||కధ కానిదేదో||అనగనగా ఓ రోజు
భూమ్మీద పడగానే పొత్తిళ్ళలోపెట్టిన నన్ను
ఓ రెండు చేతులు మరింత పక్కకు లాక్కుని
పెదవులకందించాయట.
ఆ పెదవులేమో పుట్టుకను రిజిస్టర్ చేస్తూ
ముద్దుముద్రను నా నుదుటిపై వేసాయట.

మరోమూడు నెలలకి
ఒళ్లోవున్ననాకు ఓ చెయ్యి ఉగ్గుగిన్ని అందిస్తే
మరో చెయ్యి అల్లర్ని అదుపుచేసిందట
ఆ ఒడేమో ఆకల్ని నింపేస్తూ
సుఖంగా నిద్రపోవడం నాకు నేర్పించిందట.

ఒక సంవత్సరం తరువాత
తప్పటడుగులు వేసే నన్ను
రెండు చేతులు ఆకాశానికి ఎత్తేస్తే
పెదాలు అరికాళ్ళను ముద్దడేవట.
ఆకాశమేమో నేలపైకి దిగొచ్చి
అమ్మ పక్కన నిల్చుని మానాన్నైపోయేదట.

మరో ఐదుసవత్సరాల తర్వాత
అదేచేతులు కొత్తచొక్కాకు పసుపురాసి
అరచేతిలోని అక్షింతల్ని
ఆయువుగా నా తలపై వేసాయట
ఆ అక్షింతలేమో అశ్రువుల్ని తోడుచేసుకుని
అమ్మకాళ్ళపై రాలేవట.

పదోతరగతి పాసైనపుడు
ఓ చెయ్యి నానోరుతీపి చేస్తే
మరో చెయ్యి తాళిబొట్టు తాకట్టుపెట్టి
పైచదువులకు పంపించిందట
ఆ ఆతర్వాత ఎగతాళికి గురైన ఆ తాళిబొట్టు
తొలినీటిబొట్టై నీలకు రాలుతుంటే
దోసిట్లో ఆ ముత్యపు చినుకును పట్టితెచ్చి
నా ముందున్చాడట మా నాన్న.

ఇంకొన్నాళ్ళకు
కధలో విరామం లేదుగాని
కధకి వయసొచ్చిందట
అప్పుడుకూడా అదే చేతులు
అవసరాల గుర్తెరిగి అన్నీ అందిస్తుంటే
కధకి వయసొచ్చినా,పోయినా
కధానాయకుడి బలం నాలుగుచేతుల సాక్షిగా పెరిగిపోతూనే వుందట

వ్యాఖ్యలు

ప్రముఖ పోస్ట్‌లు