Skip to main content

సమీక్ష: ఇరువాలు(విడుదల సందర్భంగా)

                                                 
                                                                    

            కవిత్వం కాపురం  చేస్తున్న ఓ ఇంట్లో ఒక సాయంత్రం పూట ఖాళీగా కూర్చోలేక అల్మారాలు వెతకడం మొదలెట్టాను. పరిచయమైన పుస్తకాలు కొన్ని కనబడ్డా, కొన్నిటిపై చేయివేసి మళ్ళీ వెనక్కి తీసేసుకున్నా! సరిగ్గా ఓ బంగారు రంగు నాగలిబొమ్మ పుస్తకంమ్మీద దున్నుతూ “ఇరువాలు” అన్న శీర్షికతో కనబడేసరికి తీసి చూశాను. అది తెలంగాణా సాహిత్యవ్యాసాలతో కూడిన డాక్టర్ కాసుల లింగారెడ్డి గారి పుస్తకం. నేనాపుస్తకాన్ని ముట్టుకోవడానికి కారణం ఆ శీర్షికే. పుస్తకం మొత్తం చదవడం పూర్తి చేశాక ‘మంచిపుస్తకానికి మంచి శీర్షిక అవసరం’ అనేది భోదపడింది నాకు. ఆ ముఖచిత్రం,శీర్షికలే పుస్తకాన్ని నన్ను చదవమని ప్రేరేపించాయి.
ఇందులో మొత్తం పదిహేడు వ్యాసాలున్నాయి . తెలంగాణా చరిత్రని, ఉద్యమ నేపద్యాన్ని చక్కగా వివరించే వ్యాసాలవి. అన్నీ సాహిత్యంతో సంభందం ఉన్నవే ,కవిత్వం, కధా సంకలనాలకు రాసిన సమీక్ష వ్యాసాలవి. తెలంగాణా ఉద్యమ వ్యాసాలను చాలా చక్కగా రాశారు . అవి ఎన్నికలపైనా,ఉద్యమాలపైనా ఆయనకున్న దృక్పదాన్ని చెబుతాయి. ఇందులో ముక్యంగా మూడు వ్యాసాలున్నాయి. అవి కేవలం తెలంగాణాకు మాత్రమే సంబందించినవి కావు. అవి ఆధునిక వచన కవిత్వంలో వస్తుశిల్పాలు , ఉద్విగ్న మానస సంభాషణ, శివసాగర్ గురించిన నివాళి.

సరియైన సామాజిక దృక్పదం లేని కవి ఇతివృత్తాన్ని ఎన్నుకోవడంలో సందిగ్దానికి లోనవుతాడు. ఇది ప్రజా వ్యతిరేక కవిత్వమని అంటున్నారు. శిల్పం పరంగా బాగున్నా ప్రజా వ్యతిరేఖ కవిత్వం మంచి కవిత్వం కాదని అంటారు . చారిత్రక పరిణామక్రమం ,సామాజిక శక్తుల్లోని మార్పులు గూర్చి తెలియని కవి ఇతివృత్తాన్ని ఎన్నుకోవడంలో సఫలం కాలేడని అన్నారు. బాహ్యవాస్తవికతకు సంబంధించి సరియైన భావనల్ని ఎన్నుకోవడానికి,వస్తువుకు సరియైన ఇతివృత్తాన్ని ఎన్నుకోవడానికి కవికి సరియైన సామాజిక దృక్పదం ఉండాలని రెండవ వ్యాసంలో ఆధునిక వచన కవిత్వంలో వాస్తుశిల్పాల గురించి వివరిస్తూ అన్నారు. అలంకారాలు,ప్రతీక (symbol), కవిసమయాలు, భావచిత్రాలు(Images), రూపకం(Metaphor), అతిశయోక్తి (Hyperbole),వక్రోత్తి,శ్లేష,వ్యాజస్తుతి లాంటి ప్రతిభా ప్రదర్శకాలన్నీ మంచి ఉదాహరణలతో వివరించడం బాగుంది .కవిత్వ సృష్టికి అవి ఎలా ఉపయోగపడతాయో చక్కగా వివరించారు.

ఈ పుస్తకంలో ఉన్నవి పుస్తక సమీక్షలు అవడంవల్ల చాలామటుకు విమర్శలుగా అనిపిస్తాయి . ఒక కవిత లేదా కదా సంకలనం గురించి బాగుంది, ఇలా ఉంది ,అలా ఉంది అని రాయడంకంటే అలా ఉండటానికి గల కారణాలు కూడా అన్వేషించి ఎంతమంది సమీక్షలు రాస్తున్నారంటారు? ఈయన చేసిన మంచిపని ఏమిటంటే కారణాలు విశ్లేసించి అలా ఎందుకుందో వివరించారు. అవి చదివితే సమీక్షలెలా రాయాలో, విశ్లేషణ చేయడానికి మనకు ఏమేంకావాలో అర్దమవుతుంది. తెగిన ఉయ్యాలలో పగిలిన స్వప్నికుల కేరింతలు అన్న వ్యాసంలో శివసాగర్ గురించి మనకు మరింత వివరంగా చెప్పారు. శివ సాగర్ కవిత్వం విప్లవం దృక్పదం నుండి దళిత వాదంలోకి మారిన తీరుని చక్కగా రాశారు. ఒక్కటేమిటి, ఏ వ్యాసం చదివినా ఆయన పరిశీలన మెచ్చుకోకుండా ఉండలేము.
ఆయన పరిచయం గురించి చెబుతూ వ్యక్తిగత విషయాలను ప్రస్తావించినపుడు ఆయనేమీటనేది మనకు అర్దమవుతుంది.” నువ్వు కవిత్వమెందుకు రాస్తావ్?” అని ఎవరైనా అడిగితే “రాయకుండా ఉండలేను కనుక రాస్తున్నాను” అని అంటారీయన. అవును ప్రశ్నించే వారిలో కూడా కొందరు కవిత్వం మాట్లాడుతుంటారు, వాళ్ళంతా రాయకుండా ఉండగలరు. కానీ ఈయనలా కాదు అందుకే ఈ సమాదానం చెప్పి ఉంటాడు . ఈ పుస్తకానికి ముదుమాట రాసిన కాసుల ప్రతాపరెడ్డి గారే తన రచనా వ్యాసంగానికి మొదటి గురువని ఈ పుస్తకంలో చెబుతారు. “నన్ను నేను మానవీయ విలువలతో నిలబెట్టుకోవడానికి సాహిత్యం చదువుతాను/సహజ మానవునికి ,సమిష్టి మానవునికి మద్య వైరుద్యమే కవిత్వం/మనిషి అంతరంగంతో సంభాషించీ మానవత్వపు పరిమళాన్ని వెదజళ్ళేవాడు కవి “ అని ఆయన చెప్పిన మాటలరూపం మన ముందు పుస్తకంలా ప్రత్యక్షమవబోతుంది.
వేరు వేరు సభల్లో చేసిన ప్రశంగాలన్నీ ఒకచోట పొందుపరిచి ఈ వ్యాసాల సంపుటిని మనముందుకు తీసుకురాబోతున్నారు. వృత్తిరీత్యా డాక్టర్ కనుక ఆలోచనలు మరింత ఆరోగ్యంగా ఉంటాయి కనుక ఈయన సాహిత్యానికి శస్త్రచికిత్సా చేయదలిచాడు . ఈ ప్రయత్నంలో ఆయన సఫలం అవుతారని (అయ్యారు కానీ నేను మాత్రమే దృవీకరిస్తే సరిపోదేమో అని)ఆశిస్తూ !
                                                                                                -కాశి రాజు(కవిసంగమం)9701075118
ఇరువాలు(తెలంగాణా సాహిత్య వ్యాసాలు )
రచన: డాక్టర్ కాసుల లింగారెడ్డి (9948900691)
ముఖచిత్రం:అన్నవరం శ్రీనివాస్
వెల:70
ప్రతులకు : నవోదయ పుస్తక కేంద్రం మరియు అన్నీ ప్రముఖ పుస్తక కేంద్రాలు

Comments

Popular posts from this blog

F1.

కొంత సేపటికి ముందు.
"స్నానానికెళ్లినట్టున్నావ్" ఫోన్ తీసుకోలేదు.

కొంత సేపటి తర్వాత
స్నానం చేస్తూ, నన్ను అర్ధం చేసుకున్నావో, అలవాటు చేసుకున్నావో
ఆలోచిస్తూ
తలపై నుంచి పోసుకున్ననీళ్లలో కలిసి ఇంకా ఇంకా కిందకి జారిపోతాను.
నీ ఒళ్లోకి, అక్కన్నుంచి సగం కలిపి నువ్వొదిలేసిన చద్దన్నం గిన్నెలోకి
అక్కన్నుంచి కొంచెం లేటుగానైనా నువ్వు కొనిచ్చిన ప్రతీ వస్తువులోకి
దూరిపోతాను.

మరికొంత సేపటి తర్వాత
మళ్లీ నీకు ఫోన్ చేసి, "ఇందాక ఏం చెప్పాలో తెలీక ఫోన్ కావాలని తీసుకోలే"దంటాను.
నువ్వేమో తెలుసులే అని కూడా అనవు. నిజంగా నవ్వుతావు
మా చిన్నిప్పుడు నువు చాలా మందికి చెప్పిన "కొంచెం ఇబ్బందుంది ఇంకొక్కరోజాగు" అన్న మాటలా ఇప్పుడు నేను
ఓ ఐదారు నిమిషాలు నిజంగా బతగ్గలిగితే చాలు నాన్నా .

కనీసం

నడుస్తూనో నటిస్తూనో
కొంత మాట్లాడుకుని, వెళ్లిపోతూ నవ్వుకునే ముఖాలమే మనం

ఇంకా కుదిరితే
అనుకుంటున్న ఇష్ట సమాధిలోకి చెరోసగం చేరిపోదాం
ముడివేయబడొద్దని నువ్వో,
ముచ్చటైనా తీరుద్దని నేనో, మళ్ళీ మళ్ళీ కనీసం కలుద్దాం.
ఇంకా కుదిరితే ...
నువ్వు సమస్తమవ్వు, నేను చివరంచుకి నడుస్తా

షేరాటో

పళ్లుగిట్టగరిసి కళ్ళు మూసీ తెరుస్తూ వొస్తున్నమంటనాపుకుంటూ బతిమాలుతుంటే మెల్లగా ఏల్లెంబడి ఉచ్చ ఉండుండీ కొన్ని చుక్కలు కారాక , విదుల్చుకునీ వెనక్కొంగీ రోడ్డేపు చూస్తే దూరంగా ఎక్కాల్సిన బసొస్తుంది. పనేమో పూర్తవలేదు. కాళ్ళు రెండూ ఎడంగాపెట్టి ఇంకా తినికీ,తినికీ బతిమాలుతూనే ఉన్నాను. బసు దగ్గిరపడేకొద్దీ కంగారుతో కాత గట్టిగా జిప్ లాగితే ఉన్నది కాస్తా విరిగిపోయింది. నవ్వకండి నేన్నన్నది జిప్ గురుంచేలెండి. అప్పటిదాకా ఏక్షన్ షూమీద మెరుస్తున్న ఇస్త్రీపేంటుకున్న అందమంతా దొబ్బింది. మన దర్శన భాగ్యం, భాగోతం భాగ్యనగరమెందుకు చూడాలని, ఇన్సట్ తీసేసి చూసుకుంటే పొడుగు చొక్కాలో పెద్దాపురం తిరునాల్లో గెడలుమీద నడిచే జోకర్గాడిలా ఉన్నాను. గబ్బిలాయుల్లా ఊచలుపట్టుకు వేలాడుతున్న సమరవీరుల చంకల్లో వోసన పీలుస్తూనే ఎవడిదో కాలు కాతపక్కకు జరిపి నాకాలికోసం ఖాళీ చోటు చూసుకున్నాక పట్టుకోసం ఏదీ దొరకని కారణాన ఎవడిదో ఏదో పట్టుకు చిరాకుబడిపోయాక, వాడన్నాడు. “అయ్యో భయ్యా నాకున్నదొక్కటే బెల్టు. అదీ తెగిపోయింది ఇన్సట్ చేయకపోతే మా బాస్ తిడతాడు” అంటుంటే , విభూదితో అడ్డబొట్టు మీద తెలుగూ,తమిళం కలిసిన మొకంతో దాదాపుగా ఎంకన్నబాబు రంగున్న …