నిరంతర ప్రవాహం
"Artists are the engineers of the human soul" -Stalin అన్న స్టాలిన్ మాటల్ని నేను మళ్ళీ వాడాల్సొస్తుంది. ఎందుకంటే ఈ మధ్య ప్రముఖ చిత్రకారుడు శ్రీ యస్.వి.రామశాస్త్రి గారి నిరంతర ప్రవాహం కవితా సంపుటి చదువుతుండగా కుంచెపట్టుకుని రంగులద్దుతారని తెలిసిన నాకు , ఆ చిత్రాలకు మాటలు నేర్పించి వాటితో మాట్లాడిస్తారని కూడా తెలిసింది. ఆయన రాసిన కవిత్వంలో అనుభూతులన్నీ చిత్రాలై కనిపిస్తాయి. "Art is the objectification of feeling" అన్నమాటలు మన అనుభవంలొనికి వస్తాయి. ఈయన ప్రవృత్తి చిత్రకళ అవడం వల్ల కాబోలు నిశిత పరిశీలనని మనం పసిగట్టవచ్చు. మంచి సున్నితమైన భావుకత్వం కలిగినవారీయన. అది పుస్తకంలో ప్రతిచోటా ఉంటుంది. ఇంకొక విషయం చెప్పాల్సివుంది, ఈయన కవి, చిత్రకారుడు మాత్రమే కాదు సంగీత అభిమాని కూడా! వాళ్ళది సంగీత కుటుంబమట. వారి తండ్రి దీక్షితులుగారూ, తాతగారు సంకిస తారకంగారూ సంగీత విశిష్టులని తెలియని వారూ లేరు.
నిరంతర ప్రవాహం అన్న శీర్షిక దృష్టిలో పెట్టుకుని మాట్లాడినా, ఇందులో ఉన్న అరవైనాలుగు కవితల గురించి మాట్లాడినా సరే సుకుమారత్వం, కరుణరసం ఒలికించిన తీరుగురించి ఇక్కడ చెప్పాల్సిందే. అందుకుగాను బుద్ధుడిమీద రాసిన "నిరంతర ప్రవాహం" అన్న కవితలో మంచు బిందువుతాకి/ఓ పువ్వు తల వూపినట్టు/ చిన్న గులకరాయిపడి నది నవ్వినట్టు/అతని ప్రేమామృతపు చూపుతాకి/మది కదిలి ప్రవహించే నది అవుతుంది" అంటూ బుద్ధునివల్ల శాంతి నిర్మాణం సాగినతీరుని ఎంత అందంగా చెప్పారో! శాంతి ప్రవచనంలో ప్రపంచం పల్లవిస్తుందని రాస్తూ బుద్ధుని హృదయం నిరంతర ప్రవాహమైన తీరుని ఈయన పంక్తుల్లో చూస్తే, కరుణరసాన్ని ఒలికించినతీరు జీవితంలో ఏ సందర్భానైనా సున్నితంగా తాకుతుందని చెప్పొచ్చు. కరుణరసం ప్రవహించేచోట ఏ ఆయుధం పనిచేయదట. ఎంతటి కటికుడైనా అతని ముందు శోకతప్తుడై అశోకుడవుతాడట. రాజు పేద లేని, వర్ణభేదం చూపని బుద్ధుని స్వభావం అందరినీ సంతృప్తులని చేస్తుంది అని రాసారు. ఇలాంటి కవితొకటి ఈ నాటి పాఠ్యపుస్తకాల్లోకి చేరితే శాంతి అనేది సమకూరుతుంది .

బంధాల్లోని బలాన్ని తెలుసుకోవడానికి,వాటిని మనతో నిలుపుకోవడానికి మనకు కొన్ని సందర్భాలొస్తాయి వాటిని పట్టుకోవడం తెలియాలి. అది ఈయనకి బాగా చేతనయ్యిందనుకుంటాను."నందివర్ధనం" అన్న కవిత చూడండి వాసనలేని పూలు వ్యర్ధం అనుకున్నారట. కానీ ఇప్పుడాపువ్వు ఇష్టమే అంటున్నారు. "గుమ్మాన్ని ఆనుకుని వున్న చెట్టునుంచి/మా పాప/ నవ్వులాంటి పువ్వుతెంచి/హ్యాపీ బర్త్ డే నాన్నా అన్నప్పటినుండీ నందివర్ధనం పరిమళం తెలిసొచ్చింది" అని రాసారు. ఇంకోచోట మానవత్వపు పరిమళాన్ని వెదజల్లారు. బాల్యాన్ని కోల్పోతూ స్వేదాన్ని చిందిస్తూ అప్పుడప్పుడూ వచ్చి అగరొత్తులు అమ్మే పాపకోసం రాసిన కవితలో పువ్వులేకాదు/నవ్వులూ పిల్లలూ ఎంత పరిమళిస్తారు/ అందుకే ఎన్నిసార్లు వచ్చినా ఆమె తెచ్చిన అగరొత్తుల్ని అడిగిమరీ తీసుకుం(కొం)టాను అని రాసారు. నిజంగా ఇది ఈయనలోని మానవత్వాన్ని మనకు చూపిస్తుంది. లాభనష్టాలను బేరీజు వేస్తూ అవసరంలేకపోయినా అడిగితీసుకుంటావెందుకు? అని మిత్రుడు ప్రశ్నిస్తే ప్రతీది అవసరమే అని తత్వంకూడా చెబుతారీయన. మనుషులంటే ప్రేమచూపించేవారు ప్రతీ మనిషితో ప్రేమించబడతారు. ఒక బిచ్చగాన్ని, బాల కార్మికున్ని గురించి రాసినపుడు కల్పించి(Fiction) రాయలేరు. వారిని ప్రేమిస్తే తప్ప వారి సుఖాలు దుఃఖాలు పూరిగా తెలీవు. ఒక చేతిలో నిప్పులగిన్నే ఇంకో చేతిలో నెమలీకల విసనకర్ర మోస్తూ గుమ్మంముందు నుంచుని సాంబ్రాణి చల్లి పరిమళాన్ని అందించే నెమలీకలవాడి గురించి రాసిన కవిత ఎంత హృద్యంగా ఉంటుందంటే కరుణించే వారికీ/ కరుణ చూపలేని వారికి మంచే జరగాలనుకుంటూ దివ్య ఖురాన్ లో సూరాలు పాడుతూ ఖుదా సదా కాపాడాలంటూ మంగళశాసనాన్ని లిఖిస్తూ వుండే అతని స్వభావ రూపాన్ని చక్కగా గీసారీయన.

కథంటే ఒక ముగింపు, ముగింపులో ఒక నీతిముక్తాయింపు అని "అనగనగనగా" అని ఒక కథ చెప్పారీయన . కథలంటే కుటుంబం, సమాజంమ్మీద గౌరవాన్ని విలువల్ని పెంచేవే కదా! పడమటివైపు సూరీడెల్లిపోయాక అమ్మమ్మ చుట్టు తిరిగేవాన్ని,తీవ్రయవ్వనంలో చదివేకథల్లో రాజకుమారున్ని నేను, అని తనలో కథల్నీ,కధల్లో తనని తాను కవిత్వం చేసికొని చూపించారు. కేవలం ఉత్తరం మాత్రమే రాయాలన్న ఆయన నాన్నగారి షరతు వల్ల ఉత్తరంపై అయనకు ఏర్పడ్డ ఇష్టాన్ని మనం కవితలో చూడవచ్చు.

కొన్ని ప్రదేశాలెప్పుడూ మనతోనే ఉంటాయి. మనం పుట్టిపెరిగిన ప్రదేశాలో లేక విహారానికి వెళ్ళొచ్చేవో, ఎటైనా వెళుతూ చూడాల్సివచ్చేవో అయివుండొచ్చు. అవి మనకు బాగా గుర్తుండిపోతాయి. అక్కడి జీవన విదానాల వల్లగాని, మనుషులపట్ల అక్కడివాళ్ళకున్న అభిమానంవల్లకాని, అక్కడి సౌందర్యంవల్లగాని మనం వాటిని మరిచిపోలేము. ముఖ్యంగా పల్లెటూళ్ళ గురించి ఇలాంటి కవితలు చూస్తాం. ఇవేవి కల్పితాలు కావు! పల్లెల్లోని వాతావరణం నిజంగా ప్రేమతో నిండివుంటుంది. కవితల్లో రాసిందానికంటే ఎక్కువే ఉండొచ్చు. అది అనుభవిస్తే తప్ప ఆ అనుభూతిని మొత్తానికి చెప్పలేం." ముక్కామల" అని ఈ రచయిత వాళ్ళఅమ్మమ్మ ఊరిగురించి రాసిన కవిత అలాంటిదే. రెండు కాలువల నడుమ రహదారి ప్రవహిస్తుంది/చూసిన లోకాన్ని కొత్తగా చూస్తూ బాల్యాన్ని చప్పరిస్తాను/వారంతా తడి ఆరని హృదయాలతో పలకరిస్తారు/" అలా మొదలవుతూ ఇంట్లో ఫ్రేముకట్టి ఉన్న పెద్దోల్ల ఫొటోలో ఇన్నాల్లకు వచ్చావా అని పలకరిస్తున్నట్టు ఉంటాయట.కిటికీలలోంచి ఊరిజనం ఇంట్లోకి చొరబడతారట.వడ్డించిన విస్తరినిండా ప్రేమ పరిమళాలే అని అంటారు. వెళుతున్నానన్నపుడు బావురమన్న ఆ ఇల్లు సాంబ్రాణి పరిమళం వీడని ఆ గోడలు రాచ్చిప్పలో ఇంగువ వాసన గుర్తొస్తాయట.ఒంటరిగా ఉన్నప్పుడు ఇతని గుండెను బోర్లిస్తే ఆ ఊల్లో ఉన్న చెరువు ప్రవహిస్తుందట. ఎంత పేమో చూడండి.ముక్కామల ఊరు నాక్కూడా తెలుసుగనక కవితచదివి మరింత బాగా ఆనందించాను.
సంక్రాంతి గురించి కూడా కొన్ని కవితలు చూసే ఉంటారు ఐతే ఇక్కడ ప్రత్యేకతను మెచ్చుకోవాలిమనం. అన్నీ సమకూర్చే నాన్న, అందర్ని చూస్తూ మురిసిపోతున్న అమ్మ, ముగ్గులూ, గొబ్బెమ్మలూ కోడి పందాలూ ఇదివరకటి కవిత్వాల్లో చూసాం! ఇక్కడ "ఇంటికి వచ్చిన కూతురు కొత్త అల్లుడు/తీరికదొరకని అత్తమామలు" అని రాసిన రెండు లైన్లు బలే నచ్చుతాయి మరి." గుప్పుమంటున్న నాటుసారా స్వరాలు/కొత్తగా అందరూ/మత్తుగా కొందరు/ ఊరు కొత్తబట్టలు ధరించి ఊరేగుతుందని అనడం కొత్తదనం చూపించడమే అవుతుంది. అందువల్ల కవిత మరీ బాగుంది. 

జీవనోత్సవం,అసందర్భ సమయం, వాంగో తో ఓ సాయంకాలం,రాగసందేశం ఇలా అన్ని కవితలూ మనతో కొన్ని విషయాలు చెబుతాయి.రామశాస్త్రిగారి గీతను మించిన రాతను గురించి మనం తెలుసుకొనే అవకాశమే నిరంతర ప్రవాహమైన ఆయన కవిత్వం. ఇది మీదాకా చేరాలని ఆశిస్తూ! సదా మీ
-కవిసంగమం(9701075118).

నిరంతర ప్రవాహం(కవిత్వం) 9493848455 
ముఖచిత్రం: రామశాస్త్రి
వెల:70/-
ప్రతులకు:విశాలాంధ్ర,ప్రజాశక్తి,నవోదయ పుస్తక కేంద్రా

Comments

Popular posts from this blog

కనీసం

F1.

షేరాటో