||కవిని చూసాక||

కవిని చూదామని అతని ఊరెళ్ళాను
హాయ్ హలో హౌ ఆర్ యూ డూయింగ్ అని
అంతర్జాల ప్రేమను పంచుకున్నాక
అతనూరికెలాగూ వచ్చాను
కలిచొచ్చేతే ఓ పనైపోద్దని
కవిని చూదామని వెళ్లాను

హలో మీరెక్కడున్నారు?
పడవలరేవుకాడ గుడికాడకొచ్చేయండి
అన్న మృదువైన గొంతును కుదురుగా విని
నేనిక్కడే ఉన్నాను, మీరెక్కడున్నారు ?
అడిగాన్నేను!

సమాదానం చెబుతారేమో అని చూస్తుండగానే
మూడు బీప్ లు వినిపించేసరికి
నా ముందేవున్నాడాయన

కళ్ళు, కళ్ళను చూసుకున్నాయి
పెదాలు ,పెదాలతో మాటాడాయి
మనసు,మనసుతో ముడేసుకుందేమో !
లోలోతున ఉన్న ఉషారొకటి
లోపలే ఉండబట్టలేక ఉరకలేస్తూ
ఉత్సాహమై అరచేతుల్లోకి పరుగున వచ్చేసిందేమో
కరచాలనం కానించేసాం

కాసేపు కుచ్చున్నామో లేదో
ఇంకేంటంటే ఇంకేంటని
ఏమీలేదంటున్న ఎన్నోమాటల్ని
పడవలరేవు గుడిముందు
పంచేసుకున్నాం

చర్చలు సాగుతూనే ఉన్నాయ్
సమయాభావం ఇద్దరికీ!
కానీ
శీతాకాల సమావేశం ముగించాలని లేదు మాకు

ఈ ఒడ్డునుండి ఆ ఒడ్డుకీ
ఆ ఒడ్డు నుండి ఈ ఒడ్డుకీ
పడవలరేవులో పడవొకటి తిరుగుతున్నట్టు
ఇంకేమిటన్న ప్రశ్నల పడవ మా ఇద్దరిమద్య!

ఎవర్ని కలిసినా ఏదో ఒక గుణంవల్ల
వదల్లేనితనం నన్ను వెల్లనీయదు
మానవత్వం నిండిన మూటను
మనుషులముందు విప్పడానికి
పరిచయాల్ని పట్టి పోగేసుకొమ్మని
నేను ప్రేమించిన సాహిత్యం నాకు చెబుతున్న కొద్దీ
పోగేసుకుంటాపోయి
ఏదో ఒక రోజు పెద్దమూట మీ ముందు విప్పెస్తాను

(మా గోదారి బాబు బొల్లోజు బాబా గారిని కలిసాక )

వ్యాఖ్యలు

ప్రముఖ పోస్ట్‌లు