॥ మట్టిపొద్దులో మిణుగురు పురుగు ॥

ఈరోజు
నీ గతమంటే గుర్తొచ్చేది ఒక్కటే
ఒకసారి నీళ్ళు నిండిన పేగులు నిద్దర్రాక చూస్తుంటే
నా లోపల, మనమేఆకలీ తీర్చలేదని మెతుకు మెతుకుతో మాట్లాడడం వింటాను
నాక్కూడా కడుపు నిండదపుడు .
అది గమనించిన మన మిణుగురుపురుగు పొద్దొడవకుండానే పనికి పోవడం చూసి
బడికిపోతూ నా మనసంతా మనూరి చేలల్లోనే ఒదిలేసాను
ఇప్పటికీ అది నా వెంట రాలేదు

పొద్దొడవని పంటచేల్లో నీ మొలకున్న గోచీ తెలుపుదే అని తెలిసింది అమ్మకేనేమో!
ఇప్పుడు అదొక్కసారి ఇస్తావా దాచుకుంటాను .
ఎప్పుడూ చెక్క పెట్టెలో తెల్ల బట్టలు అమ్మెందుకు దాస్తుందీ ?
మీ పెళ్లి బట్టలు కొత్తగా ఉన్నందుకేనా
మీ రంగిప్పుడు మట్టిరంగుమాకు

మట్టిగుమ్మాల్లో మనుషులుంటారని తెలిసాక
మనసెక్కడికీ పోదునాన్నా మీతోనే ఉంది చూడు

ఎప్పుడింటికొచ్చినా మనూళ్ళో ఉదయించే సూరీడు
ఓ మట్టి పొద్దులా కనిపిస్తాడు.
అది నువ్వేనేమో అని నా అనుమానం .
నీ శక్తే తనశక్తిగా మార్చుకుని
మన గుమ్మంలోని తిరిగే మిణుగురుపురుగు

నీకూ నాకూ రాత్రి సూరీడు మా అమ్మే తెలుసా !

(మట్టిపొద్దులో మిణుగురు పురుగు: మా నాన్నలోని మా అమ్మ ! నా ప్రధమ గురువులు వీళ్ళే గనుక ప్రేమతో ఈ రోజు పూజిస్తూ )

వ్యాఖ్యలు

ప్రముఖ పోస్ట్‌లు