Skip to main content

సమీక్ష : సమాంతర చాయలు

సమీక్ష : సమాంతర చాయలు

ఒక భావానుభూతి కవిత్వాన్ని చదివినపుడు నాకు చాలా సంతోషమేసింది, మన భారతీయ సంస్కృతిలో కవికి గొప్ప గౌరవం ఉంది. సాహిత్యంలో ఒక కవి పాటకున్ని శాసిస్తాడు. సమాజాన్ని శాసిస్తాడు. అందుకే కవులు అనధికార శాసనకర్తలు (పి.బి.షెల్లీ ) అన్నారు. ఒక శాసనకర్త ఐదేళ్లు మాత్రమే వుంటాడు. కానీ కవి జీవితకాలం,జీవితానంతరం ఉంటాడు. ఐతే ఇతను శాసనకర్త కూడా అవ్వాలని ఆశించడంలేదు. మనసులోని  మలినాన్ని కడుక్కోవడానికో,లేక ఒక సామాన్య మానవునికి ,సమిష్ఠ మానవునికి మద్య వైరుధ్యాన్ని చెప్పడంకోసమో కవిత్వాన్ని రాసి ఉంటాడు. కవిత్వం రాసే తరుణంలో మనకెంత తెలియనితనముందో తెలుస్తుంది మనకి,ఇతని కవిత్వం చదివాక.
ఒక కవికి జారిపోతున్న మొలతాడును బిగించి, దైర్యాన్ని గోరుముద్దలుగా తినిపించి మొనగాడిగా మార్చిన అమ్మమ్మ ఇందులో ఒక కవితై కనిపిస్తూ తన మనువడితో ఈ మాటలనిపిస్తుంది.
"అప్పుడే పూస్తున్న బీరపూలు సాక్షిగా
బుద్దులూ,సుద్దులూ పోస్తూ
స్నానం చేయించిన సంగతి
నా శరీరమింకా మరువలేదు "
పైవాక్యాల్లో స్నానం చేయించిన సంగతి నా శరీరమింకా మరువలేదు అనడం వెనుక ఒక ప్రత్యేకత ఉంది. నేనింకా మరువలేదనో లేక నా మనసింకా మరువలేదనో రాస్తే అమ్మమ్మ మీద చూపిన ప్రేమకాస్తా ఫిక్షన్లాగ కనిపిస్తుంది . శరీరమింకా మరువలేదు అనడంలో అదే శరీరం తను ఇప్పుడు మోస్తున్నాడు కనుక,అది అనుభూతి. అందువల్ల అనుభూతి రాయించిన పదం కనుక అంత బాగా చదవగలిగిస్తుంది. అదే ఇతని కవిత్వంలో రీడబిలిటీని పెంచింది.

ఒక నిర్దిష్టమైన వ్యక్తిగత అంశం(Concrete Personal Touch ),వ్యక్తిగత అనుభూతి(Personal feeling) అనేవి కవిత్వంలో ఉండాల్సిన 
ఖచ్చితమైన అంశాలు, భాహ్యవాస్తవికతకు సంబంధించి చరిత్రకు సంబంధించి సరియైన భావనల్ని ఎన్నుకోవడానికి కవికి చరిత్ర తెలిసుండాలి. సామాజిక దృక్పదం ఉండాలి. అప్పుడు ఇతివృత్తం చక్కగా ఉంటుంది. దీనికి ఉదాహరణగా ఈ పుస్తకంలో మంచి కవితలున్నాయి . సుమారు ఎనబైయేల్ల క్రితం ఒక భర్తచనిపొయిన స్త్రీ ఒక చేతిలో లాంతారు. చంకలో పిల్లాడు ,లోపల ఇంకో పిండాన్ని మోస్తూ పొలాల్లో తిరుగుతూ బతుకెల్లదీసిన రీతిని చాలా చక్కగా రాసారు. రాయడానికి ఒక వస్తువు మాత్రమే దొరికితే సరిపోదు,చరిత్ర కూడా తెలియాల్సుంది అని మనకు అనిపిస్తుంది . అలాగే "నాన్నకల్లు" అనే కవిత కూడా ఉంది ఇంట్లో ఎద్దు చనిపోతే వాళ్ళ నాన్న ఏడ్చిన తీరును చూసి
"అనుబందాలు అరుదౌతున్న సందర్భంలో
ఏడ్చిన నాన్న కళ్ళకు
ఎండిన ఏకొన్ని కళ్ళైనా జతకలిస్తే బాగుణ్ణు " అని చెబుతూ మనుసులు చచ్చినా ఏడవడంలేని ఈ రోజుల్లో మనుషుల్లో అనుబందాలు కరువచ్చినటువంటి ఒక విషయం గురించి రాసారు ."ఎద్దు పోతేనే గుండెలవిసిన నాన్నకల్లు /మానవత్వపు లోగిళ్ళు /బీడుగుండెలు కలియదున్నే నాగళ్ళు" అంటాడు .ఎంత చక్కని అనుబందం ఇది .

ఆకలి కొలత అనే ఇంకొక కవితలో
"పప్పు నెయ్యీ పరమాన్నం అన్నీ
మనసుకంచంలోనే వేసుకునేవాళ్ళం
అమ్మ చక్కిలిగిలి పెడితే నవ్వుకునేవాళ్ళం"
సరిపోనూ అనే పదం
మా జీవితాల్లోనించి
చెరిపేసి చాలా కాలమైంది. అని ఇక్కడ పేదరికపు జీవితాన్ని చెబుతూ ముగింపులో "ఆకలి చావులు కావట మనవి,అసలవి లేనేలేవట" అని చివరి మూడు పంక్తుల్లో ప్రజాసామ్య ప్రభుత్వాన్ని మనకు పరిచయం చేస్తారు. మళ్ళీ జన్మంటూ ఉంటే మనిషిగా పుట్టాలని లేదంటాడు. ఇలాంటి కవిత ఇందులో ఉండి తీరాల్సిందే.
ఈ పుస్తకంలో ఎర్ర కవిత్వం కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఎర్రకవిత్వం అనటం ఏంటంటే కాస్తంత విప్లవ దృక్పదం కూడుకున్నది అని నా ఉద్దేశ్యం.
"అయ్యా నాతోచదివే
జానెడుబెత్తుడు లేని పోరగాడు
నీకు బాబుగారా?
ననుగన్ననీవు
వాడికి ఏరా పోరా గాడివా ?
నాకొద్దీ పైసల బడి అక్కడ అన్నీ అబద్దాలే "అంటూ
ఒకపక్క పేదరికంపై,మరోపక్క విద్యావ్యవస్థల వ్య్యాపారధోరణి మీద కనిపించని తిరుగుబాటు ఒకటుంది. అలాగే తలపూలు అనే ఇంకో కవితలో
"నీతల్లో నిత్యం
నా తలపుల పూలు
నీ కల్ల చూపుల్లో నా వలపువాసన"
గతించిన కాలాన్ని నీకోసం మూటకట్టి తీసుకోచ్చానంటూ ఇరువురూ కన్న కలలన్నీ ఆ మూటలో ఉన్నాయి కాబోలు చెరిసగం పంచుకుతిందాం అని స"రస" కవితనొకటి చూపించాడు మనకి.

ఈ రోజుల్లో కవినీ,కవిత్వాన్ని తక్కువ చేస్తున్న వాళ్ళంతా ఏదోరకంగా కవిని,కవిత్వాన్ని వాడుకుంటూనే వున్నారు, ప్రకటన అనే ఒక కవితలో
"కవిత్వంలో తడిసిన
వస్తువులను
టీవీ తెరపై
నిత్యం ఆరబెడుతున్నారు " అవును ఇప్పుడు వస్తువులన్నీ కవితా హామ్పర్లై పస్తులుండే వారితోనూ ఓ వస్తువునన్నా కొనిపిస్తున్నాయి. యాడ్ మూడ్ ప్రపంచం కవితాకర్మాగారమై వింత విపణిని నడిపిస్తుందని కవిత్వాన్ని తక్కువ చేసే వారిమీదా అలాగే కవిత్వం మీదా కాస్త సెటైర్ వేసారు.

తడిక దడికి ముడివేయకుండా ఉండడం కాలింగ్ బెల్ మోగుతున్నా ,మెసేజ్లూ , ఫోన్ లూ ఉన్నా రావాల్సినవాడు రాకపోయేసరికి కంగారుపడుతున్న "ఎదురుచూపు " ఎలా ఉంటుందో చెబుతున్నప్పుడు వాళ్ళమ్మ ఏం చేసిందో ,వాళ్ళ ఆవిడ ఏం చేసిందో చెప్పడానికి కాదు. ఈ దుర్మార్గమైన సమాజం గురించిన భయం గురించి రాసిందేనని మనకర్దమవుతుంది .
శీర్షిక చూసి కవిత చదివే వారికి ఆ శీర్షిక ఆ కవితలో ఏముందో చెప్పేయాలి. అలాంటిదే గ్లోబలూరు కవిత.
"యంత్రించిన బ్రతుకులను
మనుషుల్లా మంత్రించాలి
ఆవుదూడ ఆటనూ
అమ్మవేసిన ముగ్గునూ
నాన్నవేసిన కోండ్రను చూపెట్టాలని ఉంది". అంటూ గ్లోబలైజేషన్ మారిపోతున్న నగర బతుకును పుస్తకాన్ని చేసి ,పల్లెను ముఖచిత్రంగా వేసి,ఇగిరిన సంతోషాలు మళ్ళీ చిగురించాలంటే పల్లె గంధం పూయాలంటాడు . ఇంకోచోట బతికినా కాలాన్ని పట్టి, అగ్గి పెట్టెలో పెట్టి ముందు తరాలకు అందించడానికి "ఫైర్ బాక్స్" లాంటి కవితొకటి కాలం పై నిర్మించబడ్డ సమాజసౌదపు పునాదిరాల్లను పునః పరిశీలించుకోవడానికి పనికొస్తుంది.
చెప్పులు షాపొచ్చినపుడు కాళ్ళు చెప్పులున్నట్టు కలగంటాయి , బట్టలషాపు దాటుతుంటే "చందనా,బొమ్మనాలు కన్ను కొట్టి పిలుస్తుంటే చక చకా సాగిపోవాలిపుడు"అని ఒక సగటు బతుకు గురించి ఒకచోట చెబుతారు.వగలుపోతున్న నగల దుకాణాలు కనిపిస్తే, ఎదిగిన ఆడపిల్ల బోసిపోయిన మెడ బావురుమన్న మౌనానికి సగటు బతుకు బతికే మనిషికి మనసు బద్దలౌతుంది. "అవి అద్దాల్లో బద్రంగా దాక్కుంటాయ్ కానీ, వాటి ముందనుండి నడుస్తున్న సగటు మనిషిమాత్రం చిద్రమైపొతాడు". ఇంత
బాగా సగటు జీవిగురించి రాయడానికి కారణం సమాజాన్ని పరిశీలిస్తూ ఉండడంలో ఒక భాగం.
ఒక స్నేహాన్ని పరువు పేరొకటి హత్య చేసింది చీకటడే వేల వెన్నలాటలకు వచ్చే దోస్తు కొత్త ఆట నేర్చుకున్నాను , చీకటి ఇప్పుడు తియ్యగా ఉందని చెప్పాక, గూళ్ళనుంచి తెచ్చిన కంకులు నలిపి రూపాయిగా మార్చి సినిమా చూసే స్నేహం కంటే బాగుంటుందా అని అడిగితే ,నీది చిన్నతనం కదా అర్దంకాదు అని, అంతు పట్టదని చెప్పిన స్నేహితున్ని పరువొకటి పల్లగోరు తోలుతూ పాము కరిచి చచ్చిపోయాడని ప్రకటిస్తే, ఆ నిజం తెలిసీ , నీకు చెడువిషపు చీకటి తియ్యగా ఎందుకుందో అని స్నేహితుని గురించి భాదపడుతూ ,స్నేహితున్ని తలచుకుంటూ, బతికున్న దెయ్యాల్ని పీకలు కొరకడానికి మళ్ళీ మనిషిగా రమ్మని పిలుస్తాడు .
చదివిన ప్రతీ ఒక్కరికీ ఇది తన వ్యక్తిగత అనుభూతి అని తెలుస్తుంది.

చాలా సంసారాల్లో అపార్దాలవల్ల చిక్కులొస్తాయి . ఏదో ఒక విషయంలో వాదన మొదలై అదికాస్తా గొడవవుతుంది అందుకే
"ఓడి పోవడం తెలిస్తే
గెలవడంలోని ఆనందాన్ని పొందగలుగుతాము "అని చెప్పిన కవితవల్ల అది చదివిన విన్న జీవితాల్లో ఎంతోకొంత మార్పువస్తుంది. పాత ముద్రలన్నీ పదిలంగా ఉండి కాలంతో వెనక్కి ప్రయాణించడం తెలిసినతర్వాత
"ఇప్పుడు నాకు తెలియాల్సినదల్లా
ఇప్పుడు నేను
అప్పటి నేను వైపుకి
ప్రయానించడమెలాగ?  అని తనకి తాను ప్రశ్నించుకుంటాడు. ఇందులో సమాదానం తనకి దొరికే ఉంటుంది.ఇలాటి సమాంతర చాయల వల్ల అది సాధ్యపడుతుందని వేరే చెప్పాల్సిన పనిలేదు.

ఈ పుస్తకంలో ఏ కవితైనా తన పని తాను చేసుకుపోతుంటుంది,పాటకుల్ని కాసేపు పలకరిస్తుంది.వ్యక్తినీ వ్యవస్థనీ ఆలోచింపచేస్తుంది. చిన్నతనంలో మొదలైన కవిత్వ అభిలాష మళ్ళీ ఈ కవికి కలగడం పాఠకుల అదృష్టం కూడా .
అలాగే ఈ పుస్తకం రాయడానికి సహాయంచేసిన కవి యాకూబ్ ,సీతారం,ప్రశేన్ గార్లను కూడా అభినందించాలి .ఈ పుస్తకం మనముందుకు రావడానికి మరో మూడు కారణాలున్నాయి.మంచి స్నేహితులు, శ్రీ శ్రీ కవిత్వం చదవడం,మూడవది ఇతను యాబైఏల్లకు ముందే పుట్టడం. ఇంత మంచి కవిగురించి,కవిత్వం గురించి రాస్తున్నపుడు ఆనందంగానే ఉంది .కానీ విడుదలపుడు "బ హుషా నేను కవిఉత్వమ్ రాయనేమో " అన్న మాటలు కాస్త విచారాన్ని కలిగించినా, ఇతని కవిత్వపు చాయలు మనకు మళ్ళీ కనబడాలని మనసారా కోరుకుంటున్నాను

-కాశి రాజు (9700767619)
సమాంతర చాయలు (కవిత్వం )
కవి:మువ్వా శ్రీనివాసరావు (99480 99900)
ముఖచిత్రం: ఎ .గిరిధర్ గౌడ్
వెల : 200
ప్రతులకు : విశాలాంద్ర మరియు నవోదయ పుస్తక కేంద్రాలు — with Kavi Yakoob andKranthi Srinivasa Rao

Comments

  1. సమీక్ష చాలా బావుందండి.!

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

F1.

కొంత సేపటికి ముందు.
"స్నానానికెళ్లినట్టున్నావ్" ఫోన్ తీసుకోలేదు.

కొంత సేపటి తర్వాత
స్నానం చేస్తూ, నన్ను అర్ధం చేసుకున్నావో, అలవాటు చేసుకున్నావో
ఆలోచిస్తూ
తలపై నుంచి పోసుకున్ననీళ్లలో కలిసి ఇంకా ఇంకా కిందకి జారిపోతాను.
నీ ఒళ్లోకి, అక్కన్నుంచి సగం కలిపి నువ్వొదిలేసిన చద్దన్నం గిన్నెలోకి
అక్కన్నుంచి కొంచెం లేటుగానైనా నువ్వు కొనిచ్చిన ప్రతీ వస్తువులోకి
దూరిపోతాను.

మరికొంత సేపటి తర్వాత
మళ్లీ నీకు ఫోన్ చేసి, "ఇందాక ఏం చెప్పాలో తెలీక ఫోన్ కావాలని తీసుకోలే"దంటాను.
నువ్వేమో తెలుసులే అని కూడా అనవు. నిజంగా నవ్వుతావు
మా చిన్నిప్పుడు నువు చాలా మందికి చెప్పిన "కొంచెం ఇబ్బందుంది ఇంకొక్కరోజాగు" అన్న మాటలా ఇప్పుడు నేను
ఓ ఐదారు నిమిషాలు నిజంగా బతగ్గలిగితే చాలు నాన్నా .

కనీసం

నడుస్తూనో నటిస్తూనో
కొంత మాట్లాడుకుని, వెళ్లిపోతూ నవ్వుకునే ముఖాలమే మనం

ఇంకా కుదిరితే
అనుకుంటున్న ఇష్ట సమాధిలోకి చెరోసగం చేరిపోదాం
ముడివేయబడొద్దని నువ్వో,
ముచ్చటైనా తీరుద్దని నేనో, మళ్ళీ మళ్ళీ కనీసం కలుద్దాం.
ఇంకా కుదిరితే ...
నువ్వు సమస్తమవ్వు, నేను చివరంచుకి నడుస్తా

షేరాటో

పళ్లుగిట్టగరిసి కళ్ళు మూసీ తెరుస్తూ వొస్తున్నమంటనాపుకుంటూ బతిమాలుతుంటే మెల్లగా ఏల్లెంబడి ఉచ్చ ఉండుండీ కొన్ని చుక్కలు కారాక , విదుల్చుకునీ వెనక్కొంగీ రోడ్డేపు చూస్తే దూరంగా ఎక్కాల్సిన బసొస్తుంది. పనేమో పూర్తవలేదు. కాళ్ళు రెండూ ఎడంగాపెట్టి ఇంకా తినికీ,తినికీ బతిమాలుతూనే ఉన్నాను. బసు దగ్గిరపడేకొద్దీ కంగారుతో కాత గట్టిగా జిప్ లాగితే ఉన్నది కాస్తా విరిగిపోయింది. నవ్వకండి నేన్నన్నది జిప్ గురుంచేలెండి. అప్పటిదాకా ఏక్షన్ షూమీద మెరుస్తున్న ఇస్త్రీపేంటుకున్న అందమంతా దొబ్బింది. మన దర్శన భాగ్యం, భాగోతం భాగ్యనగరమెందుకు చూడాలని, ఇన్సట్ తీసేసి చూసుకుంటే పొడుగు చొక్కాలో పెద్దాపురం తిరునాల్లో గెడలుమీద నడిచే జోకర్గాడిలా ఉన్నాను. గబ్బిలాయుల్లా ఊచలుపట్టుకు వేలాడుతున్న సమరవీరుల చంకల్లో వోసన పీలుస్తూనే ఎవడిదో కాలు కాతపక్కకు జరిపి నాకాలికోసం ఖాళీ చోటు చూసుకున్నాక పట్టుకోసం ఏదీ దొరకని కారణాన ఎవడిదో ఏదో పట్టుకు చిరాకుబడిపోయాక, వాడన్నాడు. “అయ్యో భయ్యా నాకున్నదొక్కటే బెల్టు. అదీ తెగిపోయింది ఇన్సట్ చేయకపోతే మా బాస్ తిడతాడు” అంటుంటే , విభూదితో అడ్డబొట్టు మీద తెలుగూ,తమిళం కలిసిన మొకంతో దాదాపుగా ఎంకన్నబాబు రంగున్న …