॥ రాయడం రాక ॥
ఓఎండాకాలపు మెండి సాయంత్రం
మల్లెలారా ! మీ పొదల మాటున చెరో వైపుకు చేరి చూసుకుంటుంటే
పై ఎద కిందకి జారి , కాళ్ళ దగ్గర పడుద్ది
అపుడు వెలుతుర్లు పల్చగా కరిగిపోతుంటే
వెన్నెల్ని కత్తిరించి ఒంటికి తగిలించుకున్నట్టు ఏమిటా మెరుపు ? అని ఎవరైనా , ఎవరినైనా అడిగే ఉంటారు
అవన్నీ రాస్తాంటే ఎవరూరుకుంటారు

పాలశిల్పం మీద పెదవిమచ్చ తుడిస్తే పోతుందని మభ్య పెట్టి పడ్డ తిప్పలన్నీ తెలిసీ
రెండుకళ్ళలో ఒకే కల మాదిరి, చేసేది కావాలనడం నచ్చేదేదో తెలిసినట్టే ఉండడం పరిపాటి .
మేఘం పట్టిన మనసు చల్లగా మారి వానలా కురిసిపోవాలి. ప్రవాహమై నీలోకి పయనించాలి.
అదిగో
ఆవేళపుడు ఎటులగలదు? ఎద సందేహము?
ఉనికిని ప్రశ్నించే నోటికి , ఊపిరాడని స్థితి ఏంటోనని ఏకవీ అడగడు
కళ్ళు మాత్రమే కాదు, ఒళ్ళంతా చెమ్మ గిల్లిన సందర్భాలు చూసాక
కవులంతా నిశ్శబ్ద కవిత్వం రాయాలని చూస్తారు
06-08-2013

వ్యాఖ్యలు

ప్రముఖ పోస్ట్‌లు