పోస్ట్‌లు

December, 2012లోని పోస్ట్‌లను చూపుతోంది

|| ఋణానుబంధం ||

నాకు బాగాగుర్తు నన్ను ఒల్లో కుచ్చోబెట్టుకుని  నాన్నమీసం నువ్వు దువ్వుతుంటే  నా బోడిమూతిమీద  నీకాటుక  మీసంలా రాసుకొచ్చి  నాకూ దువ్వమని మూతి చూపిస్తే  నన్ను ముద్దేట్టుకున్నావ్ కదా 
ఇప్పటికీ అంతే ముద్దొస్తున్నానంటే   నేనింకా చిన్నపిల్లోన్నేకదమ్మా 
చానాల్లకి నీ చెతివంట తిన్నాక  మొదటిముద్ద  కారంగా ఉన్నా  రెండోముద్ద  కమ్మగా మారిపోతుంది  అమ్మవికదా  అందుకేనేమో ! మూడోముద్దకి మమకారం కలిపెట్టావా ఏంటి  కన్నీళ్లు కారుతున్నాయి  పిచ్చితల్లీ 
కారమెక్కువైందని  నువ్వు కళ్ళు తుడుస్తుంటే  మమకారమెక్కువైందని నానా కనిపెట్టేసాడు 
మీప్రేమిలా పెరిగిపోతుంటే  మీకు మరీ ఋణపడి పోతున్నానా? ఈ ఒక్కజన్మకీ బిడ్డనై  పుట్టిన రుణాన్ని  వీలైతే  వేలజన్మలదాకా సేవచేసి  వడ్డీ కాస్త  తీర్చుకుంటాను  
ఈ ఋణానుబంధాన్ని   అసలైన ప్రేమనీ అర్ధం చేసుకోవడానికి  పాతికేళ్ళు  పట్టిందంటే  ఎదుగుతూ ఎక్కడో తప్పుటడుగులేసానా?
31.12.2012

||ప్రేమలేఖ రాసా నీకంది ఉంటదీ ||

ఓ ప్రేయసీ ప్రేమంటే వయసువేడి ,యాసిడ్ దాడి అనుకుంటున్న ఈ  రోజుల్లో కూడా ప్రేమగురించి చెప్పడానికో  ప్రేమిస్తున్నానని చెప్పడానికో మనసులోని మాటలన్నీ అక్షరాలుగా మార్చి ఒక ఉత్తరం రాయడం కాస్త కష్టమే,ఒక ప్రయోగమే కానీ తప్పడం లేదు!
ప్రేమంటే జీవం, ప్రేమంటే ప్రాణం , ప్రేమంటే దైవం , ప్రేమే జీవితం, ప్రేమే శాశ్వతం అని అందరిలాగానో లేక మరికొందరిలాగానో నేను నిర్వచించలేను గానీ , ఆ నిర్వచనాలకు సరిసమానంగానో లేదా అంతకంటే ఎక్కువగానో నేను ప్రేమిస్తాను కనుక నేనూ ఒక లేఖ రాస్తున్నాను. నిన్ను ప్రేమిచడానికి కూడా కారణం అదీ,ఇదీ అని నా దగ్గర ఏదీ అట్టిపెట్టుకోలేదు తెలుసా! నువ్వు నాలాగ జీవిస్తావానో , లేక నాలాగ అలోచిస్తావనో , నా అంట అందంగా ఉన్నావనో  ఎందుకో ఏమో ఏదో ఒక భావం నిన్ను ప్రేమించేటట్టు చేసింది. ప్రేమను ఇవ్వడం లోని తృప్తి తీరేంతవరకూ  నేను ఇస్తూనే, ప్రేమిస్తూనే ఉంటాను సుమా!  అన్నట్టు చెప్పడం మరిచిపోయా నేను బతికుండగానే నా ప్రేమను తీసుకో! లేదంటే నేను చచ్చాక కూడా నిన్ను మరువలేను , మన ప్రేమకి ఒక జన్మచాలు మరీ అత్యాసెందుకు మనకి? ఒకజన్మలోనే చాలిందాం మన ప్రేమాయనాన్ని .ఏమంటావ్ ?? నీ జవాబును ఆశించడంలేదు గానీ , ఈ లేఖనీదగ్గర …

||ఓ వూరికథ||

అనగనగా ఓ ఊరు
సరిగ్గా శీతాకాల సాయంత్రం పూట
చీకటడిందని
సరసాలకు లేటౌతుందని
చాల్లే పొమ్మని
సూర్యుణ్ణి చెంపమీద కొట్టిందట

సూర్యుడు చిన్నబుచ్చుకుని
సిగ్గుతో
పడమటివైపు పొలాలగుండా
పరిగెట్టి పరిగెట్టి
అస్తమిస్తానని
రావిచెట్టుకాడ రేవులోకి దూకేశాడట

అంతే
ఊరంతా చీకటి కమ్ముకున్నాక
వీలైనన్ని సిగ్గులమ్ముకునేదట ఆ వూరు
రావాల్సినోల్లు రాక ఓసారేడిస్తే, వచ్చినోల్లు పోక ఇంకోసారేడ్చేదట
ఆ ఒచ్చిపోయే వాల్ల గురించి
దొడ్డేపు గుమ్మమో గుడ్డి దీపమో తప్ప
ఈది గుమ్మాలు ఇసుమంతైనా ఎరగవట

ఆ ఒచ్చిపోయే సచ్చినోల్లు
మెచ్చుకునే తీరు సూసి
ఆ వూరు సిగ్గుపడతావుంటే
ఆ సిగ్గు చిత్రమెయ్యాలన్న చిలిపి ఊహాతో
కులుకుతున్న కుంచె పట్టుకుని
సూర్యుడు మళ్ళీ సిద్ధమై తూర్పున తేలేవాడట.

23.12.2012

మట్టివేళ్లు శ్రీనివాసరావు

చిత్రం
“ఒక మంచి పుస్తకం మంచి మిత్రుడు వంటిదైతే ,ఒక మంచి మిత్రుడు మంచి పుస్తకం వంటివాడే “ ఈ వాక్యాలు మిత్రుడు మట్టివేళ్లు శ్రీనివాసరావు కోసమే ! మాది అంతర్జాల ప్రేమ , మా ప్రేమ పరాకాష్టకు చేరి స్నేహమైన సందర్భం లో కలిశాం మేము. తన మాటల్లోని ప్రత్యేకత మెల్లగా పెనవేసుకుంది నన్ను , నాకే కాదు ఆ మాటలు అందరికీ ప్రత్యేకతను పరిచయం చేస్తాయి. అంతటి ప్రత్యేకమైన వ్యక్తిత్వం అతనిది. తను ఇటీవల రాసిన మట్టివేళ్లు బహుశా పూర్తిగా ఈ సమాజంలో పాతుకుపోవాలనే ఆశతో మొదలిపెట్టు ఉంటాడు.అది చదువుతూ ఉంటే ఎన్నో విషయాలు తెలుస్తూ ఉంటాయి , మానవీయత, నాయకత్వ లక్షణాలే కాదు , ఆవేశాలు,పరకాయ ప్రవేశాలు,సందేహాలు, సందేశాలు కూడా కనిపిస్తాయి , కాలాతీత గమనం కవితలో
“పలకరింపులు లేనంతనే
పరిచయాలు ఆగిపోవు
జ్ఞాపకాలు లేకపోతేనే
ఆవికాస్తా ముగింపుకొస్తాయని”సున్నితమైన పరిశీలన మనముందుంచుతారు , చిరునవ్వుల బాణాలు విసిరి శత్రుత్వాన్ని హత్యచేసి హంతకుడై కనిపిస్తాడు “హత్య” కవితలో
తెగిన దారాన్ని
పగిలిన అద్దాన్ని
అతికిద్దామని
మాటల మైనం ఎంత పూసినా
ఆవేశపు శకలాలు
వైవిద్యపు ఆవిర్లు చిమ్మితే
మైనం, కాలం వృదా,వృదా అంటూ ప్రయోజనంలేని “ప్రయాస” దండగని చెబుతాడు.
ఒకరి గురించ…

పీపల్ మే నీమ్

చిత్రం
 పీపల్ మే నీమ్రహమతుల్లా “పీపల్ మే నీమ్”  కవితా సంపుటి చదవగానే  నేను ఆయన్ని నిన్ననే కలిశాను అనే ఫీలింగ్ పోయి , ఆయనతోపాటే నిక్కరేసుకుని తిరిగాను , ఆయనతో పాటే చదువుకున్నా, అనేంత దగ్గరయ్యాడు నాకు. ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చిన నాకు  చాలామంది సాహితీ మిత్రులు పరిచయం అయ్యారు! అలాగే అనుకోని పరిచయం ఈయనతో కూడా ! ఆయన్ని కలిశాక తను రాసిన “పీపల్ మే నీమ్”  చదివాను , ఆయన గురించి తెలుసుకోవాలంటే కలవాల్సిన పని లేదు, పీపల్ మే నీమ్ చదివితే చాలు అనిపిస్తుంది. .కవి,కధకుడు వారి వారి రంగాల్లో వేరు వేరు అనిపించే నాకు రహమతుల్లా విషయంలో అది సరికాదు అనిపించింది , ఈ రెండు ప్రక్రియల్లో ఆయన సమర్దుడు, నేను చదివిన పుస్తకాల్లో ఇది చాలా వైవిద్యమైన  కవితా సంపుటి. హిందువూ,ముస్లిమూ వేరు వేరు కాదని చెప్పే “సామాన్యశాస్త్రం” ఇది . ఇందులోని కవితల్లో చాలా మటుకు ఉర్దూ పదాలు కనిపిస్తాయి. ఉర్దూ తెలియని వాళ్ళకైనా  ఆ పదాల్లోని భావం ఇట్టే తెలిసిపోతుంది.  బచ్ పన్ కవితలో ముస్లిం జీవితాల్లోని పేదరికాన్ని చెబుతూ “ సాయిబుల బేరం నిత్యం ఎగతాళినే , బాల్యమంతా తలకొట్టేసినట్లే , భయంతో సిగ్గుతో  ముడుచుకుని, ముడుచుకునీ నా దొర్బాల్యాలన్నిటికీ నసల్…
కాశిరాజు || చీకటి సంగతులు||

సందకాడ
గుమ్మం ముందు కుచ్చూని
గుచ్చిన మల్లెలన్నీ
గుసగుసలాడుకుంటాయి
ఆటిదంతాఎదవబుద్ది
"అందర్నీ నలిపేద్దాం" అనే పధకమేసి
అయ్యే నలిగిపోతాయ్ ఆకరికి

తలుపులు మూతడ్డాక
ఒత్తిచిన్నదిచేసి ఎలిగించిన దీపం
చమురు మొత్తం అయిపోయినా
చూసీ చూడనట్టు
తంతుమొత్తం ముగిసేదాకా
ఇంతగా చూద్దామనుకుంటాది

దుప్పట్లో దూరేసారని
దీపం నిట్టూరుత్తుంటే
దుప్పట్లోపడ చీకటేమో
సిగ్గుల్ని చూడలేనన్నట్టు
కల్లకంతలు కట్టుకుంది

కాసేపయ్యాక
ఎనకనుండి
ఎవరో
ఏకాంతంమ్మీద బాణమేసినట్టు
తలుపు చప్పుడు చేత్తారు

"అబ్బా"
అప్పుడే తెల్లారిందా
అనడం అలవాటుగా మారిపోయిన ఆళ్ళిద్దరూ
తెల్లారాక కల్లునులుముకుంటూ
నిద్రపోతూ నడుస్తారు

ఇన్ని సూసి
ఊరికే ఉండడం వల్లకాక
వాళ్ళు ఒద్దన్నా సరే
చీకటి సంగతులని శీర్షికెట్టి
సాటింపేసేత్తాను...............

-కాశి రాజు
Date 09.12.2012

||నిరీక్షణ ||

అలా ఓసారి కన్నుకొట్టి
సూర్యుడితో జరగాల్సిందంతా
చెవిలో చెప్పాను
సరేనని
సాయంత్రానికల్లా తప్పుకుంటానని
ఒప్పుకున్నాడు


అమావాస్య అని అబద్దం చెప్పి
ఎలాగోలా ఆగిపోమ్మని
చంద్రుడికి ఇంద్రుడితో కబురంపాను
అతనూ రావడం లేదు


ఇక బూలోకంమ్మీద మాలోకాలన్నీ
ముడుచుకుని పాడుకునేలా
కాసేపయ్యాక వాళ్లకు నిద్రను నూరిపోస్తాను
నువ్వు త్వరగా వచ్చేయ్


పువ్వులున్న పక్కమీద
ఒక్కన్నే పడుకుని ఉంటా
వచ్చివాలు
ఎవరూ చూడరు
చూసినా పర్లేదు సిగ్గుపడకు
అసలు నువ్వు కనపడాలనే
రాత్రికి ఆ రంగేసాను
తెలుసా?


సరే
నేను వేచిచూస్తుంటా
వచ్చేయ్
మెలుకువుగా ఉండి
మాటాడుకుందాం కాసేపు
-కాశిరాజు

|| ? ||

ఎందుకోసమో
ఎక్కడో ఓచోట
ఏదో ఒక సాయంత్రం
అరువు తెచ్చుకున్న ఏకాంతంలో
ఏమితోచక కుచ్చుంటావు
అపుడు మనసు మనిషితో చేరి
మౌనమే భాషగా
శీతాకాల సమావేశం ఏర్పాటు చేస్తుంది
అందులో చర్చలేగాని
సమాదానాలు ఎంతకీ దొరకవు
వెతుకుతూ,వెతుకుతూ ఉంటే
నీ సక్సస్ డొంక  చేతికి తగిలాక
దాన్నికూడా లాగి  చూస్తావు
అది సాగుతుందే గాని సమాదానమివ్వదు
ఇక చేసేదేంలేక
మనసుని మనిషిలోకి చొప్పించేసి
సాదారణ జీవితం వైపు సాగిపోతుంటావు
నువ్వు అలా నడుస్తూ ఉండగానే
ఆలోచనలనే ఆలుమగలు
నీ మదిగదిలో దూరి
ముసలితనం మంచంమ్మీద
సష్టిపూర్తి సమయాన్ని పరిచి
అనుభవాల నెమరేస్తూ ఉంటే
నువ్వు నిద్రకు ఉపక్రమిస్తావు
-కాశి రాజు

||రసాత్మక కావ్యం ||

వయ్యారాల ఆకు మీద వక్కపెట్టి
చుట్టి నోట్లోకి చేరుస్తూ
కిల్లీమీద కవితొకటి
సిల్లీగా రాసేత్తాడు
పాన్ డబ్బా పాపారావు


కలైన కోరికలన్నీ
కలిపిరాస్తానంటూ
శృంగారం శీర్షికన
రసాభాష రభసేదో
సింగడు నా చెవినేస్తాడు


మలుపు దగ్గర ఎదురయ్యే
వలపు గురించి
కధ, స్క్రీన్ ప్లే , దర్సకత్వం వహిస్తాడు
పులుపు చచ్చి, చింత చావని సుబ్బారావొకడు


కాగితం మంచమ్మీద
అక్షరాల మల్లెలు చల్లి
పదాలతో నిండిన పాల గ్లాసు
పక్కనే పెట్తోచ్చాను
శోభనం జరుగుతుందేమో చూసొద్దాం రా అంటాడు
కంగారవుతూ మా రంగారావు


ఇలా ఒకరా, ఇద్దరా
కాలనీ మొత్తం కవులే ఐతే
కేరాఫ్ అడ్రెస్స్ రసాత్మక కావ్యం కాదా మరి !


-కాశి రాజు