సమీక్ష: షాడో


మానవ సంభందాలు ఏమవుతునాయి ,ఏ సమాజం ఏ దారిగుండా పోతుంది ?ఎక్కడ చూసినా కృత్రిమత్వం .అంతా గందరగోళంగా అనిపిస్తున్నపుడు ఉద్వేగ భరితమైన ఆలోచనలు కూడా ఒక సంభాషణగా చెబుతూ ఉంటే బండబారాడని కొందరనుకుంటారనీ కృత్రిమత్వం వంటబట్టక కన్నీళ్లు అద్దెకు దొరికితే బాగుండుననుకొనే కవినీ, అతని కవిత్వాన్ని ఈ పుస్తకంలో చూడబోతున్నామంటే అది నిజంగా మన అదృస్టమే !
ఆమె అన్న శీర్షికతో ఒక స్త్రీ ఆంతర్యాన్ని తన నోటితో చెబుతూ
“పచ్చని నోట్లతో ఆమెను పచ్చిగా తాకగలమెమో గానీ
ఈని రాశులు పోసి ఆమె మనసును తాకగళం ?”
రహస్యభరిత జీవన్మరణ క్రీడలో ఆమె ఎప్పుడూ దేహాన్ని విసర్జిస్తూనే ఉంటుంది. ఆమెది కోల్పోవడం అనివార్యంమైన జీవితం .ఆమె పంచుతున్న సుఖానికీ ,ఆమె స్వేదానికీ ,కన్నీళ్ళకీ గురుతుల్లేవ్ అంటాడు .
ఇతనిలోని పరిశీలన,అన్వేషణ తెలుసుకునేందుకు వీలుగా ప్రశ్న లేకుంటే ప్రపంచమెక్కడిదీ,ప్రశ్న ప్రవహిస్తూ ఉంటుంది ఆకలి కడుపులనుండి ,శ్రామికుల చెమటి బొట్టునుండీ ప్రశ్న పురుడుపోసుకుందంటాడు.
తెలుగుకు వెలుగు చూపిస్తున్నాం ఉద్దరిస్తున్నాం అని ఊసులాడుకునే వాళ్ళకోసం ,తెలుగు మీద ఉన్న చూపు చిన్నదవడం వల్ల తెలుగుజాతికి జరిగే నష్టాన్ని నా తెలుగు కవితలో ఇలా రాస్తూ
“మడికట్టుక్కూచున్న ఇంగిలీసు బళ్ళో
ఇప్పుడొక మైలుపడ్డ పదం తెలుగు
ముఖానికి రంగులేసుకున్నోళ్ళు
తెలుగు మాట్లాడుతున్నప్పుడు
దేశ భాషలందు నా తెలుగు లేస్సే “
మనమిప్పుడు తలాకాస్తా సిగ్గుపడదాం ,మూకుమ్మడిగా మన తలలు దాచుకుందాం అంటాడు .
పుట్టి పెరిగిన భూమ్మీద మమతానురాగాల్ని,ప్రేమనూ చెబుతూ “నీకు దూరంగా ఎన్ని మైళ్ళు నడిచినా ఒక్క అడుగైనా నీకు తెలియకుండా వేయగలిగానా అని నువ్వు-నేను కవితలోని కోణం భూమిమీద అతనికున్న ప్రేమ, దానిని కాపాడుకోవాలనే తపన మనకు కనిపిస్తాయి .ఒక స్వప్నానికి ఎవరెన్ని నిర్వచనాలు చెప్పినా తను మాత్రం స్వప్నాన్ని వాస్తవం చేస్తున్నట్టు చిన్న విషయంలాగా
“స్వప్నం దిక్సూచి అవుతుంది
ప్రతి ఉదయానికి
జీవితం చేదైనా
స్వప్నం ప్రియమైనదేకదా “అనినాలుగు లైన్లో దాని గురించి చెబుతుంటే ఈ కవి భలే నచ్చుతాడు మనకి. ఎంత పరిశీలించినా ఎన్నికవితలు చదివినప్పటికి నాన్నకోసం తెలియాలంటే నాన్న అవ్వాల్సిందే అంటాడు.
నడవడం నేర్చిన బిడ్డలకు
నడిపించే దారౌతాడు “ అనిప్రతి నాన్నని ఈ పుస్తకంలో దూర్చేస్తాడు . ఎక్కడి నుండి వచ్చామో అక్కడికే పోతున్నాము అనిచెప్పడానికి ఎటు చూసినా ఒక్క మనిషీ కనిపించడం లేదు
“ఇక్కడ
ఎక్కడ చూసినా జంతువులే
మనుషులేమో అడవుల్లో తిరుగుతున్నారు “
నిజంగా ఇది తిరోగమనమే ,అడవుల్లోని జంతువులకంటే దారుణంగా ప్రవర్తిస్తూ మనమిక్క్డడ తిరుగుతుంటే,మనకన్నా జంతువులు నయం అడవుల్లో మనుషుల్లాగా బతుకుతున్నాయి .
కవిత్వం అంటే అదీ,ఇదీ అని కవిత్వం తలకెక్కి తైతక్కలాడేవాళ్ళ కోసం , ఏదీ కవిత్వం అని తన పంధాలో ప్రశ్నిస్తుంటే మనక్కూడా వత్తాసు పలకాలనిపిస్తుంది.జనాలకోసం రాసేటపుడు ఆకవిత్వం జనాలకి అర్దం కాకపోతే అదేం కవిత్వం అంటాడు .
“విమర్శకుల ఇనుప చక్రాలకింద
పరిశీలకుల పాము కాటుకు గురై
నురగలుకక్కుతూ చచ్చీచెడి
బతికిబట్టకట్టేదే పదామా?
ఆ పదాల సమూహమే కవిత్వమా?
అని ప్రశ్నిస్తూ జనం పట్టని జనం ముట్టని కవిత్వానికి చరిత్ర ఉండదని చెబుతాడు .
అందరూ అంగీకరించాలని లేదు గాని , చావును వాయిదా వేయడమే బతుకు అని చెబుతూ ,పిచ్చోడా చచ్చేదెలాగూ తప్పదు ,ఏ ఎలక్షన్ దొమ్మీలోనో రాజకీయనాయకుడు చచ్చినపుడో ,ఏ మత ఘర్షణలోనో ,కనీసం వరదలోనో మ్యాన్హోలే బురదలోనో నీ చావు ఫిక్స్ అయ్యింది. ఒకవేళ అప్పటికీ ప్రాణం పోకపోతే ఆల్కాహాలో ,ఆకలి చావో ఎలాగూ వచ్చిపడుతుంది.
“విసుగొచ్చి
ఈ జీవితాన్ని ఏ హుస్సేన్ సాగర్లోనో విసిరేద్దాం అనిపించొచ్చు
అవకాశమొస్తే అందరూ
అమ్మకడుపులోకి పోయేవోల్లే “ ఎలాగూ చచ్చేదానికి రోజూ చావడం దేనికీ,బతికినంతకాలం ఇవాలే చివరి రోజు అన్నంత కసిగా బతుకు అని ఆత్మహత్యలకు పాల్పడే యువతను ఉద్దేశించి చెప్పిన ఈ కవితా చూశాక .ఏ ఒక్కరూ చావడానికి సిద్దపడరని నేను కచ్చితంగా చెబుతాను .
మనసుని గాయపరిచి కన్నేటి సునామీలు సృష్టించేకన్నా నాటనేఒక్కోసారి నయమనిపిస్తుంది .అందుకే నాటనే ఒక కృత్రిమ వాస్తవం అని
“ఒక చిరునవ్వుతో
ఆత్మీయ ఆలంబనలు చుట్టూతా అల్లుకోవచ్చు” అంటాడు.
ఎండుకో కొందరిని వెర్రిగా ప్రేమిస్తుంటాం ,కొందరిని ప్రేమించడం ఓ వ్యసనం.దూరం చేసిన ప్రతిసారీ దగ్గరగా,చెరిపేస్తుంటే చిత్రంగా విడిపోయిన ప్రతిసారీ వాళ్ళు భద్రంగా మన గుండెల్లో ఒదిగిపోతారు.
“ఎన్ని మైళ్ళు దూరంగా జరిగినా
ఒక్క అడుగూ దూరం కాలేరు” సంభందాలను అల్లుకుపోగల సత్తా,అవంటే పడిసచ్చే మనుషులు ఎలా వుంటారో అనేది ఇతరులమీద ప్రేమకురిపించే ఈ కొందరు కవిత మన ముందుకొచ్చి చెబుతుంది .మద్యలో ఒకచోట మౌనం నిశ్శబ్ధ సంగీతం అనే నిర్వచనం చెప్పిన లఘు కవితా కనిపిస్తుంది. మనం దాన్ని పైకే చదివినా మౌనముద్రలు మనలోఉండటాన్ని గమనించుకోవచ్చు.
ఇంకా కొన్ని కవితల్లో ఎడిటింగ్ అవసరం ఉందని పాతకులకు కొందరికి అనిపించవచ్చు . ఐనా గాని ఈకవి ప్రెసెంట్ చేసే తీరువల్ల ఎడిటింగ్ చేయకపోయినా పర్లేదు అనిపుస్తకం మూసేసరికి మనకు అనిపిస్తుంది.ఈ పుస్తకంలో యాకూబ్ గారు రాసిన ముందు మాటను నిజం చేస్తూ తను ఉద్విగ్న మానస సంభాషణని తెలియజేసాడు .మనుషుల్లో అంతరించిపోతున్న సంభందాలు , ఒక ఇండివిడ్యువాలిటీకి అలవాటు పడిన జీవితాల గురించి ఒక సగటు వ్యక్తిగా అతని ఉద్విగ్తత, బాధ అన్నీ ఈ పుస్తకంలో చూడవచ్చు. మోటానికి అంటని అంతరంగం మనముందు ప్రతిబింబించే మాద్యమం ఈ పుస్తకం. ఏది ఇప్పుడు మీ చేతుల్లో ఉండబోతుంది.
-కాశి రాజు(9701075118)
షాడో (కవిత్వం)
కవి: చింతంప్రవీణ్(9346886143)
వెల: 50 రూ/-
ప్రతులకు: అన్నిప్రముక పుస్తక కేంద్రాలు


వ్యాఖ్యలు

ప్రముఖ పోస్ట్‌లు