పోస్ట్‌లు

July, 2013లోని పోస్ట్‌లను చూపుతోంది

॥ అమృతం కురిసిన రాత్రి ॥

అంతా నిద్రపోతున్న అమృతం కురిసిన రాత్రి అతనికీ, ఆమెకీ, వాళ్ళను గమనిస్తున్న నాకూ నిద్ర లేదు తన శక్తి మేరకు ఓ చిన్న దీపం వాళ్ళకూ నాకూ మధ్య చూపును ప్రసాదిస్తుంది నులకమంచమ్మీద అతనూ, కాళ్ళకట్టపై ఆమె ఉపశమన చలనాలు అతన్ని ఉక్కిరి బిక్కరి చేస్తాయి ఆమె కళ్ళు అతని కాళ్ళ దగ్గర కారిపోతాయి అతడు పసరు పూసుకొన్న ప్రవరుడిలా వెలిగిపోతాడు "ఒసేయ్ శేంతా నువ్వుంటే నాకింకేమీ ఒద్దు.. భాదని ఇట్టే మాయం చేత్తావ్ ! ఏముందే నీ దగ్గర ఆదేవతెంతే నీ ముందు " ఆ దేవుడు అంటుంటాడు .. మేత దొరికిన నిశ్శబ్దాలు ఆవార్త నావైపుకు మోసుకొస్తాయి. మెల్లిగా జరుక్కొంటూ వెళ్లి నులక మంచం ముందరికాళ్ళవద్ద మఠం వేస్తాను చెరో చెయ్యీ వచ్చి తలపై వాలుతుంది అసంకల్పితంగా ఆరుకళ్ళు తడుస్తుంటాయి .... ఊరేకన్నీళ్ళను దీపం ప్రదర్శనకు పెడుతుంది.. . మేం ముగ్గురం మహామౌనా్నికి శ్రోతలవుతాం ఆరాత్రి నిశబ్ధప్రేక్షకులమవుతాం గుడ్డిదీపపు దర్శకత్వాన మా నాటకం మొదలైనట్టు మాకు స్పురిస్తున్నపుడు అమృతంతో తడిసిన రాత్రికి తెల్లారకూడదని తెలీదు ఏం చేస్తాం మేమింకా అలాగే ఉన్నాం. అందరి దృష్టిలో ఆ రాత్రి మేము నిద్రపోయాం . మా పాత్రలు ఆ రాత్రిలాంటి రాత్రుల…

॥ ఫిక్షన్॥

నేను చూస్తుండగానే ఆ అర్ధరాత్రి పూట
చలికాచుకునే సూర్యున్ని చెంపమీద కొట్టింది ఓ వెన్నెలమ్మ
ఓరగా చూస్తున్నాడెందుకా అని!
అతనికి సిగ్గేసి ఆమె చీరనే కప్పుకున్నాడు
ఆమెకు చలేసింది కాబోలు, అతన్నే చుట్టేసింది
పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు ?
ఆ చలిని దాటేయడానికి ఆ రాత్రి సరసమే వాళ్లకి దారి మరి.
బతికేది ఏ బతుకైనా
దుఃఖమూ , సంతోషమూ తీసుకున్నోల్లకి తీసుకున్నంత మహాదేవా అనుకున్నారేమో

ఆ అర్ధరాత్రి నాకో పాఠంచెప్పి
ఆ చలిమంటను ఆర్పేసి
వెన్నెలమ్మా,సూరీడు వారి గుడిసెల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు
ఆర్పేసిన మంటలో నిప్పులు రంజుకుంటూనే వున్నాయి
వాళ్ళుమాత్రం కనిపించడంలేదు
గుడిసెలో గుట్టుగా నాన్పిక్షన్ నిద్రలో మునిగిపోయారేమో

॥ మట్టిపొద్దులో మిణుగురు పురుగు ॥

ఈరోజు
నీ గతమంటే గుర్తొచ్చేది ఒక్కటే
ఒకసారి నీళ్ళు నిండిన పేగులు నిద్దర్రాక చూస్తుంటే
నా లోపల, మనమేఆకలీ తీర్చలేదని మెతుకు మెతుకుతో మాట్లాడడం వింటాను
నాక్కూడా కడుపు నిండదపుడు .
అది గమనించిన మన మిణుగురుపురుగు పొద్దొడవకుండానే పనికి పోవడం చూసి
బడికిపోతూ నా మనసంతా మనూరి చేలల్లోనే ఒదిలేసాను
ఇప్పటికీ అది నా వెంట రాలేదు

పొద్దొడవని పంటచేల్లో నీ మొలకున్న గోచీ తెలుపుదే అని తెలిసింది అమ్మకేనేమో!
ఇప్పుడు అదొక్కసారి ఇస్తావా దాచుకుంటాను .
ఎప్పుడూ చెక్క పెట్టెలో తెల్ల బట్టలు అమ్మెందుకు దాస్తుందీ ?
మీ పెళ్లి బట్టలు కొత్తగా ఉన్నందుకేనా
మీ రంగిప్పుడు మట్టిరంగుమాకు

మట్టిగుమ్మాల్లో మనుషులుంటారని తెలిసాక
మనసెక్కడికీ పోదునాన్నా మీతోనే ఉంది చూడు

ఎప్పుడింటికొచ్చినా మనూళ్ళో ఉదయించే సూరీడు
ఓ మట్టి పొద్దులా కనిపిస్తాడు.
అది నువ్వేనేమో అని నా అనుమానం .
నీ శక్తే తనశక్తిగా మార్చుకుని
మన గుమ్మంలోని తిరిగే మిణుగురుపురుగు

నీకూ నాకూ రాత్రి సూరీడు మా అమ్మే తెలుసా !

(మట్టిపొద్దులో మిణుగురు పురుగు: మా నాన్నలోని మా అమ్మ ! నా ప్రధమ గురువులు వీళ్ళే గనుక ప్రేమతో ఈ రోజు పూజిస్తూ )