Skip to main content

పీపల్ మే నీమ్

                                                    పీపల్ మే నీమ్
రహమతుల్లా “పీపల్ మే నీమ్”  కవితా సంపుటి చదవగానే  నేను ఆయన్ని నిన్ననే కలిశాను అనే ఫీలింగ్ పోయి , ఆయనతోపాటే నిక్కరేసుకుని తిరిగాను , ఆయనతో పాటే చదువుకున్నా, అనేంత దగ్గరయ్యాడు నాకు. ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చిన నాకు  చాలామంది సాహితీ మిత్రులు పరిచయం అయ్యారు! అలాగే అనుకోని పరిచయం ఈయనతో కూడా !
ఆయన్ని కలిశాక తను రాసిన “పీపల్ మే నీమ్”  చదివాను , ఆయన గురించి తెలుసుకోవాలంటే కలవాల్సిన పని లేదు, పీపల్ మే నీమ్ చదివితే చాలు అనిపిస్తుంది. .కవి,కధకుడు వారి వారి రంగాల్లో వేరు వేరు అనిపించే నాకు రహమతుల్లా విషయంలో అది సరికాదు అనిపించింది , ఈ రెండు ప్రక్రియల్లో ఆయన సమర్దుడు, నేను చదివిన పుస్తకాల్లో ఇది చాలా వైవిద్యమైన  కవితా సంపుటి. హిందువూ,ముస్లిమూ వేరు వేరు కాదని చెప్పే “సామాన్యశాస్త్రం” ఇది . ఇందులోని కవితల్లో చాలా మటుకు ఉర్దూ పదాలు కనిపిస్తాయి. ఉర్దూ తెలియని వాళ్ళకైనా  ఆ పదాల్లోని భావం ఇట్టే తెలిసిపోతుంది.
 బచ్ పన్ కవితలో ముస్లిం జీవితాల్లోని పేదరికాన్ని చెబుతూ “ సాయిబుల బేరం నిత్యం ఎగతాళినే , బాల్యమంతా తలకొట్టేసినట్లే , భయంతో సిగ్గుతో  ముడుచుకుని, ముడుచుకునీ నా దొర్బాల్యాలన్నిటికీ నసల్ గరీబీనే అంటాడు. ఆయన తల్లితండ్రుల్ని,భార్యాబిడ్డల్ని ఎంతగా ప్రేమిస్తాడంటే
“ మా నాయన ఇంటికొస్తేనే
మా బజార్లోని కుక్కలు ఇంట్లోకొచ్చి మంచం కింద దూరేవి,
తన ఎద్దుకు కుడిపి  తాపీ  దానికి కడుపు నిండాకే నిద్రపోయేవాడు ,
జైలుఅన్నం మిగిల్చి పక్షులకేసినా,
వీలుదొరికితే మొక్కలకు నీళ్ళు తాపిన సద్దాం చెడ్డోడంటే  
నేనేట్ల నమ్ముతను” అంటాడు .
ఇక ఈ సంపుటిలో “పీపల్ మే నీమ్” అనే దీర్గ కవిత గురించి కచ్చితంగా చెప్పుకోవాలి “ మా ఖత్నాలప్పుడో,సాదీలప్పుడో సంబరంగా ఊరేగుతుంటే  ఊరంతా ఆత్మీయంగా చూస్తుంటే గుండెలు తడిసి ముద్దయ్యేవి ,
జండాల్తో గడపల్లోకొచ్చినపుడు 
బిందెల్తో మా వాళ్ళకాళ్ళ మీద నీళ్ళు గుమ్మరించినప్పట్ల
వాళ్ళ పెళ్ళిళ్ళో నేనేట్ల ఎగురుతనో
నృత్యదేవత నాలో విహరిస్తున్నట్లు ఎగిరెగిరి 
అందరితో  సాయిబులూ కలగలిసి పంచబక్ష పరమాన్నాలు ఆరగించేటోల్లు” అని అంటుంటే ఆయన ముసల్మానా ? అనిపిస్తుంది. అంతలా కలిసిపోయే మనిసాయన .
మనుసుల్ని ఎంతగా ప్రేమిస్తాడంటే "మొర", "పెద్దమనసు బికారి". "సలాం బసారత్ సాబ్"  అనే కవితల్లో చూడొచ్చు. మనుసుల్నే కాదు చెట్లనీ,పక్షుల్ని ప్రేమిస్తూ
“ దిష్టి మచ్చంత  నల్లని మెడ,
కనిపించే ఆకాశం లాంటి కడుపు ,
మేఘాల్లాంటి బూడిదరంగు రెక్కలు ,
పాపం గుప్పెడంత ప్రాణి పిచ్చుక “ అని చెట్టుమీద,పిట్టమీద తన ప్రేమను “సర్కార్ చెట్టు” కవితలో చూపిస్తాడు .
                     ఇంకోచోట ప్రకృతిని ప్రేమిస్తూ “ తల్లి ముంగిట “ కవితలో చిన్న పిల్లాడై పాటకులందర్నీ తనతో పాటు నిక్కర్లు తొడిగి  తీరాలకు తీసుకెళ్తాడు . ఆ అనుభవాలతోనే  దేహం నిండా బట్టలున్న ఇప్పటికింకా ఆఫీసులో వంద వంకర్లు తిరుగుతూ వుంటాడాయన . ఇంతటి మంచి మనిషి మిత్రుడిగా దొరికినందుకు నేను ధన్యున్ని , కవిత్వానికి జయహో ............. కవికి సలామలేకుమ్.........
                                                                                                    -కాశిరాజు (9701075118)
పీపల్ మే నీమ్
పేజీలు :
ధర:
కవి: బా రహమతుల్లా(9490806022)

Comments

Popular posts from this blog

F1.

కొంత సేపటికి ముందు.
"స్నానానికెళ్లినట్టున్నావ్" ఫోన్ తీసుకోలేదు.

కొంత సేపటి తర్వాత
స్నానం చేస్తూ, నన్ను అర్ధం చేసుకున్నావో, అలవాటు చేసుకున్నావో
ఆలోచిస్తూ
తలపై నుంచి పోసుకున్ననీళ్లలో కలిసి ఇంకా ఇంకా కిందకి జారిపోతాను.
నీ ఒళ్లోకి, అక్కన్నుంచి సగం కలిపి నువ్వొదిలేసిన చద్దన్నం గిన్నెలోకి
అక్కన్నుంచి కొంచెం లేటుగానైనా నువ్వు కొనిచ్చిన ప్రతీ వస్తువులోకి
దూరిపోతాను.

మరికొంత సేపటి తర్వాత
మళ్లీ నీకు ఫోన్ చేసి, "ఇందాక ఏం చెప్పాలో తెలీక ఫోన్ కావాలని తీసుకోలే"దంటాను.
నువ్వేమో తెలుసులే అని కూడా అనవు. నిజంగా నవ్వుతావు
మా చిన్నిప్పుడు నువు చాలా మందికి చెప్పిన "కొంచెం ఇబ్బందుంది ఇంకొక్కరోజాగు" అన్న మాటలా ఇప్పుడు నేను
ఓ ఐదారు నిమిషాలు నిజంగా బతగ్గలిగితే చాలు నాన్నా .

కనీసం

నడుస్తూనో నటిస్తూనో
కొంత మాట్లాడుకుని, వెళ్లిపోతూ నవ్వుకునే ముఖాలమే మనం

ఇంకా కుదిరితే
అనుకుంటున్న ఇష్ట సమాధిలోకి చెరోసగం చేరిపోదాం
ముడివేయబడొద్దని నువ్వో,
ముచ్చటైనా తీరుద్దని నేనో, మళ్ళీ మళ్ళీ కనీసం కలుద్దాం.
ఇంకా కుదిరితే ...
నువ్వు సమస్తమవ్వు, నేను చివరంచుకి నడుస్తా

షేరాటో

పళ్లుగిట్టగరిసి కళ్ళు మూసీ తెరుస్తూ వొస్తున్నమంటనాపుకుంటూ బతిమాలుతుంటే మెల్లగా ఏల్లెంబడి ఉచ్చ ఉండుండీ కొన్ని చుక్కలు కారాక , విదుల్చుకునీ వెనక్కొంగీ రోడ్డేపు చూస్తే దూరంగా ఎక్కాల్సిన బసొస్తుంది. పనేమో పూర్తవలేదు. కాళ్ళు రెండూ ఎడంగాపెట్టి ఇంకా తినికీ,తినికీ బతిమాలుతూనే ఉన్నాను. బసు దగ్గిరపడేకొద్దీ కంగారుతో కాత గట్టిగా జిప్ లాగితే ఉన్నది కాస్తా విరిగిపోయింది. నవ్వకండి నేన్నన్నది జిప్ గురుంచేలెండి. అప్పటిదాకా ఏక్షన్ షూమీద మెరుస్తున్న ఇస్త్రీపేంటుకున్న అందమంతా దొబ్బింది. మన దర్శన భాగ్యం, భాగోతం భాగ్యనగరమెందుకు చూడాలని, ఇన్సట్ తీసేసి చూసుకుంటే పొడుగు చొక్కాలో పెద్దాపురం తిరునాల్లో గెడలుమీద నడిచే జోకర్గాడిలా ఉన్నాను. గబ్బిలాయుల్లా ఊచలుపట్టుకు వేలాడుతున్న సమరవీరుల చంకల్లో వోసన పీలుస్తూనే ఎవడిదో కాలు కాతపక్కకు జరిపి నాకాలికోసం ఖాళీ చోటు చూసుకున్నాక పట్టుకోసం ఏదీ దొరకని కారణాన ఎవడిదో ఏదో పట్టుకు చిరాకుబడిపోయాక, వాడన్నాడు. “అయ్యో భయ్యా నాకున్నదొక్కటే బెల్టు. అదీ తెగిపోయింది ఇన్సట్ చేయకపోతే మా బాస్ తిడతాడు” అంటుంటే , విభూదితో అడ్డబొట్టు మీద తెలుగూ,తమిళం కలిసిన మొకంతో దాదాపుగా ఎంకన్నబాబు రంగున్న …