పోస్ట్‌లు

September, 2013లోని పోస్ట్‌లను చూపుతోంది

|| నాన్నోచ్చేసినట్టే ||

వీధిలో పిలకాయలంతా ఒకన్నొకడు చూసుకుంటూ
అల్లరిమానేసి కుదురుగా ఉంటే
నాలుగోరోడ్డులో మూడో ఇంటికి నాన్నోచ్చేసినట్టే.
కట్రాడుకున్న లేగదూడ కలియతిరుగుతుంటే,
ఎర్రావుముందు ఒట్టిగడ్డి మోపు ఉన్నాదంటే
పొలాన్నుండి నాన్నోచ్చేసినట్టే.

ఊరంతా తిరిగే ఊరకుక్క
కాలుమీద కాలేసుకుని మా మెట్లముందు పడుకుందంటే
ఊరెళ్ళి మానాన్నోచ్చేసినట్టే.
కాలుదువ్వుతూ కోడిపుంజు ఇంటి దరిదాపుల్లోనే తిరుగుతుందంటే
ఒడ్లగింజలతో నాన్నోచ్చేసినట్టే.
వాకిట్లో ముగ్గు చెరిగిందంటే,
దొడ్దేపు గోళెం నిండిందంటే
నీళ్ళకావిడేసి నాన్నోచ్చేసినట్టే.

నిద్రపోయానని శాంతంగా ఉండే శేంతమ్మ
అప్పుడప్పుడూ అరుస్తుందంటే
ఆలస్యంగానైనా నాన్నోచ్చేసినట్టే.

రుమాలు ముడివిప్పి , మెల్లగా తట్టి నన్ను లేపిందంటే
పప్పల పొట్లంతో నాన్నోచ్చేసినట్టే.
కాళ్ళ మీదకి దుప్పటొచ్చి, నా చెక్క బొమ్మపక్కన చెంబునీళ్లుంటే
పడుకోవడానికి నాన్నోచ్చేసినట్టే.

ప్రేమ పక్కలో పడుకున్నాక,
నులివెచ్చని కిరణాల ఉదయం పూట
గడ్డం మాసిన సూరీడు గుచ్చుతూ ముద్దెట్టుకుంటే
మేల్కొన్న నా మనసులోకి మా నాన్నోచ్చేసినట్టే.