||తాటాకిల్లు||
అలికిన నేలమీద కుచ్చుంటే  
అమ్మ చేతులు అందంగా తాకుతుంటాయి 

బద్దెమంచమ్మీద పడుకున్నప్పుడు 
గోడలన్నీ నాన్నలా ప్రశాంతంగా కనిపిస్తాయి 
ఆయన ఓపికంతా  ఆ తెల్ల గోడలమీద 
పొరలుగా పరుచుకునుంది మరి 

పేడ  కల్లాపి పల్చగా చల్లాక 
పచ్చని ఆ వాకిట్లో 
గుల్లముగ్గు మెలికల్లో నా కళ్ళు చిక్కుకుని 
కాళ్ళను కాసేపు కదలనియ్యవు 
ఆ అందం ఆ మట్టికే సొంతం మరి 

శాంతిని అమ్ముతున్నట్టు 
తెల్లని ఉప్పు మూటొకటి వెనకాల కట్టుకుని 
ఉప్పోడొస్తాడు ఆ ఇంటికి 
సోలెడు బియ్యానికి అడ్డెడు ఉప్పేసినా 
ఆమె కయ్యానికి దిగకమానదు 
కాసింత కొసరేసి కనుమరుగయ్యేవాణ్ని చూస్తే 
ఆ బేరసారాల్లో బతుకుసారం తెలిసేది 

తాటాకులకు పట్టిన నల్లని కరుదూపం 
మాకు దగ్గోస్తే మందయ్యింది 
సూరుకు వేలాడే గుప్పెడు వరికంకులు 
చాలా పిచ్చుకల్ని పోషించాయి  

అరుగుమీద సున్నంబొట్లన్నీ 
ఆమెలానే  నవ్వుతుంటాయి 
పిల్లకాల్లో కట్టి తెచ్చిన ఆ చేపలమాము 
బొమ్మిడాయిల  వాసనకు తెగ మురిసిపోయేది 

అప్పుడు ఇప్పుడు అని కాకుండా 
మండే ఎండల్లో కూడా 
చల్లని సమయాలు ఆ ఇంట్లో కరిగిపోయేవి 

సూర్యుల్లాంటి నాన్నతో 
వెన్నెల్లాంటి మా అమ్మ 
ఆ ఇంట్లోనే మమ్మల్ని కనీ,పెంచింది

మా ఇళ్లంటే  
గోడలూ పై కప్పు మాత్రమే  కాదు  
రెండు దైవాలున్న ఒకే గుడి 


వ్యాఖ్యలు

ప్రముఖ పోస్ట్‌లు