మట్టివేళ్లు శ్రీనివాసరావు“ఒక మంచి పుస్తకం మంచి మిత్రుడు వంటిదైతే ,ఒక మంచి మిత్రుడు మంచి పుస్తకం వంటివాడే “ ఈ వాక్యాలు మిత్రుడు మట్టివేళ్లు శ్రీనివాసరావు కోసమే ! మాది అంతర్జాల ప్రేమ , మా ప్రేమ పరాకాష్టకు చేరి స్నేహమైన సందర్భం లో కలిశాం మేము. తన మాటల్లోని ప్రత్యేకత మెల్లగా పెనవేసుకుంది నన్ను , నాకే కాదు ఆ మాటలు అందరికీ ప్రత్యేకతను పరిచయం చేస్తాయి. అంతటి ప్రత్యేకమైన వ్యక్తిత్వం అతనిది. తను ఇటీవల రాసిన మట్టివేళ్లు బహుశా పూర్తిగా ఈ సమాజంలో పాతుకుపోవాలనే ఆశతో మొదలిపెట్టు ఉంటాడు.అది చదువుతూ ఉంటే ఎన్నో విషయాలు తెలుస్తూ ఉంటాయి , మానవీయత, నాయకత్వ లక్షణాలే కాదు , ఆవేశాలు,పరకాయ ప్రవేశాలు,సందేహాలు, సందేశాలు కూడా కనిపిస్తాయి , కాలాతీత గమనం కవితలో
“పలకరింపులు లేనంతనే
పరిచయాలు ఆగిపోవు
జ్ఞాపకాలు లేకపోతేనే
ఆవికాస్తా ముగింపుకొస్తాయని”సున్నితమైన పరిశీలన మనముందుంచుతారు , చిరునవ్వుల బాణాలు విసిరి శత్రుత్వాన్ని హత్యచేసి హంతకుడై కనిపిస్తాడు “హత్య” కవితలో
తెగిన దారాన్ని
పగిలిన అద్దాన్ని
అతికిద్దామని
మాటల మైనం ఎంత పూసినా
ఆవేశపు శకలాలు
వైవిద్యపు ఆవిర్లు చిమ్మితే
మైనం, కాలం వృదా,వృదా అంటూ ప్రయోజనంలేని “ప్రయాస” దండగని చెబుతాడు.
ఒకరి గురించి ఒకరు అంచనా వేయడం అంత సులువుకాదు, ఎవరిని ఎంత చదివినా కొంత మిగిలే ఉంటారేమీ అని ఆయన అభిప్రాయం , పూర్తిగా తెలుసుకోవడం ఎవరివల్లా కాదుగానీ తెలిసిన మట్టుకు వెల్లడి చేయమంటాడు,కొలతలకొక పరికరం ఉంటే కుదిరితే తెచ్చుకో అంటాడు,కానీ ఒక్కమాట నాక్కూడా చెప్పు అంటాడు . ఎప్పుడో జరిగే హానిని ఏమాత్రం నివారించలేనపుడు అప్పటివరకూ ఉన్న అనాయాచిత హాయిని ఆందోళనతో ఆహూతవ్వడమెండుకు ? ప్రయత్నం మాన్పించే ఆందోళనకంటే అమాయకత్వమే కొంత మేలని తన “దూరదృష్టి “ కవితని మన దగ్గరుంచుతాడు .మనుసులపై పెంచుకున్న అభిమానాన్ని మనసు పొరల్లోంచి తవ్వి తీసి ముందుపరుస్తాడాయన.
“ఆయనెవరో కనీసం కరచాలనం చేసెరగను
తన కవిత్వాన్ని ఏ కొంచెమో
తెలిసీ తిలియని నాలుకతో చప్పరించి ఉంటా “
పచ్చని అక్షరాల శరీరంతో , ఎర్రటి సంతకాల ముక్కున్న వాత్సల్యపు చిలుక పలకరిస్తే పులకించిపోయానని , గౌరవనీయులైన తాతగారూ మిమ్మల్నొకసారి చూసి ఉంటే ఎంతబాగుండునో అని ఇస్మాయిల్ గారిపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు . అలాగే భూమిపుత్రుడి బతుకునీ, ఆ బతుకు బలైన తీరుని ప్రభుత్వాసాయం చేరక,
“మల్లోకసారి ఆత్మహత్య చేసుకునే అవకాశమూ లేదు
చేసుకోకుండా సొంతోల్లని ఆపే శక్తీ లేదు
ఛీ......... పాడు బతుక్కి
చచ్చిసైతం సుఖం లేదు “ అంటూ జీవం లేని రైతుగా మనకు కనిపిస్తాడు .
“సమాక్య ప్రభుత్వమంత శక్యతతో చరించాలంటే
సమరధికి తగుస్థానం ఇవ్వాల్సిందే
అతిరధులమనుకునే వారంతా
అర్దరతులైతే సమర్ధులౌతారని
గ్రహించాల్సిందే మరి “.
ఇంట్లోకి ఓ టి.వి.కొందాం
విడివిడిగా రెండు రిమోట్లు అమ్ముతారేమో కనుక్కోవాలి మరి “ అంటూ అర్దనారీశ్వరతత్వాన్ని ఆకలింఫు చేసుకున్న అన్యోన్యత కవితా మనకు కనిపిస్తుంది .అది కూడా చాలదన్నట్లు పరకాయ ప్రవేశం చేసి చూపిస్తాడు
“కుండలోని ఎదురుచూపుల్ని
కంచం లోకి వడ్డిస్తే
కాలైనా కడుక్కోకుండా
కన్నీళ్లను జుర్రుకునే తాగుబోతు బర్తని ,వాడి కార్యాచరణని కళ్ళముందుంచుతాడు.దిండు మడతల్లో దాచుకున్న మొహంలో పక్కకు తిరిగి పడుకున్న నా నడుంమడతల గుండా రోకలిబండ పురుగులు నాలోపలికి పాకుతుంటాయి
రోకలిబండ పెదాల పురుగొకటి మెడవంపులో మరీ మరీ గుచ్చుకుంటూ ఉంటుందని ఒక ఆవేదనను అందరికీ అర్దమయ్యేటట్టు వ్యక్తపరుస్తాడు .ఈ రచయితదెంత పరిశీలనంటే నాకో గమనింపు ఉంది , వేళ్ళెప్పుడూ నేలలోనే ఉండాలని
“ఆదారమేకాదు , ఆహారమూ అక్కడే” అని తన మట్టి వెళ్ళు కవితలో అంటాడు పనియే దైవమని ఎంతమంది చదివి ఉంటాం , ఆ సామెతను ఎన్ని విదాలుగా చెప్పడో కర్మణ్యేవాధికారాస్తే మాఫలేసు కధాచనా కవితలో చూడొచ్చు.
మిత్రపొత్తం,చీకటిల్లు , కాలం చెల్లిన పాటలు , పండిత చర్చ , ఇలా ఒక్కొక్కటీ ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నదే అవన్నీ కవితలే అని ఆయనో లేక నేనో చెప్పను.కానీ ప్రతీ సందర్భంలోనూ ఏదో ఒక అంశాన్ని పంచుకోవాలనేది ఆయన ఆతృత. అది మట్టివేళ్ళు(కట్టా వేళ్ళు) చదివితే కచ్చితంగా అర్దమవుతుంది . పుస్తకం గురించో రచయిత గురించో రాశానని కాదుగానీ నాకో అభి ప్రాయం ఉంది అది నేను పంచుకుందామని నా ఆశ
“ప్రతీ వ్యక్తీ ఒక పుస్తకం , ప్రతీ పుస్తకం ఒక వ్యక్తే “ అందుకే వ్యక్తినీ, పుస్తకాన్ని చదవాలి వీలయితే చదివించాలి
- -కాశీరాజు (9701075118)


మట్టివేళ్లు
కవి :కట్టా శ్రీనివాస్ (9885133969)
ముఖచిత్రం: సుధాకార్
అంతర చిత్రాలు: పల్లం పిచ్చయ్య
పేజీలు:105
ధర:90

వ్యాఖ్యలు

ప్రముఖ పోస్ట్‌లు