవాడు.

(ఒరేయ్ అల్లుడూ , ఇంజినీరు అని పిలిచే కాలావోరి బుల్లి మాయకి నివాళిగా )

వ్యాఖ్యలు

ప్రముఖ పోస్ట్‌లు