॥ ప్రేమకొక ప్రార్ధన॥
మనం ప్రేమించుకున్నామని అనుకున్నాక
నిన్ను నా హృదయంలో వుంచకపోతేనిన్ను నా జ్ఞ్యాపకాల్లో భ్రమించకపోతే
నా ప్రార్ధనలలో నిన్ను కోరుకోకపోతే
నీ ఉనికెక్కడుందోనని నన్నడుగుతావు
నేనేమో
శాంతి చేకూర్చే మౌనాన్ని సమాధానమిస్తూ
నిన్ను అంతటా వెతుకుతాను


నీకు గుర్తుందా !
దేవుడిముందు
ఒక ఉదయాన్ని రెండు ముక్కలు చేసి
గుడిమెట్లమీదే పంచుకుని తిన్నాం
ఆ పూట,
మన ప్రేమ ఈ ప్రకృతంతా పరుచుకున్నాక
మనల్ని చూసి నవ్విన పూజారి
మనచేతిలో గుప్పెడు పూలెట్టి వెళ్ళాడు
ఆ పరిమళాన్ని ముందు పీల్చేదెవరా అని
దేవుడు దొంగ చాటుగా చూసాడేమో!
నిన్ను మాత్రమే పిలిచాడు
ఇక నువ్వు తిరిగొస్తావా ? నాకంటే దేవుడే గొప్ప.


ఇపుడు ఎంతో పాతవైన ఆ గుడీ, మెట్లూ
అక్కడ అలాగే వున్నాయి
ఆ దేవుడూ, పూజారీ బలే నవ్వుతున్నారు
కానీ
నువ్వు నాకు కొత్తదానివేగా
మీ అమ్మా,నాన్నలకి చిన్న పిల్లవేగా
చింతకాయలు దంచి, కారం కలిపి
కొత్తరుచుని మీ చెల్లిల్లకు పంచినదానివేగా !
లేగదూడ తాడుతెంపి ప్రకృతి పాలిస్తుందీ చూడమన్న దానివి
మరి నువ్వెందుకు లేవిక్కడ?
ఇదిగో దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు చాలామందే ఉన్నారుగానీ
నువ్వొచ్చేసేయ్
అతనిమీద అసూయకొద్దీ చెబుతున్నాను
నువ్వు మళ్ళీ పుట్టుకొచ్చేసేయ్
మాకు ప్రేమించేవాళ్ళు తక్కువనిచెప్పి వచ్చేయ్ సుమీ


-కాశిరాజు


వ్యాఖ్యలు

ప్రముఖ పోస్ట్‌లు