||గోదారి గొంతు ||


ఎవడే అమ్మా ఈడు ఎక్కడుంటాడే
ఏరోజుకారోజు ఏదోటి గోలే
రేవుదాటేకాడ కాపుకాస్తుంటాడే
వలవెయ్యబోయి చెయ్యితగిలిస్తాడే
పడవ ఎక్కగానే పనిగట్టుకూని
పక్కన కూచూని తెరఎత్తుతాడే
ఏగాలికేతెర ఎగరేయాలో అని
ఎనకాముందు నన్ను తాకడుగుతాడే
ఎవడే అమ్మా ఈడు ఎక్కడుంటాడే
ఏరోజుకారోజు ఏదోటి గోలే

లెగిసీ లెగ్గానే గుమ్మంముందుటాడే
నేముగ్గేయ్యబొతుంటే మెలితిరుగుతాడే
సేకుసంచితోన సంతకెలుతుంటే
సైకిలేసుకుని సిద్దం గుంటాడే
సంతకెలుతూ నా అంతుసూతానని
మెల్లగా సల్లగా మురిసిపోతాడే
ఎవడే అమ్మా ఈడు ఎక్కడుంటాడే
ఏరోజుకారోజు ఏదోటి గోలే

సందరడేయేల సంతనించొచ్చి
రేవులోకి నేను నీలుకెలతుంటే
కిళ్ళీ కొట్టుకాడ బుల్లీ ఆగే అని
ఎంట వత్తూ నాకంటపడతాడే
రెండు కడవలతో నేనొగుండగానే
ఆడి రెండు కళ్ళూ నా కుండలమీదే
ఎవడే అమ్మా ఈడు ఎక్కడుంటాడే
ఏరోజుకారోజు ఏదోటి గోలే

మెరకచేలోన కలుపుకెలతుంటే
మలుపు తిరిగేకాడ కూచునుంటాడే
ఎందాకోయని ఏమెరగనట్టే
ఏదో ఒకటి నాతో మాటాడుతాడే
చెప్పకూడదని నోరిప్పకుంటే
కుక్కపిల్లలా ఎంటవస్తాడే
ఎవడే అమ్మా ఈడు ఎక్కడుంటాడే
ఏరోజుకారోజు ఏదోటి గోలే

వ్యాఖ్యలు

ప్రముఖ పోస్ట్‌లు