॥ శోభనాలు ॥


మొదలుపెట్టడం నీకూ, నాకూ కొత్తే కదా
నువ్వో నేనో చొరవతీసుకుని ఏదో ఒకటి చేద్దాం
మనకు చెవిలో చెప్పినవి చెప్పినట్టే చేయాలని ఇదివరకే తెలుసు
గడియ సరిగా పెట్టి కిటికీలు మూస్తే సరిపోదు
సర్ధడాలు ఆపేసి పక్కపైకొస్తే త్వరగా లైటార్పేదాం
నీకు తెలుసోలేదో గోడలకు చేవులేకాదు కళ్ళు కూడా ఉంటాయ్
అదిగో చూడు గుడ్లప్పగించి ఎలా చూస్తున్నాయో
వాటి కళ్ళకు గంతలు కట్టలేం గాని.
మనల్ని మనమే దాచేసుకుందాం!
శోభనం అంటే మనలోమనం దాగిపోవడం అని మెల్లమెల్లగా రాసుకుందాం!


పళ్ళూ పాలగ్లాసూ పాతబడిపోయి పక్కనొచ్చి కూర్చున్నాక
కళ్ళలో కళ్ళెట్టి చూస్తే వంద చందమామలు ఉదయించాలి.
అంత మాత్రానికే రాత్రైనట్టు నిర్ధారణకు రావద్దు.
వందచందమామలూ వెన్నెలై కురిసి మనం చల్లగా ఐపోవాలి .
ఒంట్లో వనుకుపుట్టి వేడిసెగ కోసం ఎదురుచూడాలి
వేడి సరిపోక తంటాలు పడుతుంటే ఎలాగోలా తెల్లరిపోవాలి
చెప్పాపెట్టకుండా సూరీడు వచ్చేసాక
చలీ,గిలీ ఏమీ ఉండనపుడు
చక్కిలిగిలి పెట్టుకుని చేరోపక్కకీ మంచం దిగాలి
శోభనం అంటే చలికాచుకోవడం అనే నిర్వచనం రాయాలి


కల్మషం లేకుండా ప్రేమించిన నాడు
ప్రేమించగలిగినవాడు పిల్లాడే అని
ఒల్లోపెట్టుకుని తల్లోచెయ్యేసి నిమురుతుంటే
స్వర్గ ద్వారాల్ని తట్టి చూసోచ్చాక
శోభనం అంటే సుఖం ఒడిలో సేదతీరడమే అని రాయాలి


 ఎన్నోసార్లు గాజులు చేసిన చప్పుడు సాక్ష్యంగా
నీ కళ్ళు మాట్లాడుతున్నది, నా కళ్ళతో విన్నాక
సుడులుతిరిగే ఆలోచనలు ముడులు విప్పుతుంటే
హృదయాన్ని కూడా తెరవాలి
ఆ క్షణాల్లో గుండెలోని గుసగుసలు వేళ్ళతో వీపుపై రాయాలనిపిస్తే
శోభనం అంటే మౌనంతో మాట్లాడడమే అని రాయాలి.


క్షణాల్ని మాయం చేసే సంభరం చేద్దామని
నీ గుండెపైకి చేరాక, నీకళ్ళు చేతులై నాగొంతు మూసేస్తుంటే
ఆ సంకల్పిత చర్యా ప్రభావాన్ని ఒళ్ళు దాటవేస్తున్నపుడు
ఏ అలికిడీ అడ్డుపడకుంటే
మాటలురాని గొంతులోని శోభనానికున్న నిర్వచనం
చలించడం అని తెలియాలి


సుగంధవనంలో సుఖాల క్షణాల్ని లెక్క పెడుతూ
నా నాశికారంద్రాలు నీ మేనిపై తిరుగుతుంటే
నీలో ప్రకృతి నావశమైనపుడు
నీ కనుసైగలతో మనసెరగడం మూలాన
నీ భూమినీ, ఆకాశాన్ని నేనే ఔతాను
అపుడు శోభనం అంటే విశ్వం ఆవిర్భవించడం .


కృతజ్ఞ్యత తెలిసిన హృదయభారాన్ని
నా నుంచి నీకో, నీనుంచి నాకో మారుస్తున్నప్పుడు
చేతివేళ్ళమీదో, చెంపలపైనో, నుదుటిబొట్టు దగ్గరో
ముద్దు అనేది రెండుపెదాలు మోపిన ముద్రేతప్పు
మనమధ్య కోరికలా మారిందెపుడు ?
చుంభన సహిత నుదిటిమీద చెమటతో తడిచిన వెంట్రుకలు
తడిచి ముద్దవ్వడం గురించి చెబుతానంటే
మనమెందుకాపాలి? అన్న నీ చొరవచూసి
శోభనం అంటే కృతజ్ఞ్యత అని కొద్దిగానైనా రాయాలి.


కౌగిలించుకున్న ప్రతిసారీ కన్నీరే కార్చాం కదా
కలగలిసిన మనం కన్నీరైనపుడు
తుడిచిన వేళ్ళకి తెలీదా ప్రేమ నిర్వచనం ?
అపుడు నువ్వేసే ప్రశ్నలన్నింటికీ జవాబులు లేని జాబితాను తయారు చేస్తుంటే
మనకు సరసం తెలీదని నిర్ధారణకు వచ్చిన
ఆ మన్మదుడికి తియ్యగా ఏడవడం గురించి తెలియాలి పాపం
శోభనం అంటే సమ్మేళనం అని రాయాలిపుడు


అంతా అనుకుంటున్నట్టు
ఒక్కటైపోవడమే శోభనమైతే
ఒక్కరోజులో అయ్యేపనా?
నీకూ,నాకూ అది చేతగాని తనం
అందుకే కదా అన్న్నన్ని సార్లు కలిసాం
మనకే కాదు ఆ చేతకానితనం అందరికీ అబ్బినట్టుంది
అదే చేస్తున్నారు అంతా
ఈ సారి శోభనం అంటే సాదించడం అని నిర్వచనం రాయాలిమనం


కాలం ప్రవహించి జ్ఞ్యాపకాలు గూడు కట్టుకుంటున్నపుడు
కాలం కుదించబడి నిర్వచనాలు కరువైపోయిన ఛాయలు కనిపిస్తాయి
అప్పటికిక కలిసిపోవడం శోభనం అని
చివరి నిర్వచనం చెప్పి
మట్టిలో మట్టై కలిసిపోదాం మనం


(నాన్నగారి మిత్రుడు అనంత రామయ్య గారికి అంకితమిస్తూ )
-కాశిరాజు

Comments

  1. రాస్తూ వుండిలా,.గోదారిలా,...plese remove word verification

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

కనీసం

F1.

షేరాటో